పింఛన్‌ కోసం ఎదురుచూపులు

3 Sep, 2019 11:42 IST|Sakshi

అందని  ఆసరా పింఛన్‌

నేటికీ రాని 65నుంచి 57 ఏళ్ల వయస్సు కుదింపు ఉత్తర్వులు

తగ్గిన అర్హత వయస్సుతో పెరిగిన అర్హులు  

రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల్లో ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామని, లబ్ధిదారుల వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదించి ఆసరా పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా ప్రభుత్వం పాత లబ్ధిదారులకు రెట్టింపు పింఛన్లు అందజేస్తున్నా.. 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు వయస్సు కుదింపు విషయంలో నేటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్‌ కోసం ఎదురుచూపులు తప్పడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకంలో వయస్సు కుదించిన తమకు పింఛన్‌ అందజేయాలని వారు కోరుతున్నారు.  

సాక్షి, తుంగతుర్తి: ఆసరా పథకంలో భా గంగా వృద్ధాప్య పింఛన్‌ లబ్ధిదారుల వయోపరిమితిని కుదిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రకటించినా నేటికీ అమలుకు నోచుకోవడంలేదు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్‌ .. పింఛన్లు పెంచడంతో పాటు లబ్ధిదారుల వయస్సును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదిస్తామని హామీ ఇచ్చారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు,  బీడీ, గీత, నేత కార్మికులు, బోధకాలు ఉన్న వారికి ఇస్తున్న పింఛన్లను రూ.1000 నుంచి రూ.2016లకు, వికలాంగుల పింఛన్లు రూ.1500 నుంచి రూ.3016లకు పెంచిన విషయం తెలిసిందే.

వయస్సు కుదించిన లబ్ధిదారులకు జూన్‌–2019 నుంచి పింఛన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినా... వృద్ధాప్య పింఛన్ల అర్హత, వయోపరిమితి విషయంలో ఇంత వరకు నిర్ణయం తీసుకోకపోవడంతో కొత్తగా పింఛన్‌ కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు నిరాశ చెందుతున్నారు. తమకు పింఛన్‌ వస్తుందన్న నమ్మకంతో  అర్హులైన లబ్ధిదారులు  అన్ని పత్రాలను తయారు చేసుకొని సిద్ధంగా ఉన్నారు.  ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కు ముందు ప్రభుత్వంపై పడే అదనపు భారాన్ని లెక్కించేందుకు  57ఏళ్లు నిండిన పేద వృద్ధుల జాబితాను రూపొందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు తాత్కాలికంగా ప్రాథమిక సర్వే నిర్వహించి జాబితాను సిద్ధం చేశారు.

ప్రాథమిక సర్వే ద్వారా అర్హుల గుర్తింపు.. 
వృద్ధాప్య పించన్ల కోసం జిల్లాల్లో 57ఏళ్లు నిండిన అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు  అధికారులు ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని వీఆర్‌ఓలు గ్రామాల్లో  ప్రాథమిక సర్వేను నిర్వహించారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు జిల్లాలో చేపట్టిన ప్రాథమిక సర్వేలో 30,373 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి సంబంధిత అధికారులు నివేదక అందజేశారు. 5నెలల క్రితమే ఈ ప్రక్రియను వీఆర్‌ఓలు పూర్తిచేసినా నేటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో అర్హులైన లబ్ధిదారులు తమకు పింఛన్‌ ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తూ,  ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పింఛన్‌ దారులకు కుదించిన వయోపరిమితి విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని తమకు పింఛన్లు అందజేయాలని వృద్ధులు కోరుతున్నారు.

జిల్లాలో  ఇలా.... 
జిల్లాలో ఇప్పటికే పింఛన్‌ పొందుతున్న లబ్ధిదారులు 1,37,479 మంది ఉన్నారు. వీరికి జూలై 2019 నుంచి ఆసరా కింద రెట్టింపు మొత్తాన్ని అందజేస్తోంది. దివ్యాంగులకు రూ.1,500 నుంచి రూ.3,016లకు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీతకార్మి కులు, చేనేత తదితర లబ్ధిదారులకు రూ.1,000 నుంచి రూ.2,016లకు ప్రభుత్వం పింఛన్లను పెంచింది. కాగా  జిల్లాలో ప్రస్తుతం  మొత్తం 1,37,479 మంది లబ్ధిదారులు ఉండగా, కొత్తవారు మరో 30,373 మంది ఉన్నారు. దీంతో జిల్లాలో మొత్తం ఆసరా పింఛన్‌ దారుల సంఖ్య 1,67,850 మందికి చేరనుంది.  

ఆదేశాలు రాగానే పింఛన్లు అందజేస్తాం 
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాలో 57ఏళ్లు నిండిన అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు సర్వేచేసి తాత్కలిక జాబితాను సిద్దం చేశాం. సర్వేలో జిల్లాలో 30,373 మంది ఉన్నట్లుగా గుర్తించాం. వీరికి ప్రభుత్వం నుంచి ఆదేశాల రాగానే పింఛన్లు అందజేస్తాం.  
  – కిరణ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీ, సూర్యాపేట 

మరిన్ని వార్తలు