దేశసేవలో తెలంగాణ సైనికుడి వీరమరణం

26 Dec, 2018 07:04 IST|Sakshi
విషాదంలో సైనికుడి కుటుంబం రాజేశ్‌ దాక్వా (ఫైల్‌)

చింతలమానెపల్లి(సిర్పూర్‌): భరతమాత సేవలో ఓ సైనికుడు వీరమరణం పొందాడు. కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌ గ్రామానికి చెందిన సైనికుడు హావల్దార్‌ రాజేశ్‌దాక్వా(40) భారత్, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో సోమవారం రాత్రి మృతి చెం దారు. భారత ఆర్మీ అధికారులు తెలిపిన సమాచారంతో స్థానిక పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడు కశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్‌ పరిధిలోని డోండా జిల్లా ఆర్‌ఆర్‌ రెజిమెంట్‌–4లో విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. 1978లో జన్మించిన రాజేశ్‌దాక్వా 1997లో సైనికుడిగా ఆర్మీలో చేరారు. క్రమంగా ఎదిగి హావల్దార్‌గా పదోన్నతి పొందారు. సోమవారం రాత్రి సమయంలో విధుల్లో ఉండగా కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. మృతుడికి కాగజ్‌నగర్‌ మండలం ఈస్‌గాం గ్రామానికి చెందిన జయతో వివాహం కాగా  కుమార్తెలు రోహిణి, ఖుషి ఉన్నారు.

తండ్రి మణిహోహన్‌ గతంలోనే మరణించగా తల్లి లతిక రవీంద్రనగర్‌లో హోటల్‌ నిర్వహిస్తున్నారు. కాగా రాజేశ్‌ పార్థివదేహాన్ని ముందుగా శ్రీనగర్‌ తరలించి అక్కడి నుంచి ఢిల్లీలో లాంఛనాలు ముగి శాక స్వస్థలానికి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ఘటనతో చింతలమానెపల్లి మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రజలు వీరసైనికుడికి నివాళులర్పించారు. ఇదిలా ఉండగా రాజేశ్‌ రవీంద్రనగర్‌లో 7వ తరగతి వరకు చదివారు. అనంతరం కాగజ్‌నగర్‌లోని సర్‌సిల్క్‌ శిశుమందిర్‌లో 10వ తరగతి చదివాడు. 18వ ఏట 1995లో దేశ రక్షణకోసం ఆర్మీలో చేరాడు. మొదటగా బెంగళూర్‌ ఇంజినీరింగ్‌ రెజిమెంట్‌లో శిక్షణ పొంది విధుల్లో చేరగా సైనికులకు అవసరమైన ఇంజినీరింగ్‌ విభాగంలో నిష్ణాతుడిగా పేరుగాంచారు. సైనికుడిగా విధుల్లో చేరిన రాజేశ్‌ అంచెలంచెలుగా లాన్స్‌నాయక్, నా యక్, హావల్దార్‌గా పదోన్నతులు పొందాడు. హా వల్దార్‌గా పనిచేస్తున్న రాజేశ్‌ మరి కొద్ది నెలల్లో 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకునేవాడు.

దేశ భక్తుడు.. 
చిన్నతనం నుంచే అన్నింట్లో ముందున్న రాజేశ్‌లో సైనికుడిగా దేశభక్తి ఎక్కువ. ఈక్రమంలో సైనికుడిగా దేశం తరఫున మిత్రదేశం ఆఫ్రికాలో సేవలందించాడు. గతంలో సియాచిన్‌ గ్లేసియర్‌లో విధుల్లో ఉండగా జరిగిన దా డుల్లో సైతం ప్రమాదానికి గురయ్యా డు. సహచరుడిని కోల్పోయి చేతికి తీవ్ర గాయమైనా అధైర్యపడకుండా విధుల్లో కొనసాగాడు.  24 ఏళ్లలోఎక్కువగా దేశ రక్షణకు అత్యంత కీలకమైన సరిహద్దుల్లోనే విధులు నిర్వహించాడు. ప్రధానంగా అస్సాం, పంజాబ్, జమ్ముకశ్మీర్‌లోనే విధుల్లో ఉండడం రాజేశ్‌ దేశభక్తికి నిదర్శనం. కాగా  రాజేశ్‌ను సురక్షిత ప్రాంతమైన కలకత్తాలో నియమించారు. అయినా దేశసేవకోసం పరితపించి సరిహద్దుల్లోనే విధులను ఎంచుకున్నాడు.

అన్నింట్లో ముందంజే.. 
చిన్నతనంలో తనతోపాటు చదువుకున్న మిత్రులు జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నారు. రవీంద్రనగర్‌ గ్రామం నుంచి ఆటల పోటీలలో గ్రామం జట్టు తరఫున ఎన్నో పథకాలు సాధించామని క్రికెట్‌ ఆటగాడిగా ఒంటి చేత్తో విజయాలు సాధించేవాడని సన్నిహితులు మిత్రులు గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం గ్రామం నుంచి దేశ రక్షణలో చాలా మంది ఉన్నారని కాని గ్రామం నుంచి రక్షణకోసం ఆర్మీలో మొదటిసారిగా రాజేశ్‌ చేరాడని గ్రామస్తులు తెలిపారు. తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో 5న స్వస్థలానికి వచ్చిన రాజేశ్‌ తిరిగి ఈనెల 14న విధుల్లోకి వెళ్లాడు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో 18న సరిహద్దుల్లో విధుల్లో చేరాడు.   

ఒకే తేదీన ఇద్దరు సైనికులు.. 
చింతలమానెపల్లి: డిసెంబర్‌ 24 నియోజకవర్గంలో ఇద్దరు సైనికులు వీరమరణం పొం దిన రోజు. యాధృచ్చికమే అయినా ఇదే రోజు న ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఈనెల 24సోమవారం రాత్రి జరిగిన కాల్పుల్లో రాజేశ్‌ దాక్వా మృతి చెందారు. కాగా నియోజకవర్గంలోని కోర్సిని గ్రామానికి చెందిన వసాకె భీమయ్య, నాగమణి దంపతుల కుమారుడు వసాకె సంతోష్‌ సైతం 2015 సంవత్సరంలో ఇదే నెలలో 24న వీరమరణం పొందాడు. కారాకోరం పర్వత శ్రేణుల్లోని సియాచిన్‌ గ్లేసియర్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తూ ప్రమాదానికి గురయ్యాడు. యాధృచ్చికమే అయినా ఒకే నెలలో ఒకే తేదీన సిర్పూర్‌ నియోజకవర్గానికి చెందిన సైనికులు వీరమరణం పొందడం కలిచివేస్తోంది.

మరిన్ని వార్తలు