వన్‌ సిటీ–వన్‌ సర్వీస్‌

22 Feb, 2019 09:24 IST|Sakshi
సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌

అంతా కామన్‌ మూడు కమిషనరేట్లలో ఒకే తరహా పోలీసింగ్‌

ప్రజలపై పరిధుల ప్రభావం ఉండదు

నేరగాళ్ల విషయంలో ఒకే విధానం  

సైబరాబాద్‌ సీపీ నిర్ణయం

సాక్షి, సిటీబ్యూరో: రాజధానిలోలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సాంకేతికంగా వేరైనా ప్రజల దృష్టిలో మాత్రం ఒకటే. ఈ నేపథ్యంలోనే ఈ మూడింటిలో ఏకరూప పోలీసింగ్‌ ఉండాలనే ఉద్దేశంతో సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్షేత్రస్థాయి అధికారుల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యమనే ఉద్దేశంతో గురువారం  రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మూడు కమిషనరేట్లకు చెందిన అధికారులు పాల్గొన్నారు. శంషాబాద్, సౌత్, ఎల్బీనగర్‌ జోన్లకు చెందిన దాదాపు 50 మంది అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.  కొన్నాళ్ల క్రితం డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపు ఇచ్చిన ‘యూనిఫాం సర్వీస్‌ డెలివరీ... వన్‌ సిటీ–వన్‌ సర్వీస్‌–వన్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఫర్‌ ది సిటిజన్‌’ అంశాన్ని సాకారం చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.

ప్రజలు ప్రశాంత జీవనంతో పాటు నేర రహిత సమాజాన్ని, పోలీసుల నుంచి జవాబుదారీతనంతో కూడిన మెరుగైన సేవలను కోరుకుంటారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలంటే మూడు కమిషనరేట్ల అధికారుల మధ్య సమన్వయం అవసరమని భావిస్తున్నారు. ఈ మూడింట్లోనూ ఏ కమిషనరేట్‌కు చెందిన నేరగాళ్లు, అసాంఘికశక్తులపై వారే షీట్లు తెరిచి పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో వీరిపై నిఘా పక్కాగానే ఉంటున్నప్పటికీ మిగిలిన రెండు చోట్ల సాధ్యం కావట్లేదు. ఫలితంగా ఒక కమిషనరేట్‌కు చెందిన నేరగాడు మరోచోట నేరం చేసి తన స్వస్థలానికి చేరుకుంటున్నాడు. ఓ కమిషనరేట్‌కు చెందిన వ్యక్తి మరో ప్రాంతంలో సమస్యాత్మకంగా మారితే అతడికి సంబంధించిన సమాచారం అక్కడికే పరిమితం అవుతోంది. అలాగే ఓ కమిషనరేట్‌లో వాంటెడ్‌గా ఉన్న నేరగాడు మరో ప్రాంతంలో తలదాచుకున్నా పట్టుకోలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ సమస్యలన్నింటికీ సమన్వయలేమి కారణమనే అభిప్రాయానికి వచ్చిన సైబరాబాద్‌ అధికారులు చక్కదిద్దే చర్యల్లో భాగంగా ఈ సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు వివిధ అంశాలపై చర్చించిన అధికారులు కీలక సమాచార మార్పిడి చేసుకున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తయ్యే వరకు సమన్వయం అంశంపై కసరత్తు చేయాలని, ఆపై మరోసారి సమావేశమై ఇబ్బందుల్ని అధిగమించి ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు. 

మరిన్ని వార్తలు