ఉల్లిలేని హైదరాబాద్‌ బిర్యానీ 

29 Nov, 2019 08:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  పొగలు కక్కుతున్న చికెన్‌ బిర్యానీ పక్కన ఉల్లిగడ్డ, నిమ్మకాయ ఉంటేనే నాలుకకు రుచి, మజా వస్తుంది. ఉల్లిగడ్డ లేని బిర్యానీని ఊహించలేం కూడా. ఆహార ప్రియులు చికెన్, మటన్‌ బిర్యానీ తింటున్నప్పుడే పక్కన ఉల్లిగడ్డ నంజుకోకపోతే తిన్నట్టు ఉండదు. అయితే, నెల రోజులుగా ఉల్లి ధర ఆకాశాన్నంటుతుండడంతో నోటికి ఉల్లి ముక్క దొరకడం లేదు. 

ప్రస్తుతం ఉల్లిగడ్డ బహిరంగ మార్కెట్‌లో రూ.80 నుంచి రూ.100 ఉంది. దీంతో బిర్యానీ సరఫరా చేసే హోటళ్లలో ఉల్లిగడ్డకు ‘నో’ చెప్పారు. ఉల్లిపాయ లేకుండానే బిర్యానీ సరఫరా చేస్తున్నారు. కీరాతో పాటు నిమ్మకాయ ప్లేట్లో పెట్టి బిర్యానీ పక్కన పెడుతున్నారు. ఉల్లిగడ్డ ఏదంటే.. ‘ఆ ఒక్కటీ అడక్కు’ అంటున్నారు. బిర్యానీ ధరతో సమానంగా ఉల్లి ధర పోటీ పడుతోందని నిర్వాహకులు చెబుతున్నారు. పాతబస్తీ, కొత్తబస్తీ అనే తేడా లేకుండా అన్ని హోటళ్లలోనూ బిర్యానీకి ఉల్లిగడ్డ లేకుండానే అందిస్తున్నారు. మరోవైపు ఉల్లి ధర పెరగడంతో కర్రీ పాయింట్లలో ధరలు కూడా పెంచేశారు. మరికొన్ని చోట్ల బిర్యానీ రేట్లు కూడా పెరిగిపోయాయి.

మరిన్ని వార్తలు