నదుల తీరం.. చమురు క్షేత్రం !

9 Apr, 2018 12:19 IST|Sakshi
రాడార్‌ ద్వారా తాజా సమాచారాన్ని సేకరిస్తున్న ఓఎన్‌జీసీ నిపుణుడు

కృష్ణా–   తుంగభద్రతీరాల్లో చమురు నిల్వలు?

ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో మట్టి, నీరు నమూనాల సేకరణ

అత్యాధునిక రాడార్‌ సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే

ఏపీలో పూర్తి.. నేటితో అలంపూర్‌లోనూ ముగింపు

అలంపూర్‌ రూరల్‌: తెలంగాణకు దక్షిణ సరిహద్దులో ప్రవహించే కృష్ణా, తుంగభద్ర నదుల తీరాల్లో చమురు నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధనలు సాగుతున్నాయి. అలంపూర్‌ మండలంలో భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) జీపీఎస్‌ శాటిలైట్‌ ద్వారా న్యాచురల్‌ గ్యాస్‌(సహజ వాయువు), పెట్రోల్‌ , క్రూడాయిల్‌ వంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో రెండు రోజులుగా అలంపూర్‌ ప్రాంతంలోని తుంగభద్ర నది బిడ్జి కేంద్రంగా పరిసర ప్రాంతాలైన సుల్తానాపురం, ర్యాలంపాడు, కాశీపురం, సింగవరం తదితర గ్రామాల్లో రిగ్గు బోర్లు వేస్తూ మట్టి, నీటి నమూనాలను సేకరించారు. అత్యాధునిక రాడార్‌ వాహనం ద్వారా చమురు నిక్షేపాలను గుర్తించే తరంగాలను రిగ్గులోకి పంపుతూ అక్కడి పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని క్రోడీకరించుకుని తమ వద్ద ఉన్న ప్రత్యేక కంప్యూటర్లలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిక్షిప్తం చేస్తూ డెహ్రాడూన్‌లోని తమ ప్రధాన కార్యాలయానికి చేరవేస్తున్నారు. ఈ ప్రక్రియనంతా డేటా కలెక్షన్‌గా పేర్కొంటున్నట్లు ప్రాజెక్టు మేనేజర్‌ మురిగేషన్‌ ‘సాక్షి’కి వెల్లడించారు.  

40 ఏళ్ల క్రితమే సర్వే..
ఈ ప్రాంతంలో చమురు నిక్షేపాలు ఉన్నట్టు గత 40 ఏళ్ల క్రితమే నాటి సర్వే ఆఫ్‌ ఇండియా నివేదికలు పంపినట్లు ప్రాజెక్టు మేనేజర్‌ మురుగేషన్‌ తెలిపారు. ప్రస్తుతం క్రూడాయిల్‌ కోసం పశ్చిమ దేశాలపై ఆధారపడ్డాం.  దేశంలోని మోదీ ప్రభుత్వంలో సహజ వాయువులు, చమురు నిక్షేపాలను గుర్తించేందుకు జీపీఎస్‌ టెక్నాలజీని ఉపయోగించుకుని పరిశోధన నియమాలను సులభతరం చేసినందుకు డాటా కలెక్షన్‌ ప్రారంభమైందన్నారు. గతంలో డీబేర్స్‌ అనే వజ్రాల సంస్థ నడిగడ్డ ప్రాంతమైన కృష్ణా– తుంగభద్ర నదీతీర ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేసిన విషయం కూడా విధితమే.

చమురు నిక్షేపాలను గుర్తించడం
నదీతీరాల దగ్గర చమురు నిక్షేపాలు అధికంగా ఉన్నాయని జీపీఎస్‌ శాటిలైట్‌ సిస్టం ద్వారా గుర్తించిన  ఓఎన్‌జీసీ ఈ నిక్షేపాల పూర్తి సమాచారాన్ని సేకరించేందుకు 60 మీటర్ల విస్తీర్ణంలో శాటిలైట్‌ గుర్తించిన ప్రదేశాల్లో రిగ్గులను తవ్వి రాడార్‌ సంకేతాలను ఆ రిగ్గులోకి పంపుతున్నారు. అలా పంపిన సంకేతాలతో అక్కడ ఖనిజ నిక్షేపాలు, సహజ సిద్ధమైన వాయువులు, వాటి పీడనాలు ఏ విధంగా ఉన్నాయో సేకరిస్తున్నారు. జియోగ్రాఫికల్‌ సంకేతాల ఆధారంగా సేకరించిన సమాచారాన్ని ఓఎన్‌జీసీ సంస్థ విశ్లేషించి మరికొన్ని సార్లు పరిశోధించి చమురు నిక్షేపాలు లభ్యమయ్యే ప్రాంతాన్ని గుర్తిస్తుంది. అనంతరం నిర్ధారించుకున్న తర్వాత వాటిపై పరిశోధనలు జరిపి ఖనిజ నిక్షేపాలను భావితరాల అవసరాలకు అందేలా చర్యలు చేపడుతుంది.

మరిన్ని వార్తలు