-

ఒకేసారి ఎన్నికలపై చర్చ మంచిదే

26 Jan, 2017 03:24 IST|Sakshi
ఒకేసారి ఎన్నికలపై చర్చ మంచిదే

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఒకేసారి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరపాలని, డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ భావిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ తెలిపారు. ఈ అంశంపై దేశవ్యాప్త చర్చ మొదలు కావడం మంచి పరిణామమని పేర్కొన్నారు. కేంద్రం ప్రతీ కార్యక్రమం పేదల కోసమే చేపడుతోందని, పార్టీ సిద్ధాంతకర్త పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ కోరుకున్న అంత్యోదయ పథకం కింద నిరుపేదలకు మేలు జరగాలన్న ఆలోచనతో ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ, కార్మిక విధానాలపై కార్మిక సంఘాల నాయకులకు ఈనెల 30 నుంచి వచ్చేనెల 3వ తేదీ వరకు నోయిడాలోని వీవీ గిరి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న 40 మంది రాష్ట్ర నాయకుల బృందంతో పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్‌ సమావేశమయ్యారు. యువతకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మహిళల కోసం ప్రత్యేకంగా ఉద్యోగాల అన్వేషణ కోసం కాకుండా సొంతంగా పరిశ్రమలు స్థాపించి, మరికొందరికి ఉద్యోగ కల్పన చేసే స్థాయికి ఎదగాలని స్టార్టప్‌ అండ్‌ స్టాండప్‌ ఇండియా పథకాలను తీసుకువచ్చిందని వివరించారు. యువత వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు స్కిల్‌ ఇండియాను తీసుకొచ్చినట్లు తెలిపారు. అవినీతిరహిత సమాజ నిర్మాణానికి యువత కదలాలని, ఇందుకు విద్యావిధానంలో మార్పు రావాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణి, నాయకులు టి.కాంతారావు, టి.రాజశేఖరరెడ్డి, వి.ఆర్‌.యాదవ్, వీవీ గిరి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ సభ్యుడు టి.కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర పథకాలపై హర్షం
రైతులకు పంట రుణాలపై వడ్డీ రద్దు నిర్ణయంతోపాటు, సీనియర్‌ సిటిజన్ల కోసం వరిష్ట బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టడంపై బీజేపీ ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి హర్షం ప్రకటించారు. ప్రధాని మోదీ రైతుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారనడానికి ఇది నిదర్శనమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేసి ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడటం భారత్‌తో సంబంధాలు కొనసాగిస్తామని చెప్పడంగొప్ప పరిణామమని తెలిపారు.

మరిన్ని వార్తలు