విభజన కసరత్తు

8 May, 2014 03:59 IST|Sakshi

నల్లగొండ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో విభజన కసరత్తు శరవేగంగా జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో లెక్కల విభజన ఈ నెల 24తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థ్ధిక బడ్జెట్ పరిధిలో ఉన్న చెల్లింపులన్నీ 24వ తేదీతో పూర్తికానున్నాయి. ప్రభుత్వ శాఖల పరిధిలోని అన్ని శాఖల ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు ఇతరత్రా అన్ని చెల్లింపులు అదే రోజు తెగదెంపులు కానున్నాయి. దీని కోసం  అధికారులు లెక్కలు సిద్ధం చేయడంలో మునిగితేలుతున్నారు. చెల్లింపులకు సంబంధించిన ఏర్పాట్లను ట్రెజరీ శాఖలో అధికారులు పూర్తి చేస్తున్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో వచ్చే నెల నుంచి బడ్జెట్ విధానం ప్రత్యేక రాష్ట్ర పరిధిలోకి రానున్నాయి.
 
 రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో భాగంగా విభజన లెక్కలు వేగవంతమయ్యాయి. మే 24 తర్వాత నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లెక్కలు వేటికవేనంటూ జిల్లా ట్రెజరీ శాఖకు ముందస్తు ఉత్తర్వులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షన్‌దారులకు నిర్ణీత సమయానికి వేతనాలు, పెన్షన్లు ఇచ్చేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు 24నే వేతనాలు అందించనున్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించనుండడంతో 24న తీసుకునే వేతనం ఆంధ్రప్రదేశ్‌లో చివరిది కానుంది. జిల్లాలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు 29,462, పింఛన్‌దారులు 19,405 మంది ఉన్నారు. ప్రభుత్వ వేతనం కింద ఉద్యోగులకు నెలకు సుమారు రూ.300 కోట్లు, పెన్షనర్లకు రూ. 29.80 కోట్లు చెల్లించాలి. ఈ మేరకు జీఓ నెం. 86 విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఖాతా నుంచి తెలంగాణలోని ఉద్యోగులకు వేతనం చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వులు అందుకున్న ట్రెజరీ శాఖ ఉద్యో గుల జాబితా, బ్యాంకు ఖాతాలను సిద్ధం చేస్తోంది. జిల్లాలో పింఛన్‌దారులకు కూడా మే నెల చెల్లింపును ఈ నెల 24నే చేయనున్నారు.
 
 నిధులు సర్దుబాటయ్యేనా..!
 ప్రభుత్వ పథకాల అమలుకు వివిధ శాఖలకు ఖజానా శాఖ ద్వారా నిధులు విడుదలవుతాయి. ఉద్యోగుల జీతాల మాదిరిగానే నిధుల ఖర్చుకు కూడా ఈ నెల 24 తుది గడువుగా నిర్ణయించారు. ఆలోగా వెచ్చించిన మొత్తాన్ని అప్పజెప్పాలంటూ ఆదేశాలు వచ్చే సూచనలు ఉన్నాయని అ ధికారులు చెబుతున్నారు. ఎన్నికల హడావిడిలో ఉన్న అధికారులు నిధుల వినియోగం ఎలా..? అని తలలు పట్టుకుంటున్నారు. 13వ ఆర్థిక సంవత్సరం నిధులు గత ఆర్థిక సంవత్సరం చివరి మాసం అయిన ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉంది.
 
 ఆ మేరకు జిలా పంచాయితీ శాఖ బిల్లులు కూడా ట్రెజరీకి పంపింది. కానీ ఆర్థిక శాఖ నుంచి నిధులు రాకపోవడంతో బిల్లులు నిలిచిపోయాయి. ఈ నిధులకు సంబంధించి శనివారం జిల్లాకు రూ.19 కోట్లు వచ్చినట్లు పంచాయతీ అధికారులు చెబుతున్నారు. వీటిని రెండు, మూడు రోజుల్లోగా ట్రెజరీ నుంచి విడుదల చేయించి ఆ తర్వాత జిల్లా జనాభా, పంచాయతీ జనాభా ప్రాతిపదికన గ్రామాలకు నిధులు మంజూరు చేస్తామని తెలిపారు.
 
 ఫీజులు, ఉపకార వేతనాలు అందేనా..?
 ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఇప్పటి వరకు పనులకు గ్రహణం ఏర్పడింది. 24వ తేదీ లోగా ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు విడుదల కావాలి. అంతే వేగంగా అధికారులు వాటి చెల్లింపులు పూర్తి చేయాలి. ముఖ్యంగా విద్యార్థుల ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు ప్రధా నం. ముందుగా విద్యార్థుల ఉపకార వేతనాలు విడుదల చేసిన తర్వాతే కాలేజీలకు ఫీజు రీ యింబర్స్‌మెంట్ చెల్లించాల్సి ఉంటుంది.
 
 ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల ఫీజులు కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ  వారాంతంలోగా ఫీజుల బకాయిలు విడుదలయ్యే అవకాశం ఉందని సంక్షేమ శాఖల అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఇంత స్వల్ప వ్యవధిలో భారీ మొత్తంలో నిధులు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ లేనిపోని కొర్రీలు పెడితే మాత్రం విద్యార్థులు ఇరకాటంలో పడతారు.  
 

>
మరిన్ని వార్తలు