ఆర్డీఓ కార్యాలయాన్ని ఆశ్రయించిన వృద్ధ దంపతులు

17 Mar, 2020 09:21 IST|Sakshi
వృద్ధ దంపతుల వివరాలను సేకరిస్తున్న సీనియర్‌ అసిస్టెంట్‌ గుత్తా వెంకట్‌రెడ్డి 

సాక్షి. చౌటుప్పల్‌(మునుగోడు) : కుమారులు పట్టించుకోవడం లేదని రామన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఆర్డీఓ కార్యాలయ అధికారులను ఆశ్రయించారు. గ్రామానికి చెందిన వృద్ద దంపతులు పాలెం సత్తయ్య(80), అండాలు(70)లకు కుమారులు, కోడళ్లు ఉన్నారు. అయినా బుక్కెడు బువ్వకు నోచుకోవడం లేదు. నడవలేని స్థితిలో ఉన్న వారికి కుటుంబ సభ్యులు కనీస సేవలు సైతం చేయడం లేదు. నోరు తెరిచి అడిగినా పట్టించుకోకపోగా చీదరించుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వృద్ధులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు.

పరిస్థితిలో మార్పు వస్తుందని ఎంతో కాలంగా ఎదురుచూసినా మార్పు రాకపోవడంతో చట్ట ప్రకారంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా సోమవారం గ్రామానికి చెందిన మోర గోపాల్, మోర వెంకటేశ్‌ల సహాయంతో ఆటోలో స్థానిక ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. నడవలేని స్థితిలో ఉండడంతో అధికారులే ఆటో వద్దకు వచ్చి దంపతుల వివరాలను సేకరించారు. సత్తయ్య–అండాలు దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు బాలయ్య మృతిచెందగా కోడలు యశోధ గ్రామంలోనే ఉంటుంది. రెండో కుమారుడు అంజయ్య–యాదమ్మ, మూడో కుమారుడు స్వామి–శోభ ఉన్నారు. రెండో కుమారుడు చౌటుప్పల్‌ మండలం ధర్మోజిగూడెం గ్రామంలోని ఓ పరిశ్రమలో పని చేస్తుండగా, మూడో కుమారుడు స్థానికంగా  కారోబార్‌గా పని చేస్తున్నాడు.  వృద్ధ దంపతులకు 1.06 ఎకరాల ప్రభుత్వ భూమి, నివాస గృహం ఉంది. ఆస్తుల పంపిణీ జరిగింది. చిన్నకుమారుడి వాటా ఇంట్లో కేటాయించిన గదిలో వృద్ధులు ఉంటున్నారు.

వృద్దులు వచ్చిన విషయం తెలుసుకున్న ఆర్డీఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ గుత్తా వెంకట్‌రెడ్డి వృద్ధులు కూర్చున్న ఆటో వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. కుమారులు సేవలు అందించేందుకు ముందుకు వచ్చే ప్రయత్నం చేసినా కోడళ్లు నిరాకరిస్తున్నారని వృద్ధులు బోరున విలపించారు. గతంలో ఇద్దరు కుమారులు నెలకు 500రూపాయల చొప్పున ఇచ్చేవారని, ప్రస్తుతం ఇవ్వడం లేదన్నారు. పెన్షన్‌ ద్వారా వచ్చే రూ.2000తోనే పూటవెళ్లదీసుకుంటున్నామని తెలిపారు. జీవిత చరమాంకంలో ఉన్న తమకు భోజనం పెట్టించడంతో పాటు సేవలు అందించేలా చూడాలని వేడుకున్నారు. ఈ ప్రకారంగా  కుమారులు, కోడళ్లకు ఆదేశాలు చేసి తమకు మేలు చేయాలని కోరారు. కాగా కుమారులకు నోటీసులు జారీ చేస్తామని గుత్తా వెంకట్‌రెడ్డి తెలిపారు. 

మరిన్ని వార్తలు