‘సఖీ’తో సమస్యల పరిష్కారం

5 Mar, 2019 12:37 IST|Sakshi
సఖీ సెంటర్‌ను ప్రారంభిస్తున్న కడియం శ్రీహరి (ఫైల్‌)

బాధిత మహిళలకు 

భరోసాగా వన్‌స్టాప్‌ సెంటర్‌

24 గంటలు అందుబాటులో సేవలు

ఫిర్యాదు, సేవలకు 181 టోల్‌ఫ్రీ

పదిహేను నెలల్లో 260 మంది మహిళలకు కౌన్సిలింగ్‌

కాజీపేట అర్బన్‌ : బాధిత మహిళల సంరక్షణ, వసతి, పోలీస్, న్యాయ సేవలందించేందుకు మేమున్నామంటూ భరోసా ఇస్తోంది సఖీ/వన్‌స్టాప్‌ సెంటర్‌. సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు, గృహహింస, లైంగిక వేధింపులు, యాసిడ్‌ దాడులు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు తదితర సమస్యలను ఒకే చోట పరిష్కారం అందించేందుకు తాత్కాలిక వసతి కల్పించేందుకు ఇది తోడ్పడుతోంది. 24 గంటలు అందుబాటులో సేవలందిస్తూ నేడు మహిళలకు, బాలికల సంరక్షణకు ఆత్మీయ నేస్తంగా సఖీ సెంటర్‌ మారింది.

2017 డిసెంబర్‌లో ప్రారంభం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించేందుకు షీటీమ్స్, 181 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్, డీవీ సెల్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశవ్యాప్తంగా 186 వన్‌స్టాప్‌ సెంటర్‌లను ప్రారంభించేందుక శ్రీకారం చుట్టగా రాష్ట్రంలోని పది జిల్లాలను ఎంపిక చేసింది. వీటిల్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, స్వచ్ఛంద సంస్థ సహకారంతో సేవలందించేందుక ప్రణాళికలను రూపొందించింది.

ఇందులో భాగంగా నగరంలో 2017 డిసెంబర్‌లో సర్వోదయ యూత్‌ ఆరనైజేషన్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా హన్మకొండ ఎక్సైజ్‌కాలనీలో సఖి/వన్‌స్టాప్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. నాటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి లాంచనంగా ప్రారంభించారు.


సఖీ సెంటర్‌ కార్యాలయం

అందుబాటులో సేవలు..

బాధిత మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు 24 గంటలపాటు సఖి/వన్‌స్టాప్‌ సెంటర్‌ అందుబాటులో ఉంటుంది. మహిళలకు, బాలికలకు కౌన్సెలింగ్, వైద్య, న్యాయ సహాయం, తాత్కాలిక వసతి, పోలీస్‌ సహాయం, కోర్టుకు రాలేని బాధిత మహిళలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా న్యాయ సహాయం అందిస్తారు.

వన్‌స్టాప్‌ సెంటర్‌ వీరికే..

బాధిత మహిళలు, బాలికలకు సేవలందించే లక్ష్యంతో సఖీ/వన్‌స్టాప్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. గృహహింస, వరకట్న, లైంగిక వేదింపులు, మహిళలు, పిల్లల అక్రమ రవాణా, అత్యాచారాలు, యాసిడ్‌ దాడులు, పనిచేసే చోట లైం గిక వేదింపులకు గురి చేసే చోట అన్ని శాఖ సమన్వయంతో పరిష్కార మార్గాలను చూపుతుంది.


వన్‌స్టాప్‌ అంబులెన్స్‌

260 సమస్యల పరిష్కారం..

మహిళలకు, బాలికలకు తక్షణ రక్షణ, తాత్కాలికంగా  ఐదు రోజుల వసతిని అందిస్తూ బాధితులకు మేమున్నామనే భరోసానందిస్తుంది సఖీ సెంటర్‌. గత పదిహేను నెలల్లో సుమారు 260 బాధిత మహిళల సమస్యలను పరిష్కరించారు. జిల్లాలోని 58 డివిజన్‌ల్లో సఖీ సెంటర్‌ సేవలపై విస్త్రత ప్రచారం అందిస్తూ బాధితులకు చేరువవుతున్నారు.

నిరంతర సేవలందిస్తున్నాం..

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సౌజన్యంతో సర్వోదయ యూత్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో బాధిత మహిళలకు నిరంతరం సేవలందించడం ఆనందంగా ఉంది. హింసా రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. న్యాయ, పోలీసు, వైద్య సేవలతో పాటు తాత్కాలిక వసతి అందించి కౌన్సిలింగ్‌ ద్వారా మార్పునకు నాంది పలుకుతున్నాం.
– పల్లెపాటు దామోదర్, 
సఖీ సెంటర్‌ నిర్వాహకుడు

మరిన్ని వార్తలు