కోర్సు కాగానే కొలువు!

5 Dec, 2014 00:26 IST|Sakshi
కోర్సు కాగానే కొలువు!
  • పారిశ్రామిక అవసరాల మేరకు వృత్తి విద్యా కోర్సుల సిలబస్  
  •  ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో సమూల మార్పులు
  •  పారిశ్రామిక వర్గాల నిపుణులతో కాలేజీల్లో బోధన
  •  కోర్సు ప్రథమ సంవ త్సరం నుంచే పరిశ్రమలతో కాలేజీల అనుసంధానం
  •  మంత్రులు, పారిశ్రామిక వర్గాల సమావేశంలో నిర్ణయం
  • సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక అవసరాల మేరకు వృత్తి విద్యా కోర్సులను సమూలంగా మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. చదువులు పూర్తి చేసుకొని బయటకు రాగానే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు దొరికేలా కోర్సుల్లో మార్పులు తీసుకురానుంది. కోర్సు మొదటి సంవత్సరం నుంచే పరిశ్రమలతో కాలేజీలను అనుసంధానం చేయనుంది. పారిశ్రామిక వర్గాలకు చెందిన నిపుణులతో కాలేజీల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పించనుంది.

    సాధారణ, గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల విద్యార్థులకు పారిశ్రామిక అవసరాలపై ప్రతి ఏటా వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటితోపాటు విద్యార్థులు కాలేజీకి వెళ్లలేని పరిస్థితిలో ఉంటే ఇంటర్నెట్ ఆధారిత వర్చువల్ క్లాసెస్ నిర్వహించేందుకు చర్యలు చేపట్టనుంది. కోర్సుల్లో మార్పుచేర్పులపై గురువారం సచివాలయంలో విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

    ఈ భేటీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర, విద్యాశాఖ, ఐటీ శాఖ కార్యదర్శులు వికాస్‌రాజ్, హర్‌ప్రీత్‌సింగ్, సాంకేతిక విద్య కమిషనర్ శైలజా రామయ్యార్, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ఎన్‌వీ రమణరావులతోపాటు ఫిక్కీ, సీఐఐ, నాస్కామ్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇటు పారిశ్రామికరంగానికి, అటు విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల సిలబస్‌లో మార్పులు తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు.
     
    ఇదీ ప్రస్తుత పరిస్థితి..

    రాష్ట్రంలో గతేడాది 271 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి 74,617 మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు, 5,406 మంది ఎంటెక్ గ్రాడ్యుయేట్లు, 96 ఫార్మసీ కాలేజీల నుంచి బీఫార్మసీ 4,575 మంది, ఎంఫార్మసీ పూర్తి చేసుకొని 767 మంది, 41 ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలనుంచి మరో 10 వేల మంది కోర్సులు పూర్తి చేసుకొని బయటకు వచ్చారు. కానీ అందులో అత్యధిక మంది నెలకు కేవలం రూ.5 వేలలోపు వేతనంతోనే పనిచేస్తున్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యా విధానం లేకపోవడం, నైపుణ్యాల కొరతే ఇందుకు ప్రధాన కారణం.

    అలాగే ఎక్కువ శాతం విద్యార్థులు పరిశ్రమ అధారిత ప్రాజెక్టులను చేయడం లేదు. రాష్ట్రంలో మొత్తంగా 431 వృత్తి విద్యా కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి నుంచి అనుమతి పొందినవి ఉంటే అందులో 100 కాలేజీల్లో మాత్రమే క్యాం పస్ రిక్రూట్‌మెంట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమల అవసరాల మేరకు విద్యార్థులను తయారు చేయడంతోపాటు చదువు పూర్తి చేసుకున్న వెంటనే మంచి ఉపాధి అవకాశాలు లభించేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది.
     
    ఇకపై ఇలా..

    పరిశ్రమలకు, కాలేజీల మధ్య నిరంతర పర్యవేక్షణకు ఉన్నత స్థాయిలో రెండు సమన్వయ కమిటీలను త్వరలో ఏర్పాటు చేస్తారు. తెలంగాణ అకాడమీ ఆధ్వర్యంలో స్కిల్స్ అండ్ నాలెడ్జ్ టాస్క్ పేరుతో కార్యక్రమం చేపడతారు. కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీకి పారిశ్రామికవర్గాలతో శిక్షణ ఇప్పిస్తారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంచడంతోపాటు ఎంటర్‌పెన్యూర్ స్కిల్స్ అలవర్చుకునేందుకు వీలుగా స్టార్ట్ అఫ్ కంపెనీలతో విద్యార్థులకు ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తారు.

    అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభించేలా సిలబస్‌లో మార్పులు ఉంటాయి. విద్యా సంస్థలతో పరిశ్రమలు కలసి పనిచేసేలా కేంద్రం చేసిన చట్టం అమలుకు నోచుకోవడం లేదన్న అభిప్రాయం ప్రభుత్వంలో ఉంది. అందుకు విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌ని లేదా ప్రాక్టీస్ స్కూల్ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది.

    ఐటీఐ వంటి శిక్షణ సంస్థలను పటిష్టం చేయనుంది. పరిశ్రమలకు సంబంధించిన అవసరాలపై ఏటా 60 నుంచి 90 రోజులు శిక్షణ ఉంటుంది. ఇండస్ట్రీ అవసరాలపై షార్ట్ టర్మ్ కోర్సులను ప్రవేశపెడతారు. 5, 7వ సెమిస్టర్‌లో ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో పారిశ్రామిక శిక్షణ ఉండేలా మార్పులు తెస్తారు. మూడు, నాలుగో సంవత్సరం విద్యార్థులు జాతీయ స్థాయిలో పరిశ్రమలను సందర్శించేలా చర్యలు చేపడతారు.
     

మరిన్ని వార్తలు