‘పీక్‌’ దోపిడీ!

24 Aug, 2019 11:00 IST|Sakshi

క్యాబ్‌లలో చార్జీల బాదుడు

ప్రస్తావన లేని కొత్త చట్టం  

సాక్షి, సిటీబ్యూరో : – తార్నాక లాలాపేట్‌కు చెందిన సునీల్‌ తాను నివాసం ఉంటున్న ఇందిరానగర్‌ నుంచి  బాలానగర్‌ కోర్టు వరకు క్యాబ్‌లో వెళ్లాడు. సుమారు 20 కిలోమీటర్‌ల దూరం. సాధారణంగా అయితే  రూ.350 వరకు చార్జీ అవుతుంది. కానీ ట్రాఫిక్‌ రద్దీని సాకుగా చూపుతూ ఏకంగా  రూ.813 చార్జీ పడింది. గత్యంతరం లేక చెల్లించాడు. 
.. ఇవి కేవలం ఏ కొద్ది మంది ప్రయాణికులో  ఎదుర్కొంటున్న  అనుభవాలు మాత్రమే కాదు. నగరంలో ప్రతి రోజూ  ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య. పీక్‌ అవర్స్‌ (రద్దీ వేళలు), స్లాక్‌ అవర్స్‌ (రద్దీ లేని సమయం) పేరుతో  క్యాబ్‌ సంస్థలు  చార్జీల మోతమోగిస్తున్నాయి. కొద్దిపాటి వర్షం కురిసినా ట్రాఫిక్‌ రద్దీని సాకుగా చూపుతూ చార్జీలు పెంచేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మోటారు వాహన చట్టంలో ఎక్కడా లేని సరికొత్త నిబంధనలను అమలు చేస్తున్నాయి. ప్రయాణికుడు బుక్‌ చేసుకున్న ప్రాంతానికి సమీపంలో క్యాబ్‌లు అందుబాటులో లేవనే సాకుతో సర్‌చార్జీలు విధిస్తున్నారు. అంబర్‌పేట్‌ నుంచి ఉప్పల్‌ వరకు రూ.100 వరకు చార్జీ అవుతుంది. కానీ  సర్‌చార్జీతో కలిపి రూ.200కు పెంచేస్తారు. ఓలా, ఉబెర్, తదితర క్యాబ్‌ సర్వీసులు ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నాయి. చార్జీలపైన ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేకపోవడం వల్ల  ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారనే  ఆందోళన వ్యక్తమవుతోంది. 

డైనమిక్‌ ఫేర్‌...
ప్రత్యేకంగా ఏర్పాటు చేసే రైళ్లు, విమానాల తరహాలో  క్యాబ్‌లలోనూ  ప్రయాణికుల డిమాండ్‌ పెరిగిన కొద్దీ  డైనమిక్‌ ఫేర్‌ అమలు చేస్తున్నారని, ప్రయాణికుల అత్యవసర సమయాన్ని ఇలా సొమ్ము చేసుకుంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రద్దీని సాకుగా చూపుతూ రద్దీ లేని వేళల్లోనూ చార్జీలు పెంచడం పట్ల ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మణికొండ నుంచి లింగంపల్లికి వెళ్లినప్పుడు ఎలాంటి రద్దీ లేదు. కానీ అదనంగా రూ.వంద పెంచేశారు. ఏ రకంగా ఇది సరైందో  సమాధానం కూడా చెప్పడం లేదు.’అని పరమేశ్‌  విస్మయం చెందారు. సాధారణంగా ప్రయాణికులు  బుక్‌ చేసుకున్న సమయంలో వాహనాల రద్దీ తక్కువగా ఉండవచ్చు. ఆ సమయంలో తక్కువ చార్జీలు నమోదవుతాయి. రద్దీ, ప్రయాణ సమయం పెరిగిన కొద్దీ చార్జీల్లో కొంతమేరకు వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకు మొదట రూ.344 నమోదైతే ఆ తరువాత  ఇది  రూ.405కు పెరగవచ్చు. రద్దీ  తక్కువగా ఉండి, నిర్ధారిత సమయం కంటే తక్కువ సమయంలోనే గమ్యానికి చేరుకున్నప్పుడు చార్జీలు కొంత మేరకు తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది.కానీ అనూహ్యంగా చార్జీలు రెట్టింపు కావడం పట్లఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మరోవైపుఆన్‌లైన్‌పేమెంట్‌లకు కొంతమంది డ్రైవర్‌లు అంగీకరించకపోవడం వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

కొత్త చట్టంలోనూ లేని ప్రస్తావన...
కేంద్రం కొత్తగా రూపొందించిన రోడ్డు భద్రత చట్టంలో క్యాబ్‌ అగ్రిగేటర్‌లు విధించే చార్జీలపైన ప్రభుత్వాలకు ఎలాంటి నియంత్రణ లేకపోవడం గమనార్హం. ‘‘ కొత్త చట్టం ప్రకారం క్యాబ్‌ అగ్రిగేటర్‌లు రవాణాశాఖ నుంచి తప్పనిసరిగా  లైసెన్సు  తీసుకోవలసి ఉంటుంది. మోటారు వాహన చట్టం నిబంధనలకు విరుద్దంగా క్యాబ్‌లను నడిపితే రూ.లక్ష వరకు జరిమానా విధించే వెసులుబాటును ఈ చట్టం
కల్పించింది.

మణికొండ నుంచి లింగంపల్లి వరకు వెళ్లేందుకు పరమేశ్‌  ఉబెర్‌ క్యాబ్‌ బుక్‌ చేసుకున్నాడు. మొదట రూ.120 చార్జీ నమోదైంది. ఫరవాలేదనుకొని బయలుదేరాడు. తీరా  దిగే సమయంలో అది రూ.220 అయింది. హతాశుడయ్యాడు. కస్టమర్‌కేర్‌ను  సంప్రదించాడు. కానీ ఎలాంటి ఫలితం కనిపించలేదు. పీక్‌ అవర్‌ కారణంగా చార్జీలు పెరిగాయని చెప్పారు.
హెటెక్‌సిటీ నుంచి భువనగిరికి వెళ్లేందుకు మరో ప్రయాణికుడు  కొద్ది రోజుల క్రితం ఔట్‌స్టేషన్‌ క్యాబ్‌ సర్వీసును బుక్‌ చేసుకున్నాడు. ఇది  8 గంటల ప్యాకేజీ. మొదట  రూ.1600 బిల్లు నమోదైంది. తీరా గమ్యస్థానానికి చేరుకున్న తరువాత అది రూ.2750 కి పరుగెత్తింది. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా