అంతర్జాతీయ వేదికపై ఓరుగల్లు వాసి ప్రసంగం

23 Jun, 2015 04:31 IST|Sakshi
అంతర్జాతీయ వేదికపై ఓరుగల్లు వాసి ప్రసంగం

- డ్రైవర్ల మానసిక స్థితి, ప్రమాదాల నివారణపై పలు అంశాల వెల్లడి
- ఇంటర్నేషనల్ ఆటోఎక్స్‌పోలో శివకృష్ణకు ప్రశంసల వెల్లువ
నక్కలగుట్ట :
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోటార్ వాహన రంగంలోని దిగ్గజాలు పాల్గొన్న ఇంటర్నేషనల్‌ఆటోమోటీవ్ ఎక్సోపోలో తెలంగాణ బిడ్డ అయినాల శివకృష్ణ వాహన డ్రైవర్ల మానసిక స్థితి, ప్రమాదాల నుంచి తప్పించుకునే విధానంపై ఆలోచనాత్మక ప్రసంగం చేశారు. జూన్ 16 నుంచి 18వ తేదీ వరకు జర్మనీలోని స్టాట్‌గార్ట్ లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆటోమోటీవ్ ఎక్స్‌పోలో వరంగల్ పోచమ్మమైదాన్ మర్రివెంకటయ్య కాలనీకి చెందిన అయినాల శివకృష్ణ పాల్గొన్నారు.

ఈ అంతర్జాతీయ ఆటోమోటివ్ ఎక్స్‌పోలో ప్రపంచవ్యాప్తంగా మోటార్ వాహనాలను డిజైన్ చేసే ప్రముఖులు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, వాహన ఉత్పత్తి సంస్థలు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 వాహన ఉత్పత్తుల కంపెనీలు ఈ ఎక్స్‌పోలో పాల్గొన్నాయి.
 
యూకేఐపీ మీడియా అండ్ ఈవెంట్స్ లిమిటెడ్‌కు మూడు నెలల కాలంలో శివకృష్ణ రెండు అంశాలపై పరిశోధన పత్రాలు సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా వాహనాల పరిశోధనల రంగంలో నిపుణులు సమర్పించిన అంశాల్లో నుంచి ఈవెంట్ నిర్వాహకులు వడబోసి ఎంపిక చేసిన అంశాల్లో శివకృష్ణ సమర్పించిన రెండు పరిశోధన పత్రాలు ఉన్నాయి. అందులో ఒకటి టెక్టింగ్ ఎక్స్‌పో, రెండో పరిశోధన అంశం ఇంటీరియర్ డిజైన్ ఎక్స్‌పో. భారతదేశం నుంచి బోష్ కంపెనీ నుంచి ఎంపికైన ఏకైక వ్యక్తి కూడా ఈయనే కావడం గమనార్హం. బోష్ కంపెనీకి శివకృష్ణ సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్‌గా బెంగళూరులో పనిచేశారు. ప్రస్తుతం జర్మనీలో పరిశోధన కొనసాగిస్తున్నారు. ఈ అంతర్జాతీయ ఆటోమోటీవ్ ఎక్స్‌పోలో శివకృష్ణ ప్రసంగాన్ని సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, డైరక్టర్లు ప్రశంసించారు.
 
పరిశోధన వైపు మళ్లించిన ప్రమాదం
నగరానికి చెందిన శివకృష్ణకు అత్యంత సన్నిహితుడైన స్నేహితుడు 2010లో ప్రమాదానికి గురయ్యాడు. ఆయన తన వ్యక్తిగత కారణాలతో ఒత్తిడికిలోనై కారు నడుపుతున్న అతడు డ్రైవింగ్‌పై శ్రద్ధ పెట్టకపోవడంతో కారు ఫుట్‌పాత్‌పైకి ఎక్కి ఇద్దరు పాదాచారులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు గాయపడగా ఇతడి స్నేహితుడు మృతిచెందారు. ఈ ప్రమాదం శివకృష్ణను ఆటోమోటీవ్ ఇంజనీరింగ్ రంగంలో పరిశోధన ైవె పు మళ్లేలా చేసింది. డ్రైవర్ మానసికస్థితి సక్రమంగా లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, వీటి నుంచి కాపాడుకోవడానికి, ప్రమాద సమయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచనలో నుంచే శివకృష్ణ పరిశోధన మొదలైంది. ఈ క్రమంలోనే ఆయన జర్మనీలో ‘ఎమోషన్స్ రీడింగ్ సేఫ్టీ సిస్టమ్’పై పరిశోధన సాగిస్తున్నారు.
 
పరిశోధన సాగిందిలా..
వాహన డ్రైవర్ల మానసిక స్థితిని తెలుసుకోవడానికి డ్రైవర్ ముందున్న అద్దం పక్కన ఒక కెమెరాను అమర్చుతారు. డ్రైవర్ సీటు పక్కన మరో కెమెరాను ఏర్పాటు చేయడం ద్వారా కారు లేదా ఇతర వాహనాల డ్రైవర్ల డ్రైవింగ్ తీరు, అతని గుండె వేగం, వాహన వేగం, వాహనం డైనమిక్స్ సమాచారంను గుర్తించడానికి వీలు కలుగుతుంది. వాహనంలోని డ్రైవర్ ఆందోళనకు గురైన స్థితిలో ఉండి వాహనాన్ని చాలా వేగంగా నడుపుతూ ఉంటే.. దానిని గుర్తించి తక్షణమే తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఎదురుగా వచ్చే వాహనాలను అప్రమత్తం చేయడంతోపాటు డ్రైవర్‌కు ఆహ్లాదకరమైన మ్యూజిక్ వినబడేలా ఏర్పాట్లు చేసి వాహన వేగంను డ్రైవర్ తగ్గించుకునేలా అప్రమత్తం చేయడం, డ్రైవర్ మానసిక స్థితిలో మార్పులు చోటుచేసుకునేలా చేయడానికి శివకృష్ణ తన పరిశోధనను కొనసాగిస్తున్నారు. వాహనాల డ్రైవింగ్‌లో డ్రైవర్ల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే విషయమై ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్‌వేర్ యంత్రాలను రూపొందించనున్నట్లు ఆయన చెప్పారు. 2020 నాటికి అమెరికా, యూరప్ దేశాల్లో డ్రైవర్‌లెస్ కార్లు మార్కెట్‌లోకి వస్తాయని, ఇండియాలోని మెట్రోపాలిటన్ సిటీల్లో డ్రైవర్‌లెస్ కార్లు వినియోగంలోకి వస్తాయని శివకృష్ణ పేర్కొన్నారు.

కాగా శివకృష్ణ తల్లి శోభారాణి హన్మకొండ మండలం మామూనూరు జెడ్పీఎస్‌ఎస్‌లో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు