కిడ్నీకి రూ.కోటి!

5 Oct, 2017 00:36 IST|Sakshi

‘అపోలో’ పేరుతో  సైబర్‌ నేరగాడి వల

అవయవాలు ఖరీదు చేస్తామంటూ బేరసారాలు

సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో అపోలో యాజమాన్యం ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్‌ : అవయవాలు ఖరీదు చేస్తామం టూ ఓ నైజీరియన్‌ సైబర్‌ నేరగాడు ఎరవేసి అందినకాడికి కాజేశాడు. అపోలో హాస్పిటల్స్‌ 220 ఎట్‌ జీమెయిల్‌.కామ్‌ పేరుతో ఈ–మెయిల్‌ ఐడీ క్రియేట్‌ చేశాడు. ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచాడు. బోగస్‌ ధ్రువీకరణలతో కొన్ని సిమ్‌కార్డులు సైతం తీసుకుని వీటి ఆధారంగా వాట్సాప్‌ ఖాతాలు కూడా తెరిచాడు. ఈ మేరకు మానవ అవయవాలు కొంటామంటూ వివిధ సోషల్‌మీడియాల్లో ప్రకటన లు ఇచ్చాడు. వీటికి ఆకర్షితులై సంప్రదించినవారి తో చాటింగ్‌ చేస్తూ బేరసారాలు చేశాడు. తాను విదేశంలో ఉన్నానని, కిడ్నీ గరిష్టంగా రూ.కోటి వెచ్చించి ఖరీదు చేస్తానని, ఇతర వ్యవహారాలను మొత్తం తానే పర్యవేక్షిస్తానంటూ నమ్మించేవాడు. రేటు ఖరారైన తర్వాత సదరు నేరగాడు నగదుతో ఇతర దేశం నుంచి బయలుదేరుతున్నట్లు సమాచా రమిస్తాడు.

ఆ తర్వాత షరామామూలే. ఒకటి, రెండు రోజులకు విమానాశ్రయం నుంచి కస్టమ్స్‌ అధికారులమంటూ ‘విక్రేత’కు ఫోన్‌ వస్తుంది. పలానా వ్యక్తి పలానా దేశం నుంచి భారీ మొత్తంతో వచ్చి తమ విమానాశ్రయంలో దిగాడని, అంత డబ్బుతో ఎయిర్‌పోర్ట్‌ దాటి బయటకు రావాలంటే వివిధ రకాలైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. దీని కోసం కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలు అందించి కస్టమ్స్, యాంటీ టెర్రర్‌ ట్యాక్స్‌ల పేరుతో డిపాజిట్‌ చేయించుకుని స్వాహా చేస్తున్నారు. అసలే ఆర్థిక సమస్యలు/అవస రాల్లో ఉండి తమ అవయవాలు సైతం అమ్ముకునేందుకు సిద్ధమైన బాధితులు ఈ మోసాలతో మరింత కుదే లవుతున్నారు. తమ ఆస్పత్రి పేరుతో ఓ ఐడీ సృష్టించిన కొందరు అవయవాల కొనుగోలు పేరుతో దందా ప్రారంభించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని అపోలో ఆస్పత్రి యాజమాన్యం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బెంగళూరు కేంద్రంగా ఓ వ్యక్తి ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఓ ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లగా, ఆ నేరగాడు నైజీరియన్‌ అని తేలింది. అతడు ఇటీవలే తమ దేశానికి వెళ్లిపోయినట్లు తెలిసింది. అతడు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తితో బేరసారాలు చేశాడని బయటప డింది. అతడి కిడ్నీని రూ.కోటికి ఖరీదు చేస్తానం టూ చెప్పి.. ఎయిర్‌పోర్ట్‌ కథ నడిపి రూ.30 లక్షలు స్వాహా చేశాడని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తిం చారు. దీనిపై ఆ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.  

మరిన్ని వార్తలు