మూడు గంటలకో రైతు బలి

30 Sep, 2015 04:53 IST|Sakshi

- రుణమాఫీని నాలుగేళ్లు సాగదీయడం వల్లే బలవన్మరణాలు
- శాసనమండలిలో ప్రభుత్వంపై విపక్షాల మండిపాటు
- రైతు ఆత్మహత్యలపై సర్కారు లెక్కలన్నీ తప్పుల తడకలే
- 60 ఏళ్ల పాపాల్ని గత 16 నెలలుగా సరిదిద్దుతున్నామన్న అధికార పక్షం
 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో సగటున మూడు గంటలకో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడని.. అయినా ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని శాసనమండలిలో విపక్షాలు మండిపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వర్షాభావం నెలకొన్నా... కరువు మండలాల జాబితాను ఇంకా కేంద్రానికి ఎందుకు పంపలేదని నిలదీశాయి. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై మంగళవారం శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది.

మరణించిన రైతుల ఆత్మ శాంతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలంటూ సభ ప్రారంభంలోనే కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. చర్చ జరిగాకే సంతాపాలకు అనుమతించాలని అధికారపక్షం కోరింది. అనంతరం రాష్ట్రంలో వ్యవసాయ పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలపై వ్యవ సాయ మంత్రి ప్రకటనను ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మండలిలో చదివారు. అనంతరం విపక్ష నేత షబ్బీర్‌అలీ మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక 15 నెలల్లో రాష్ట్రంలో 1,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు తమవద్ద లెక్కలున్నాయన్నారు. బంగారు తెలంగాణలో ప్రతి మూడు గంటలకు ఒకరైతు చొప్పున పిట్టల్లా రాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి రైతుకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొం దని... ఇప్పుడు మాఫీ పేరుతో నాలుగేళ్ల పాటు రైతుల చేతులకు బేడీలు వేసిందని మండిపడ్డారు. రుణాలు మాఫీకాక తాకట్టులో ఉన్న పాస్ పుస్తకాలు, బంగారాన్ని బ్యాంకులు తిరిగివ్వడం లేదని.. ఈ కారణంగా మరొక చోట అప్పు తీసుకునే అవకాశం కూడా లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. రైతుల రుణాలన్నిం టికీ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుని తాకట్టులో ఉన్న డాక్యుమెంట్లు, బంగారం వారికి ఇప్పించాలని డిమాండ్ చేశారు.

రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు తక్షణం కమిటీని వేసి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, వ్యవసాయ రంగానికి కేంద్రం నుంచి నిధులు రప్పించే విషయంలో అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 4 బడా విత్తన కంపెనీలు నకిలీ విత్తనాలతో రైతులను నట్టేట ముంచుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్యను తగ్గించి చూపడం సరికాదని బీజేపీ సభ్యుడు ఎన్.రామచంద్రరావు పేర్కొన్నారు.

విపక్షాలది రాజకీయం
60 ఏళ్లుగా జరిగిన పాపాలను గత 16 నెలలుగా సరిదిద్దుతున్నామని ఎమ్మెల్సీ కర్నెప్రభాకర్ వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలపై విపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్నారు. ఆత్మహత్యలు నివారించేం దుకు కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌కు సిద్ధపడితే విపక్షాలు అడ్డుకుంటున్నాయని ఎమ్మెల్సీ పూల రవీందర్ పేర్కొన్నారు. రైతుల ఆత్మహత్యలను నిరోధించడంపై స్వామినాథన్, జయతీ ఘోష్ కమిటీలు ఇచ్చి న నివేదికలను గత ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయని పల్లారాజేశ్వర్‌రెడ్డి విమర్శించారు.

మరిన్ని వార్తలు