గోదావరి తీరప్రాంతాల్లో ఆయిల్‌పామ్‌

17 Jun, 2018 04:02 IST|Sakshi

వంటనూనెల దిగుమతులను తగ్గించేందుకు ఉద్యానశాఖ ప్రణాళిక  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గోదావరి నదీ తీరప్రాంత జిల్లాల్లో ఆయిల్‌పామ్‌ సాగును చేపట్టేందుకు ఉద్యానశాఖ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. తద్వారా వంటనూనెల దిగుమతులను తగ్గించాలని అనుకుంటోంది. ఇందుకు రైతుల్లో అవగాహన, శిక్షణ కార్యక్రమాలు కల్పిస్తోంది. అలాగే నదీ తీర ప్రాంతాల్లో భూములు, వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత, తేమ వంటి వాటిపై అధ్యయనం చేయనుంది.

కేంద్రం నుంచి కూడా ఆయిల్‌పామ్‌ సాగుకు సహకారం అందుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో దాదాపు 24 వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తున్నారు. అలాగే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కూడా వందల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నారు.

ఎకరాకు 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తున్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. దాదాపు 3 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి వస్తోంది. దీనిని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో విదేశాల నుంచి ఏకంగా 1.51 కోట్ల టన్నుల వంటనూనెలు దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఉత్సాహం చూపుతున్న రైతులు
ఈసారి వంటనూనెలకు సంబంధించి కేంద్ర దిగుమతి సుంకం పెంచడం మన రైతులకు కాస్త లాభించింది. ప్రస్తుతం టన్ను ఆయిల్‌పామ్‌ గెల రూ.10 వేల వరకు పలుకుతోంది. దీంతో ఆయిల్‌పామ్‌ రైతులు మరింత ఉత్సాహంగా సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు చేయాలంటే ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఉండాలి. భద్రాద్రి కొత్తగూడెంలో నదీ తీరానికి దగ్గరగా ఉండటంతోపాటు నీటిలభ్యత ఉంది. వాస్తవానికి వరి పంటకు ఎంత నీరు అవసరమో అంతకంటే ఎక్కువగా ఆయిల్‌పామ్‌ సాగుకు అవసరం. అలాగే తేలికపాటి నేలలు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. ఆయిల్‌పామ్‌ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతంలో నిధులను కేటాయిస్తున్నాయి.

ఈ ఏడాదికి దాదాపు రూ.6.60 కోట్లు కేటాయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయిల్‌పామ్‌ వేసే రైతులకు నాలుగేళ్ల పాటు మొక్కలు, ఎరువులను సబ్సిడీపై అందజేస్తారు. మౌలిక సదుపాయాలన్నీ ఉంటే ఎకరా ఆయిల్‌పామ్‌ సాగు చేసేందుకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు