‘మహా’ ఉల్లిపై నియంత్రణ

13 Apr, 2020 03:38 IST|Sakshi

రాష్ట్రీయంగా ఉన్న ఉల్లిని ప్రోత్సహించాలని ప్రభుత్వ నిర్ణయం

రాష్ట్రంలోనే సరిపడేంత ఉల్లి లభ్యత ఉందంటున్న మార్కెటింగ్‌ శాఖ

కరోనా విస్తృతి, లారీల భయం నేపథ్యంలో మహారాష్ట్ర ఉల్లికి బ్రేకులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోకి ఇబ్బడి ముబ్బడిగా వస్తున్న మహారాష్ట్ర ఉల్లిపై ప్రభుత్వం నియంత్రణ విధించింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ విస్తృతి ఉధృతంగా ఉండటంతో మహారాష్ట్ర సరిహద్దులను మూసేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించగా, నిత్యావసరాలైన ఉల్లి దిగుమతులపై తాజాగా ఆంక్షలు పెట్టింది. మన రాష్ట్రంలో ఈ సీజన్‌లో ఉల్లి సాగు గణనీయంగా పెరిగి లభ్యత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఇక్కడి రైతులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర మార్కెట్లకు ఇక్కడి ఉల్లినే సరఫరా చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఉల్లి సరఫరా ముగిశాకే, మహారాష్ట్ర నుంచి దిగుమతులు తిరిగి ఆరంభించాలని, అంతవరకు దాన్ని పూర్తిగా ఆపేయాలని సూచించింది.

నియంత్రణకు కారణాలివే.. 
రాష్ట్రంలోని బోయిన్‌పల్లి మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి సాధారణ రోజుల్లో 30 నుంచి 40 లారీలు వచ్చేవి. వీటి ద్వారా 5 వేల క్వింటాళ్ల మేర ఉల్లి దిగుమతి అయ్యేది. అయితే ఈ నెల తొలి వారం నుంచి అక్కడి మార్కెట్లను పూర్తిగా మూసేయడంతో అక్కడి వ్యాపారులంతా ఉల్లిని ఇక్కడికే తరలించారు. దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చే లారీల సంఖ్య రెట్టింపయింది. ఒక్కో రోజు 100 వరకు లారీలు వచ్చాయి. దీంతో ఉల్లి ధర కిలో రూ.10–12కి పడిపోయింది. అయితే మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం, మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఆ రాష్ట్రం నుంచి సరుకు రవాణా చేస్తున్న వాహనాలకు వెళ్లాలంటేనే మార్కెట్‌ సిబ్బంది, హమాలీలు జంకుతున్నారు. ఇక మహారాష్ట్ర వాహనాలను నిలిపే కాలనీల నుంచి సైతం అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. వాటిని తమ ప్రాంతాల్లో నిలపొద్దని కాలనీవాసులు మొరపెట్టుకుంటున్నారు.

దీనికితోడు మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లి ఎక్కువగా పెద్ద పరిమాణంలో ఉంటుంది. దీన్ని ఎక్కువగా హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగిస్తారు. ప్రస్తుతం ఇవేవీ తెరిచి ఉండకపోవడంతో వీటి అవసరం లేదు. ఇక మరోపక్క రాష్ట్రంలోని గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, తాండూరు, నారాయణఖేడ్‌ వంటి ప్రాంతాల్లో ఈ సీజన్‌లో ఉల్లి సాగు పెరిగింది. అదంతా మార్కెట్‌కు రావడానికి సిద్ధంగా ఉంది. తమ ఉల్లిని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉల్లి రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర‡ రైతులకు ఊరటనిచ్చేలా, రాష్ట్రీయంగా ఉన్న ఉల్లినే సరఫరా చేయాలని, దాన్నే కొనుగోలు చేసి రిటైల్‌ మార్కెట్‌కు పంపాలని ఉల్లి వ్యాపారులను ప్రభుత్వం కోరింది. దీనికి వ్యాపారులు కూడా అంగీకరించారు. వనపర్తి, గద్వాల జిల్లాలో ఇప్పటికే 7 నుంచి 8 వేల క్వింటాళ్ల ఉల్లి సిద్ధంగా ఉందని, అదంతా సోమవారానికి బోయిన్‌పల్లి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉందని మార్కెటింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉల్లి దిగుమతి పుష్కలంగా ఉండటంతో ధర సైతం కిలో రూ.10 నుంచి రూ.16 వరకు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు