స్మార్ట్‌ ట్రాఫిక్‌

19 Mar, 2019 12:24 IST|Sakshi
ఒప్పంద పత్రాలను చూపుతున్న జయేశ్‌రంజన్, సందీప్‌ ఉపాధ్యాయ్‌

ట్రాఫిక్‌ నియంత్రణకు సాంకేతిక సహకారం అందజేయనున్న ఓలా క్యాబ్‌  

ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం  

ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌కు ఉపయుక్తం  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్‌నియంత్రణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందజేసేందుకు  ప్రముఖ క్యాబ్‌ సంస్థ ఓలా ముందుకొచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం
కుదుర్చుకుంది. ఓలా అందజేసే ‘స్మార్ట్‌ ట్రాఫిక్‌ సొల్యూషన్స్‌’ ద్వారా ట్రాఫిక్‌ నియంత్రణచర్యలను  చేపడతారు. ఈ ఒప్పందంతో ఓలా రూపొందించిన ‘ఇంటెలిజెంట్‌ ఇన్‌ సైట్స్‌’ను షేర్‌ చేసుకునేందుకు అవకాశం  లభిస్తుంది. దీంతో నగరంలో మొబిలిటీ సేవలనుమరింత పటిష్టంగా అమలు చేయొచ్చు. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, ఓలా రీజినల్‌ హెడ్‌ సందీప్‌ ఉపాధ్యాయ్‌లు ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. రవాణా సంబంధిత పాలనా వ్యవహారాలను బలోపేతం చేసేందుకు అవసరమైన మొబిలిటీ డేటా, ఉపకరణాల సృష్టికి ఓలా చేస్తున్న ప్రయత్నాల్లో ఇదో మైలురాయిగా నిలుస్తుందని జయేశ్‌రంజన్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నగర అభివృద్ధిలో మొబిలిటీ కీలక పాత్ర పోషిస్తుందని, సమగ్ర స్మార్ట్‌ సిటీ ప్లాన్‌ రూపొందించడంపై దృష్టి సారించామని చెప్పారు. ఓలా అందించే విలువైన డేటా ఇన్‌ సైట్స్‌ భవిష్యత్‌ అవసరాలకు ఎంతో దోహదం చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, ఓలాల ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ట్రాఫిక్, ట్రాన్స్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ను సరళీకృతం చేస్తుందన్నారు.  

డైనమిక్‌ మ్యాపింగ్‌ రూపకల్పన...  
ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఓలా సంస్థ భాగస్వామ్యంలోని వాహనాల నెట్‌వర్క్‌ ద్వారా నగరంలోని ప్రధాన రహదారులపై మెరుగైన ప్రయాణ సదుపాయాలను చేపట్టేందుకు కావాల్సిన డైనమిక్‌ మ్యాపింగ్‌ను రూపొందిస్తారు. ఆ డేటాను నగరంలో రహదారుల నాణ్యతను పర్యవేక్షించే, నిర్వహించే సంబంధిత ప్రభుత్వ విభాగాలకు అందజేస్తారు. ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ ద్వారా వచ్చే ఫలితం గుంతల కారణంగా జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు, రోడ్డు నిర్మాణాల నాణ్యతను పర్యవేక్షించేందుకు అవకాశం కల్పిస్తుంది. ఈ సందర్భంగా ఓలా రీజినల్‌ హెడ్‌ సందీప్‌ ఉపాధ్యాయ్‌ మాట్లాడుతూ... ఓలాకు అనుసంధానంగా ఆరేళ్లుగా నగరంలో లక్షల కిలోమీటర్లు తిరిగిన కార్లు, ఆటోలు, ద్విచక్రవాహనాల ద్వారా విలువైన సమాచారాన్ని సేకరించినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందం ప్రజోపయోగం కోసం  వినియోగంచడంలో ఒక ముందడుగు అని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌లో సాంకేతికతక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ సిస్టమ్, ఆటోమేటెడ్‌ ట్రాఫిక్‌ చలాన్స్‌ వంటివి ఇప్పటికే అమల్లో ఉన్నాయని, ఇప్పుడు ఈ భాగస్వామ్యం స్మార్ట్‌ హైదరాబాద్‌ను నిర్మించేందుకు దోహదం చేస్తుందన్నారు.

మరిన్ని వార్తలు