రాబందులూ రారండోయ్‌!

25 Jul, 2019 12:36 IST|Sakshi

నగరంలో పదేళ్లుగా కానరాని జాడ

చరమాంకంలో జూపార్కులోని రాబందులు

మహారాష్ట్ర సర్కారుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ

గడ్చిరోలిలో పర్యటించిన జూ అధికారులు

12 రాబందులను ఎంపిక చేసిన బృందం

అనుమతి రాగానే నెహ్రూ జాపార్కుకు తరలింపు

అత్యంత అరుదైన పక్షి జాబితాలో రాబందు

సంతతి అభివృద్ధి చేయాలని నిర్ణయం

రాబందులు.. అంతరించిపోయే పక్షి జాతిలో ఉన్న వీటిని ఈ తరం వారు చూసింది తక్కువమందే ఉంటారు. పర్యావరణ అసమతుల్యం.. వాతావరణంలో మార్పులతో పాటు మానవ జాతి చేసిన తప్పిదాలు ఈ పక్షుల మనుగడపైపెను ప్రభావం చూపాయి. దాంతో ఒకప్పుడు హైదరాబాద్‌ నగర పరిసరాల్లో వందల సంఖ్యలో ఉన్న రాబందులు క్రమంగా కనుమరుగయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక్క రాబందును చూపిస్తే లక్ష రూపాయల నజరానా కూడా ప్రకటించారు.

సాక్షి, హైదరాబాద్‌: నగరం కాంక్రీట్‌ జంగిల్‌గా మారడం.. ఆ పక్షుల ఆహారమైన జంతువుల కళేబరాలు దొరకకపోవడం.. దొరికినా అవి విషతుల్యం కావడంతో ఇవి అంతరించిపోయే దశకు చేరాయి. కుళ్లిన మాంసం వ్యర్థాలను ఆహారంగా తీసుకునే ఈ జాతి ఉనికి గత పదేళ్లుగా కనిపించనే లేదు. నెహ్రూ జూలాజికల్‌ పార్కులో ఏడు మగ, నాలుగు ఆడ రాబందులు ఉన్నప్పటికీ వాటి జీవిత కాలం కూడా దాదాపు చరమాంకానికి చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా వీటి జాతి పూర్తిగా అంతరించిపోయే దశకు చేరుకోవడంతో పర్యావరణవేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం రాబందుల జాతిని, సంతతిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. జూపార్కుకు కొన్ని రాబందులను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర సర్కారుకు ఈ ఏడాది ఫిబ్రవరి 16న లేఖ రాసింది. దీనిపై అక్కడి సర్కారు సానుకూలంగా స్పందించడంతో ఇటీవల కొందరు జూపార్కు అధికారుల బృందం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పర్యటించి 10 నుంచి 12 రాబందులను ఎంపిక చేశారు. వాటిని త్వరలో జూ పార్కుకు తీసుకురావాలని నిర్ణయించారు. తెలంగాణ వన్యప్రాణి సంరక్షణ విభాగం రాబందుల సంరక్షణ ప్రాజెక్టును చేపట్టనుంది. ఇందుకు  అవసరమైన నిధులను సెంట్రల్‌ జూ అథారిటీ సమకూరుస్తుంది. 

అత్యంత అరుదైన పక్షి జాబితాలో రాబందు
ఒకప్పుడు సామాన్య పక్షుల జాబితాలో ఉన్న రాబందులను భారత ప్రభుత్వం ‘అత్యంత అరుదైన పక్షుల’ జాబితాలో చేర్చింది. పశువుల్లో నొప్పుల నివారణకు వినియోగించే డైక్లో ఫినాక్‌ వంటి ఔషధాలను కొన్నేళ్ల క్రితం వరకు ఎక్కువగా వాడేవారు. ఈ ఔషధం ఆనవాళ్లు ఆ జంతువుల్లో అలాగే ఉండిపోవడంతో పశువులు చనిపోయినప్పుడు వాటి కళేబరాన్ని తిన్న రాబందులు ఎక్కువగా మరణిస్త్నుట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా పంటల ఎదుగుదలకు, సస్యరక్షణకు వినియోగించే ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం కూడా ఈ జాతి పాలిట శాపంగా మారినట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది.  
బెంగళూరు సమీపంలోని హండిగుండి వద్ద అత్యంత ఎత్తయిన రామదేవర గుట్టపై 2005లో కొన్ని రాబందులను గుర్తించారు. దాంతో కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని రాబందుల అభయారణ్యంగా ప్రకటించింది. అదేవిధంగా పంజాబ్‌లోని పింజర్‌లో బ్రీడింగ్‌ సెంటర్, మహరాష్ట్రలోని గడ్చిరోలిలో అభయారణ్యం ఏర్పాటుతో వీటి సంతానం క్రమంగా వృద్ధి చెందుతోంది. కాగా, 2013 లో రెండు రాబందులను ఆసిఫాబాద్‌ జిల్లాలోని బెజ్జూరు అటవి ప్రాంతంలోని పాలరాపు గుట్ట పై అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఇవి గడ్చిరోలి నుంచి వలస వచ్చినట్లు తేల్చారు.  

ఏడాదికి ఒక్క గుడ్డు మాత్రమే..
నెహ్రూ జూ పార్కులో ప్రస్తుతం వైట్‌ బ్యాక్డ్‌ (తెల్ల వీపు) రకానికి చెందిన రాబందులు మాత్రమే ఉన్నాయి. లాంగ్‌ బిల్డ్‌ (పొడవు ముక్కు) రకాలకు చెందినవి ఒక్కటీ లేదు. ఒక్క ఆడ రాబందు ఏడాదికి ఒకసారి మాత్రమే గుడ్డు పెడుతుంది. ఈ గుడ్డు పొదిగి పిల్ల పుడితే వాటి జాతి క్రమేణ పెరిగేది. కానీ జూ పార్కులో ఉన్నవి ఏటా గుడ్లు పెడుతున్నప్పటికీ దాని పెంకు పలుచగా ఉండడంతో పొదిగి పిల్లగా మారడం లేదు. ఒకవేళ గుడ్డు పొదగి పిల్ల పుట్టినా అది బతకడం లేదని అధికారులు చెబుతున్నారు. జూలో ఉన్న రాబందులు కొన్నేళ్లుగా ఇవే ఉండటంతో జన్యుసంబంధిత లోపాలతో వాటి జాతి వృద్ధి చెందడం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గడ్చిరోలి నుంచి తెచ్చే కొత్త రాబందులు, జూలో ఉన్నవి కలవడం వల్లయినా వాటి జాతి పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు