గుప్త నిధుల వేటలో అపశ్రుతి

5 Sep, 2014 02:36 IST|Sakshi

బిచ్కుంద :  శాంతాపూర్ గండిలో బుధవారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వుతుండగా ఓ వ్యక్తిపై పెద్ద రాయి పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బిచ్కుంద మండలం పెద్దకొడప్‌గల్, బేగంపూర్, అంజని, జుక్కల్ మండలం ఖండేబల్లూర్, పోచారం తండాకు చెందిన సు మారు 25 మంది, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో కలిసి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో బండరాళ్ల మధ్యలోనుంచి పది అడుగుల లోతు తవ్వారు.

బుధవారం రాత్రి తవ్వకాలు కొనసాగిస్తుండగా గుంతలోపల ఉన్న పోచారం గ్రామానికి చెందిన జైత్రాంపై పెద్ద రాయి పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టినవారు అక్కడినుంచి పరారయ్యారు. ఆ నోట ఈ నోట విషయం బయటికి పొక్కింది. అదే రాత్రి ఎస్సై ఉపేందర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు.

 అత్యాశతో..
 వరాల కోసం దేవుడిని వేడుకునే మనిషి.. అత్యాశకు పోయి గుప్తనిధుల కోసం ఆ దేవుడి ఆలయాల వద్దే తవ్వకాలు జరుపుతున్నాడు. పాత మందిరాలు, చారిత్రక కట్టడాలను తవ్వేస్తున్నాడు. మందిరాలను కూల్చుతున్నాడు. బిచ్కుందలో, శాంతాపూర్ గండిలో కౌలాస్ ఖిల్లాలో గుప్త నిధులు ఉన్నాయని నమ్ముతున్నవారు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు.

 కౌలాస్ ఖిల్లాను పరిపాలించిన రాజులు శాంతాపూర్ గండిలో బంగారు నాణాలను పాతిపెట్టారని ప్రచారంలో ఉంది. దీంతో గుప్తనిధుల కోసం ఆ ప్రాంతం లో తరచూ తవ్వకాలు జరుపుతున్నారు. అలా తవ్వకాలు జరుపుతున్న క్రమంలోనే బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది.

 గతంలో..
 బిచ్కుంద -తక్కడపల్లి రోడ్డులో ఉన్న 500 ఏళ్ల నాటి ఆలయాన్ని గతంలో గుప్తనిధుల కోసం కూల్చేశారు. బిచ్కుంద కమ్మరి చెరుపుట్ట, శాంతాపూర్, కందర్‌ప ల్లి, బడారెంజల్ గ్రామాల్లో తవ్వకాలు జరిపారు. నాలుగేళ్ల క్రితం బిచ్కుదలో ఏడేళ్ల బాలుడిని బలి ఇచ్చారని వదంతులు వ్యా పించాయి. అత్యాశతో పలువురు చారిత్రక కట్టడాలను కూల్చేస్తూనే ఉన్నారు.

మరిన్ని వార్తలు