కోస్తా బరిలో బస్తీ పుంజు

15 Jan, 2020 07:46 IST|Sakshi
ఎన్‌క్లోజర్లలో కోడిపుంజులు

పహిల్వాన్ల పర్యవేక్షణలో శిక్షణ  

చాంద్రాయణగుట్ట: కుస్తీ పోటీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పాతబస్తీ పహిల్వాన్లు కోడి పుంజులను పెంచేందుకు కూడా అంతే ఆసక్తి చూపుతున్నారు. తమ ఇంట్లోని పిల్లల్లా ఎంతో జాగ్రత్తగా సాకడమేకాదు.. వాటిని సంక్రాంతి బరిలోకి సైతం దించుతున్నారు. పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగే కోడి పందాల్లో పాతబస్తీ పుంజులకు ప్రత్యేక స్థానం ఉంది. ఉభయ గోదావరి జిల్లాలలో పందెం రాయుళ్లు లక్షల ధనం వెచ్చించి ఏటా ఇక్కడి నుంచే కోడి పుంజులను తీసుకెళ్లడం విశేషం. తొలినుంచి పాతబస్తీ వాసులు గొర్రెలు, మేకలను పెంచడం ఆనవాయితీ. అయితే, పందెం కోళ్లకున్న డిమాండ్‌ను బట్టి వాటికి ప్రత్యేక శిక్షణతో పాటు ప్రత్యేకమైన మేతను సైతం పెడుతున్నారు. ప్రతిరోజు బాదం, పిస్తా, అక్రోట్స్, కీమా, ఉడికించిన గుడ్ల తెల్ల సొనను ఆహారంగా ఇస్తారు. అంతేకాదండోయ్‌.. ముఖ్యంగా ప్రతిరోజు నైపణ్యం కలిగిన కోచ్‌లతో రెండు పూటలా మసాజ్‌తో పాటు అలసిపోకుండా పరుగు, ఈత కొట్టిస్తారు. బార్కాస్, కొత్తపేట, ఎర్రకుంట తదితర ప్రాంతాలలోని కొంత మంది ఫహిల్వాన్ల వద్ద మాత్రమే ఇలాంటి కోడిపుంజులున్నాయి. వీటిని ప్రత్యేక ఎన్‌క్లోజర్లలో పెట్టి పెంచడం గమనార్హం. 

నచ్చితే చాలు.. ధర ఓకే..
కోస్తాంధ్ర, రాయలసీమలలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్‌లోని పహిల్వాన్ల వద్దకు వచ్చి వాలిపోతారు. వీరి వద్ద కోడిపుంజు తీసుకెళితే పందెంలో నెగ్గుతామనే నమ్మకంతో కోళ్లను తీసుకెళతారు. జాతి, రంగును బట్టి ఒక్కో కోడిపుంజు ధర రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పలకడం విశేషం. అలాగని ఇక్కడి పహిల్వాన్లు కోళ్ల వ్యాపారం చేస్తారనుకుంటే పొరపాటే. ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఏడాదికి పరిమిత సంఖ్యలో పుంజులను విక్రయిస్తుంటారు. రెండేళ్ల వయసున్న పుంజులనే పందానికి ఇస్తుంటారు. 

మరిన్ని వార్తలు