ములుగు నుంచి ముగ్గురు ఎంపీలు

21 Mar, 2019 20:27 IST|Sakshi

వరంగల్‌ లోక్‌సభకు రెండు సార్లు ఎన్నిక  

మహబూబాబాద్‌ లోక్‌సభకు రెండు సార్లు ప్రాతినిధ్యం 

ములుగు: ములుగు నియోజకవర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులు నాలుగుసార్లు లోక్‌సభ కు ప్రాతినిధ్యం  వహించారు. వరంగల్‌ పార్లమెంట్‌ సెగ్మెంట్‌లో ములుగు నియోజకవర్గం ఉన్నప్పుడు రెండుసార్లు అజ్మీరా చందూలాల్, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్‌ ఒక్కో సారి ఎంపీలుగా గెలుపొందారు. ముగ్గురూ తొలి ప్రయత్నంలోనే.. ములుగు నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు పోటీసిన అజ్మీరా చందూలాల్, పోరిక బలరాంనాయక్, అజ్మీరా సీతారాంనాయక్‌లు గెలుపొందడం విశేషం. 

అజ్మీరా చందూలాల్‌..

ములుగు మండలం జగ్గన్నపేట గ్రామ పంచాయతీ పరిధిలోని సారంగపల్లికి చెందిన అజ్మీరా చందూలాల్‌ తొలిసారిగా 1996లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి సురేందర్‌రెడ్డిపై గెలుపొందారు. తదనంతరం  రెండోసారి టీడీపీ తరుఫున 1998లో కాంగ్రెస్‌ అభ్యర్థి కల్పనాదేవిపై పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1999లో ములుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అయితే చందూలాల్‌ రెండు పర్యాయాల్లో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే ఎంపీగా కొనసాగడం గమనార్హం.

అజ్మీరా సీతారాంనాయక్‌

వెంకటాపురం(ఎం) మండలం మల్లయ్యపల్లికి చెందిన  ప్రొఫెసర్‌ అజ్మీరా సీతారాంనాయక్‌ తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా 2014వ సంవత్సరంలో మహబూబాబాద్‌ పార్లమెంట్‌కి పోటీ చేశారు. తొలి ప్రయత్నంలోనే కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాంపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. 

పోరిక బలరాం నాయక్‌

2009లో పార్లమెంట్‌ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ములుగు నియోజకవర్గం మహబూబాబాద్‌(ఎస్టీ) పార్లమెంట్‌ స్థానానికి కేటాయించబడింది. ఈ ఎన్నికల్లో ములుగు మండలం మదనపల్లికి చెందిన పోరిక బలరాంనాయక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి సీపీఐ అభ్యర్థి కుంజా శ్రీనివాస్‌పై గెలుపొందారు. కేంద్రంలో యూపీఓ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో ఎస్టీ కోటాలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు.  2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం మూడోసారి కాంగ్రెస్‌ పార్టీ తరుఫున 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.   

మరిన్ని వార్తలు