‘అవ్వ’ ది గ్రేట్‌

20 Jul, 2019 10:10 IST|Sakshi
లక్ష్మమ్మ

20 ఏళ్లుగా క్రమంతప్పకుండా ఆస్తిపన్ను చెల్లింపు

కుత్బుల్లాపూర్‌: సరిగా నిలబడ లేక వంగి వంగి నడుస్తున్న ఈ అవ్వ పేరు లక్ష్మి(లక్ష్మమ్మ). కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ కార్యాలయ ఆవరణలో అటు ఇటు నడవలేక నడవలేక నడుస్తున్న ఈమె పింఛను కోసమో, ఇతరత్రా పథకాల లబ్ధికోసమో పాట్లు పడటం లేదు. ఈ అవ్వ వచ్చింది తన ఇంటి పన్ను కట్టడానికి. గాజులరామారం డివిజన్‌ మార్కండేయనగర్‌లో ఉన్న ఇంటి నంబరు 05–104 (పి.టి.ఐ నంబరు: 1152400681)కు గాను 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా పన్ను చెల్లిస్తూ వస్తుంది. అయితే ఇటీవల ఆమె వద్దకు ఓ వ్యక్తి వచ్చి పన్ను కట్టాల్సిందిగా కోరగా అతనికి డబ్బులు చెల్లించింది. అయినప్పటికీ తన ఇంటి పన్ను ఇంకా పెండింగ్‌ ఉందని తెలియడంతో ఇలా నేరుగా సర్కిల్‌ కార్యాలయానికి వచ్చి వాకబు చేసింది.

సి.ఎస్‌.సి సెంటర్‌లోకి వెళ్లగా అక్కడ సిబ్బంది ఇంటి పన్ను రూ.2614 గా చెప్పడంతో అవాక్కయ్యింది. ఎప్పుడూ తన ఇంటి పన్ను రూ.1200 నుంచి 1300 మధ్యలోనే వస్తుందని, కాని ఇప్పుడు ఇంతలా ఎలా పెరిగిందని వాపోయింది. తన వద్ద ఇప్పుడు రూ 1200 మాత్రమే ఉన్నాయని మిగిలిన డబ్బులు తీసుకువస్తానని కొద్ది సేపు కూర్చుని తిరిగి వెళ్లిపోయింది అవ్వ. అయితే 2019 మార్చి నెలలో రూ.630 రూపాయలు కట్టి పాత బకాయిలు లేకుండా ట్యాక్స్‌ క్లియర్‌ చేయించుకుంది లక్ష్మమ్మ. ఆఖరికి ఆస్తి పన్ను మదింపు ఈ అవ్వను కూడా ఇబ్బందులకు గురిచేసింది. ఓ దశలో తన ఇబ్బంది చెబుతూ కన్నీటి పర్యంతమైంది. తాము 20 ఏళ్లుగా పన్ను చెల్లిస్తూ వస్తున్నామని, తన భర్త చనిపోయాక 2013 నుంచి తానే స్వయంగా చెల్లిస్తున్నాని చెప్పింది. సరిగా నడవలేని, సహకరించని శరీరం వణుకుతున్నప్పటికీ ఓపిక చేసుకుని ఆస్తిపన్ను కట్టడానికి వచ్చిన ఆ అవ్వను చూసి ఆస్తి పన్ను కట్టకుండా ఉండే మొండి బకాయిదారులు సిగ్గుపడాలని సిబ్బంది వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు