‘మింట్‌ కాంపౌండ్‌’ దాతృత్వం

26 May, 2019 01:26 IST|Sakshi
గాంధీఆస్పత్రికి వైద్యపరికరాలను అందిస్తున్న మింట్‌కాంపౌండ్‌ ప్రతినిధులు

గాంధీ ఆస్పత్రికి రూ.కోటి వైద్య పరికరాలు వితరణ

హైదరాబాద్‌: సుమారు రూ.కోటి విలువైన వైద్య పరికరాలను గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి వితరణగా అందించి మింట్‌ కాంపౌండ్‌ ఇండియా తన దాతృత్వాన్ని చాటుకుంది. ఆస్పత్రి ప్రాంగణంలో శనివారం జరిగిన కార్యక్రమంలో మింట్‌ కాంపౌండ్‌ ఇండియా హైదరాబాద్‌ శాఖ చీఫ్‌ ఆపరేషన్‌ మేనేజర్, హెచ్‌ఆర్‌ హెడ్‌ రాములు వైద్య పరికరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్‌కు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో రాములు మాట్లాడుతూ.. నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన వైద్య పరికరాలను తాము అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

పేదల ప్రాణాలు కాపాడేందుకు గాంధీ వైద్యులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీలో భాగంగా నిరుపేద రోగుల కోసం ఏదైనా చేయమని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌కుమార్, ఆర్‌ఎంఓ శేషాద్రి తమను కోరారన్నారు. దీంతో రెండు వేక్‌ థెరపీ మిషన్లు, ఎండోవీనస్‌ లేజర్‌ మిషన్, 2డీ ఎకో, రెండు లాప్రోస్కోపిక్‌ మిషన్లు, హైఫ్రీక్వేన్సీ ఇంపెడెన్స్‌ మనోమెట్రీ, జెసిస్‌ ఆపరేటింగ్‌ మైక్రోస్కోప్, ఆపరేటింగ్‌ హిస్టరోస్కోపీ వంటి వైద్య పరికరాలను కొనుగోలు చేసి అందించామన్నారు.
 
కార్పొరేట్‌ సంస్థలు ముందుకు రావాలి
గాంధీ ఆస్పత్రిలో నిరుపేద రోగులకు మరిన్ని మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించేందుకు కార్పొరేట్‌ సంస్థలు ముందుకురావాలని శ్రవణ్‌కుమార్‌ కోరారు. గత రెండేళ్లలో గాంధీ ఆస్పత్రిలో అనేక అభివృద్ధి, వసతుల కల్పన కార్యక్రమాలు చేపట్టామని, వందల సంఖ్యలో అరుదైన ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా గాంధీ ఖ్యాతిని ఇనుమడింపజేశామన్నారు.

గాంధీ ఆస్పత్రిలో రూ.30 లక్షల వ్యయంతో పేషెంట్‌ అటెండర్‌ షెడ్, ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటుకు ఎన్‌టీపీసీ సంస్థ ముందుకు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ శ్రవణ్‌కుమార్, హెచ్‌వోడీలు రాజారావు, శోభన్‌బాబు, మహాలక్ష్మీ, శ్రీహరి, ఆర్‌ఎంవోలు జయకృష్ణ, శేషాద్రిలతోపాటు మింట్‌ కాంపౌండ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు