కొత్త పేషీలో పాత సిబ్బంది !

7 Jun, 2014 04:03 IST|Sakshi
కొత్త పేషీలో పాత సిబ్బంది !

* మంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా అధికారులు వారే
* దశాబ్దాలుగా పేషీల్లో తిష
* పైరవీలు చేసుకుని మంత్రుల వద్దకు చేరుతున్న వైనం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మారింది.. ప్రభుత్వం మారింది.. మంత్రులూ మారారు.. కానీ మంత్రుల పేషీల్లో పనిచేసే అధికారులుగానీ, సిబ్బందిగానీ మారడం లేదు. పేషీల్లో పనిచేసే అధికారులు సొంత శాఖలో పనిచేయడం మానేసి దశాబ్దాలు గడుస్తోంది. వారంతా మంత్రుల పేషీలను అతుక్కుపోయారు. అక్కడుండే అధికారం, ఇతరత్రా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలేవైనా పేషీల్లో తామే ఉండాలన్నట్టుగా మంత్రులు ఇంకా బాధ్యతలు స్వీకరించకముందే వాలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ ఒరవడిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. కొందరైతే పదవీ విరమణ చేసినా.. ఇంకా పేషీల్లో కొనసాగడానికే ఇష్టపడుతున్నారు. దానికి మంత్రులు కూడా ప్రోత్సహిస్తుండడం గమనార్హం. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన పేషిలోకి నిప్పు కణికల్లాంటి అధికారులను తీసుకుంటానని, ఎట్టిపరిస్థితుల్లోనూ అవినీతి సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
 
 దానికి తగ్గట్టుగానే తన పేషీలోకి అలాంటి ఇమేజ్ ఉన్నవారినే తెచ్చుకోవాలని నిర్ణయించారు. మెదక్ జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను తన పేషీలో అదనపు కార్యదర్శి స్థాయి హోదాలో నియమించుకున్నారు. మంత్రుల పేషీల్లో నియమించుకునే అధికారులకు సంబంధించి జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ హెచ్చరిస్తున్నా.. మంత్రులు మాత్రం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. మంత్రుల కంటే ముందే పేషీల్లో పనిచేసే సిబ్బంది పైరవీల్లో మునిగి తేలుతున్నారు. మంత్రుల నుంచి లేఖలు తీసుకుంటూ.. సాధారణ పరిపాలన శాఖకు పంపిస్తున్నారు. సాధారణంగా మంత్రులు కోరిన వారిని వారి పేషీల్లో నియమిస్తుంటారు. గతంలో పేషీల్లో సిబ్బందికి సంబంధించి నిఘా విభాగం నుంచి నివేదికలు తెప్పించుకున్న తర్వాత.. వారి నియామకాలు జరిగేవి. పదవీ విరమణ చేసిన అధికారులను నియమించుకోరాదని కూడా ఉత్తర్వులు ఉన్నాయి. కానీ ఇవేవీ పట్టనట్లు మంత్రులపై ఒత్తిళ్లు తెచ్చి, మరీ పేషీల్లో చేరుతున్నారు. ప్రస్తుతానికి ఈ పేషీ అధికారులెవరికీ సాధారణ పరిపాలన శాఖ నుంచి నియామక ఉత్తర్వులు అందనప్పటికీ అక్కడే పనిచేస్తుండడం గమనార్హం.
 
 అంతా పాత వారే...
 గతంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి వద్ద పనిచేసిన మోహన్‌లాల్ ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వద్ద చేరారు. గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వద్ద పనిచేసిన పేషీ సిబ్బంది మొత్తం ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాయిని నర్సింహారెడ్డి పేషీలో ప్రత్యక్షమయ్యారు. మాజీ మంత్రి గీతారెడ్డి వద్ద పనిచేసిన ఉపేందర్‌రావు, బన్నయ్యలు ఇప్పుడు రవాణా శాఖ మంత్రి వద్ద చేరినట్లు సమాచారం.
 
 పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా పనిచేసిన మోపిదేవి వద్ద పీఎస్‌గా విధులు నిర్వర్తించిన మాణిక్‌ప్రభు ఇప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు వద్ద చేరుతున్నారు. గతంలో స్త్రీ, శిశు సంక్షేమ, ఐకేపీ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి వద్ద పనిచేసిన సత్యనారాయణరెడ్డి ఇప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి వద్ద పీఎస్‌గా చేరుతున్నట్టు తెలిసింది. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన విజయరామారావు, హరీష్‌రావు వద్ద పనిచేసిన జాన్‌వెస్లీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వద్ద చేరనున్నారు. వీరే కాదు... గతంలో పీఎస్‌లు, పీఏలుగా పనిచేసిన పలువురు అధికారులు ఇంకా బాధ్యతలు తీసుకోని మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

మరిన్ని వార్తలు