వన్‌టైం సెటిల్‌మెంట్‌కు విశేష స్పందన

14 Jan, 2015 04:19 IST|Sakshi

రూ.3.07 కోట్ల బకాయిలు వసూలు చేసిన డీసీసీబీ
 
హన్మకొండ : వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా రుణాలు చెల్లించాలని డీసీసీబీ పాలకవర్గం ఇటీవల చేసిన ప్రకటనకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ మేరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా రూ.3.07కోట్ల మొండి బకాయిలు వసూలు చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. పేరుకుపోయిన దీర్ఘకాలిక రుణాల వసూళ్లకు డీసీసీబీ పాలకవర్గం గత డిసెంబర్‌లో వన్‌టైం సెటిల్‌మెంట్ పథకాన్ని చేపట్టింది. అయితే గతంలో బావుల వద్ద పైపులైన్లు వేసుకునేందుకు, ట్రాక్టర్ల కొనుగోలు, పాడి, గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమల ఏర్పాటుకు డీసీసీబీ రైతులకు రుణాలు అందించింది.

కాగా, 1992 సంవత్సరానికి ముందు రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు చెల్లించకపోవడంతో పెద్దఎత్తున పేరుకుపోయాయి. దీంతో బకాయిలు బ్యాంకును నష్టాల్లో చూపిస్తున్నాయి. అయితే వాటిని ఎలాగైనా రాబట్టుకోవాలనే ఆలోచనతో పాలకవర్గం, అధికారులు వన్‌టైం సెటిల్‌మెంట్‌కు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్‌లో దీర్ఘకాలిక రుణాలు ఏక మొత్తంలో చెల్లించిన రైతులకు లాభం చేకూర్చేందుకు పథకాన్ని ప్రకటించారు.

కాగా, డీసీసీబీలో 1992 నుంచి 700 మంది రైతులకు చెందిన రూ.8.08కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. అయితే వాటిని తిరిగి వసూలు చేయాలనే ఉద్దేశంతో డిసెంబర్‌లో ఒకే మొత్తంలో రుణాన్ని చెల్లించిన వారికి 35 శాతం మాఫీని ప్రకటించడంతో రైతుల నుంచి స్పందన వచ్చింది. అసలు, వడ్డీ కలుపుకుని మొత్తంలో 35 శాతం మాఫీని ప్రకటించడంతో రైతులు పాత బకాయిలు చెల్లించేందుకు ముందుకొచ్చారు.

దీనికి తోడు డీసీసీబీకి చెందిన 26 ప్రత్యేక బృందాలు రైతులను నేరుగా కలిసి అవగాహన కల్పించడంతో పాటు ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో సుమారు 300 మంది రైతులు తమ బకాయిలు రూ.3.07 కోట్లు చెల్లించారు. కాగా, ఒకేసారి బకాయిలు చెల్లించడం ద్వారా 35 శాతం కింద డీసీసీబీకి రూ.1.07 లక్షల మాఫీ ద్వారా లబ్ధి చేకూరింది. అలాగే  రైతులకు ప్రయోజనం కలిగింది.

మరిన్ని వార్తలు