ఉల్లి ఘాటు.. పప్పు పోటు!

6 Sep, 2019 11:46 IST|Sakshi

 మహారాష్ట్ర నుంచి తగ్గిన దిగుమతులు

వర్షాకాలంలోనూ తగ్గని కూర‘గాయాలు’

జనం అల్లాడుతున్నా పట్టని సర్కారు

సాక్షి, జమ్మికుంటటౌన్‌ (హుజూరాబాద్‌): ఉల్లి ఘాటెక్కింది. స్వల్పకాలంలో ధర అమాంతం పెరి గింది. ప్రస్తుతం కిలో రూ.40 నుంచి రూ.48 పలుకుతోంది. పప్పుల ధరలు సైతం నిప్పులు చిమ్ముతున్నాయి. మినప, కందిపప్పు రూ.వందకు చేరువయ్యాయి. మిగతా పప్పులూ అదే వరుసలో నిలిచాయి. కూరగాయల ధరలు ఇంకా కరుస్తూనే ఉన్నాయి. వర్షాకాలంలోనూ ధరలు దిగిరావడం లేదు. మార్కెట్లో నిత్యావసరాలు మండుతున్నా, ధరలకు తాళలేక సామా న్యులు అల్లాడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. ధరల నియంత్రణపై యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

కొరతతో ఘాటెక్కిన ఉల్లి ధర..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఉల్లిసాగు ఎక్కడా లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొం దరు రైతులు వారి అవసరాల కోసం పెరట్లో పండించడం తప్ప భారీగా సేద్యం చేసిన దాఖలాల్లేవు. ఉద్యానశాఖ అంచనా ప్రకారం.. ఉమ్మడి జిల్లాకు ఏటా 52,000 టన్నుల ఉల్లిగడ్డ అవసరం. ప్రజల అవసరాలకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఉల్లి దిగుమతి అవుతోంది. అధికశాతం మహారాష్ట్ర వ్యాపారులే సరఫరా చేస్తారు. అక్కడి రైతులు రబీలో పండించిన ఉల్లిగడ్డను భారీగా ఇళ్లలో దాచుకుంటారు. ఆర్థిక అవసరాలకు అనుగు నంగా వ్యాపారులకు విక్రయిస్తారు. వారు గోదాముల్లో నిల్వచేసుకున్న సరుకుతో ఏడాది పొడవునా వ్యాపారం సాగిస్తారు. కాగా.. ఈసారి మహారాష్ట్రలో ఉల్లిసాగు గణనీయంగా తగ్గింది. వరుస తుపాన్లకు వరద ముంచెత్తడంతో పంట దెబ్బతింది. ఫలితంగా దిగుబడులు భారీగా పడిపోయాయి.

చేతికొచ్చిన అరకొర పంట సైతం ముసురుకు పాడైపోయింది. దీని ప్రభావం క్రమంగా ధరలపై పడుతూ వస్తోంది. ఈయేడు మార్చిలో కిలోకు రూ.15 నుంచి రూ.18 పలికిన ఉల్లి ధరలు ఐదు నెలల వ్యవధిలో రెట్టింపు అయ్యాయి. ఆగస్టు 16న కిలోకు రూ.22 ఉండగా, సెప్టెంబరు ఒకటిన రూ.35 చేరింది. ప్రస్తుతం రూ.38 నుంచి రూ.40 వరకు పలుకుతోంది. తెల్ల ఉల్లిగడ్డకు డిమాండ్‌ నెలకొనడంతో వ్యాపారులు కిలోకు రూ.48 దాకా అమ్ముతున్నారు. ద్వితీయశ్రేణి సరుకును రూ.10 నుంచి రూ.15 తక్కువకు ఇస్తున్నారు. ప్రస్తుతం రెండు రకాల ఉల్లి ఉత్పత్తులు మహారాష్ట్రతోపాటు కర్నూలు నుంచి దిగుమతి అవుతున్నాయి. కర్నూలు నుంచి వచ్చే ఉల్లిగడ్డ చిన్నగా ఉంటోంది. కొరత నేపథ్యంలో మరో మూణ్నెళ్లు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. డిసెంబరు దాకా ధరలు తగ్గే అవకాశం లేదని పేర్కొంటున్నారు.

పెరుగుతున్న పప్పుల ధరలు..
వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాకు ఏటా 51,557 టన్నుల పప్పుధాన్యాలు అవసరం. ప్రజలు ఇంతకంటే ఎక్కువగా  వినియోగిస్తున్నట్లు అంచనా. కానీ.. పప్పుధాన్యాల సేద్యం ఇక్కడ చాలా తక్కువగా ఉంది. కంది, శనగ, పెసర, మినుము, సోయాబీన్‌ కలుపుకొని ఏటా 25 వేల నుంచి 30 వేల హెక్టార్లలో సాగవుతుంది. వాటి దిగుబడులు స్థానిక అవసరాలకు పూర్తిగా సరిపోవు. పప్పుల సాగు అధికంగా ఉండే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల నుంచి దిగుమతి అవుతాయి. డిమాండ్‌ను బట్టి గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ నుంచి వస్తాయి. ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈసారి సాగు విస్తీర్ణం తగ్గింది.

దిగుబడులు సైతం ఆశించిన స్థాయిలో రాకపోగా, రాష్ట్రంలో పప్పుల వినియోగం పెరగడంతో దీని ప్రభావం క్రమంగా ధరలపై పడుతూ వస్తోంది. çసరిగ్గా పక్షం కిందట కిలోకు రూ.65 నుంచి రూ.86 వరకున్న వివిధ పప్పుల ధరలు ఇప్పుడు అమాంతం ఎగబాకాయి. ప్రస్తుతం కిరాణ దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.96 విక్రయిస్తున్నారు. సూపర్‌ మార్కెట్లో రూ.98 నుంచి రూ.102కు లభిస్తోంది. మినపపప్పు రూ.96, శనగపప్పు రూ.74, పెసరుపప్పు రూ.90, మైసూరుపప్పు రూ.68 లకు వ్యాపారులు అమ్ముతున్నారు. వివిధ కార్పొరేట్‌ మార్టుల్లో వీటి ధరలు ఎక్కువే ఉన్నాయి. పప్పులకు కొరత తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి దిగుమతికి సన్నాహాలు చేస్తోంది.

నేటికీ దిగిరాని కూరగాయల ధరలు..
జిల్లాలో నడి వర్షాకాలంలోనూ కూరగాయల ధరలు దిగిరావడం లేదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ నుంచి దిగుమతి కొనసాగుతుండడంతో కొన్ని రకాల కూరగాయల ధరలు అధికంగా ఉంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో క్యారెట్‌ రూ.65 నుంచి రూ.72, వంకాయ రూ.45 నుంచి రూ.48, దేశవాలి చిక్కుడు రూ.50 నుంచి రూ.64, దొండకాయ రూ.32 నుంచి రూ.36, బీరకాయ రూ.56, క్యాబేజీ రూ.40, బీన్స్‌ రూ.60, కొత్తిమీర రూ.40, గోరుచిక్కుడు రూ.40 పలుకుతోంది. మిగతా రకాలు రూ.20 నుంచి రూ.30 లోపు ఉన్నాయి. వాస్తవానికి ఈ ధరలు వేసవిలో ఉండాలి. వర్షాకాలం ఆరంభం నుంచి క్రమంగా తగ్గుతూ రావాలి. ప్రస్తుతం చాలారకాలు కిలోకు రూ.15 నుంచి రూ.30 లోపే లభించాలి. కానీ సాగుకు సర్కారు నుంచి కొరవడిన ప్రోత్సాహం, సేద్యంపై రైతుల్లో సన్నగిల్లిన ఆసక్తితో ఉమ్మడి జిల్లాలో పరిస్థితి భిన్నంగా మారింది.

కానరాని నియంత్రణ చర్యలు..
నిత్యావసరాల కొరతతో మార్కెట్లో ధరలు అడ్డగోలుగా పెరుగుతున్నా సర్కారుకు పట్టింపు కరువైంది. ధరల నియంత్రణకు ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఉల్లిగడ్డ, పప్పుల కొరతతో కొందరు వ్యాపారులు సరుకులను నల్లబజారుకు తరలిస్తూ భారీగా నిల్వ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని ధరలు పెంచుతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాలుగా ధరలు గణనీయంగా పెరిగినా జిల్లాలో ఎక్కడా తనిఖీలు జరగడం లేదు. ధరలను అదుపు చేసేందుకు పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగాల్సి ఉన్నా కాలు కదపడం లేదు. గతంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు సదరుశాఖ ఆధ్వర్యంలో నిత్యావసరాలను తక్కువ ధరకు అందించారు. గిడ్డంగులపై దాడులు నిర్వహించి అక్రమ నిల్వలను వెలికి తీశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు చర్యలు కొనసాగించారు. సామాన్యులు అల్లాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడూ అలాగే వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా