18 నుంచి బడాపహాడ్ ఉర్సు

10 Apr, 2016 02:25 IST|Sakshi
18 నుంచి బడాపహాడ్ ఉర్సు

* భక్తులకు మౌలిక సదుపాయాలు
* జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావీద్ అక్రం

వర్ని : ఉత్తర తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బడాపహాడ్ సయ్యద్ షాదుల్లా హుస్సేనీ దర్గా ఉర్సును ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావిద్ అక్రం తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు వసతులను కల్పిస్తామని పేర్కొన్నారు. మండలంలోని బడాపహాడ్‌లో శనివారం సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉర్సుకు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, కల్వకుంట్ల కవిత, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కలెక్టర్ యోగితరాణాలను వక్ఫ్‌బోర్డు తరఫున ఆహ్వానిస్తామని తెలిపారు.

ఈ యేడు ఉర్సును ఘనంగా నిర్వహించేందుకు వక్ఫ్‌బోర్డు రూ. 10 లక్షలు కేటాయించిందని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సులను నడపడానికి బోధన్, నిజామాబాద్, బాన్సువాడ డిపో అధికారులతో మాట్లాడతామన్నారు. వక్ఫ్ బోర్డు అధికారులు స్థానికంగా వచ్చే భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, మహిళల స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అనంతరం బడాపహాడ్‌లో ప్రస్తుతం ఉన్న తాగునీటి సౌకర్యాన్ని ఆయన పరిశీలించారు.

మినీ వాటర్ ట్యాంక్‌ల చుట్టు గచ్చు పగిలి  అపరిశుభ్రంగా ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉర్సు వరకు బాగు చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని దర్గా సూపరింటెండెంట్ సాజిద్‌కు సూచించారు. సమావేశంలో వక్ఫ్‌బోర్డు జిల్లా ఉపాధ్యక్షుడు జహీరొద్దీన్ జావిద్, నాయకులు అయ్యూబ్, మహ్మద్ గౌస్, ఖయ్యూమ్ తదితరులు పాల్గొన్నారు.
 
మౌలాలీ దర్గాను అభివృద్ధి చేస్తాం
బీర్కూర్ : తెలంగాణ తిరుమల దేవస్థానం వద్ద ఉన్న హజ్ర త్ మౌలాలీ దర్గాను అభివృద్ధి చేస్తామని జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ జావిద్ అక్రం పేర్కొన్నారు. శనివారం ఆయన దర్గా లో ప్రత్యేక ప్రార్థన చేశారు. దర్గా స్థలంపై వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ అబ్దుల్ ఖాదర్, వైస్ చైర్మన్ జహీరొద్దీన్ జావిద్‌లతో కలిసి సర్వేచేశామని, నివేదికను హైదరాబాద్‌లోని సీఈవో కార్యాలయానికి పంపుతామని చెప్పారు.

>
మరిన్ని వార్తలు