లక్ష దాటిన వలస ప్రయాణం

21 May, 2020 06:20 IST|Sakshi
బుధవారం సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రైలు..

తెలంగాణ నుంచి శ్రామిక్‌ రైళ్లలో తరలివెళ్లిన 1,00,324 మంది కార్మికులు

ఇప్పటి వరకు నడిచిన రైళ్లు 74.. 

సాక్షి, హైదరాబాద్‌: వలస కార్మికుల ప్రయాణం కొనసాగుతోంది. దక్షిణమధ్య రైల్వే నడుపుతున్న ప్రత్యేక శ్రామిక్‌ రైళ్ల ద్వారా బుధవారం సాయంత్రానికి తెలంగాణ నుంచి 74 రైళ్ల ద్వారా 1,00,324 మంది స్వస్థలాలకు వెళ్లారు. ఇందులో ఎక్కువ మంది ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల వారున్నారు. ఇక్కడికి దాదాపు 2,600 కి.మీ. దూరంలో ఉన్న మణిపూర్‌కు కూడా 3 రైళ్ల ద్వారా 4,800 మంది తరలివెళ్లారు. ఈనెల ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి లిం గంపల్లి నుంచి 27, చెర్లపల్లి నుంచి 4, ఘట్కేసర్‌ నుంచి 17, బీబీనగర్‌ నుంచి 8, నాగులపల్లి నుంచి 9, బొల్లారం నుంచి 8, మేడ్చల్‌ నుంచి ఒకటి నడిచాయి. ఎండలు తీవ్రంగా ఉం డటంతో నడుస్తూ, సైకిళ్ల ద్వారా వెళ్లటం ప్రమాదమని భా వించి క్రమంగా శ్రామిక్‌ రైళ్ల కోసం పేర్లు నమోదు చేసుకుం టున్న కార్మికుల సంఖ్య పెరుగుతోంది. (నేటి నుంచి ప్రగతి రథం పరుగులు)

ఇక దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నుంచి పది స్టేషన్ల ద్వారా 44 రైళ్లలో 50,227 మంది, మహారాష్ట్ర నుంచి 12 రైళ్ల ద్వారా 15,915 మంది తరలారు. వెరసి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటి వరకు 1,66,466 మంది వలస కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలివెళ్లారు. ఎన్ని రైళ్లయినా నడిపేందుకు సిద్ధం: దక్షిణ మధ్య రైల్వే ఇప్పటివరకు బిహార్‌కు 40, జార్ఖండ్‌కు 13, రాజస్తాన్‌కు 9, ఉత్తరప్రదేశ్‌కు 30, మణిపూర్‌కు 3, ఛత్తీస్‌గఢ్‌కు 4, మధ్యప్రదేశ్‌కు 12, ఒడిశాకు 9, మహారాష్ట్రకు 3, పశ్చిమబెంగాల్‌కు 1, ఉత్తరాఖండ్‌కు 1 చొప్పున రైళ్లు నడిపింది. దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా మాట్లాడుతూ ఇంకా ఎన్ని శ్రామిక్‌ రైళ్లు నడిపేందుకైనా సిద్ధమని చెప్పారు. (ఔటర్‌పై ఇక రైట్‌..రైట్‌..)

రూ.8.5 కోట్లు చెల్లించాం: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌  
రాష్ట్రం నుండి లక్ష మంది వలస కార్మికులను 74 ప్రత్యేక రైళ్లలో వివిధ రాష్టాలకు పంపించినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అధికారులను అభినందించారు. బుధవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో నిర్వహించిన సమీక్షా స మావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ ఆదేశాల తో నోడల్‌ బృందం, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా కలెక్టర్లు, హై దరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, రై ల్వే తదితర శాఖలు కృషి చేశాయన్నారు. వలస కార్మికుల తరలింపుకు రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు 8.5 కోట్లు చెల్లించిందన్నారు. సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా తదితరులు పాల్గొన్నారు. 

సికింద్రాబాద్‌ నుంచి ఢిల్లీకి తొలి రైలు..
ప్రయాణికుల తరలింపునకు ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు మొట్టమొదటిసారి సికింద్రాబాద్‌ నుంచి న్యూఢిల్లీకి బయలుదేరింది. సికింద్రాబాద్‌–న్యూఢిల్లీ (02437) స్పెషల్‌ ట్రైన్‌ బుధవారం మధ్యాహ్నం 1.15కి సికింద్రాబాద్‌ స్టేషన్‌ 10వ ప్లాట్‌ఫామ్‌ నుంచి బయలుదేరింది. గురువారం ఉదయం 10.40కి ఇది న్యూఢిల్లీకి చేరుకోనుంది. ఈ ట్రైన్‌లో మొత్తం 1,003 మంది ప్రయాణికులు బయలుదేరారు.దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా పర్యవేక్షణలో అధికారులు కరోనా నిబంధనల మేరకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు, శానిటైజేషన్‌ తరువాత రైల్లోకి అనుమతించారు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేలా ఆర్‌పీఎఫ్‌తో పాటు అన్ని విభాగాలు జాగ్రత్తలు తీసుకున్నాయి.

మరిన్ని వార్తలు