వంటింట్లో ఉల్లి మంట

25 Nov, 2019 01:28 IST|Sakshi

మేలురకం ఉల్లి కిలో రూ.100..సాధారణ రకం రూ.60,70

కర్నూలు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తగ్గిన సరఫరా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉల్లి మళ్లీ ఘాటెక్కింది. పొరుగు రాష్ట్రాల నుంచి తగ్గిన దిగుమతులు, ధరలపై నియంత్రణ లేకపోవడంతో వంటింట్లో ఉల్లి మంటెక్కిస్తోంది. వారం రోజుల కిందటి వరకు మేలురకం కిలో ఉల్లి ధర రూ.50 పలుకగా అది ప్రస్తుతం ఏకంగా రూ.100కి చేరింది. సాధారణ రకం ఉల్లి ప్రస్తుతం కిలో రూ.60 నుంచి రూ.70 పలుకుతోంది. కర్నూలు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతులు పూర్తిగా తగ్గడం, మరో ఇరవై రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండనున్న నేపథ్యంలో ధరల కళ్లేనికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.

పొరుగు నుంచి తగ్గిన సరఫరా 
రాష్ట్రంలో ఉల్లి సాధారణ సాగు విస్తీర్ణం 13వేల హెక్టార్లు ఉండగా, ఈ ఏడాది అది 5వేల హెక్టార్లకే పరిమితమైంది.ఆలంపూర్, నారాయణఖేడ్, మహబూబ్‌నగర్‌ ప్రాంతాల్లోనూ ఈ ఏడాది పంట చాలా దెబ్బతింది. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మహారాష్ట్రలోని పూణే, ఔరంగాబాద్, కర్ణాటకలోని బగల్‌కోఠ్, కొల్హాపూర్‌లపై ఆధారపడాల్సి వస్తోంది.  ఈ ఏడాది జూన్‌లో క్వింటాలు ధర కనిష్టంగా రూ.310, గరిష్టంగా రూ.1,520 వరకూ ఉండగా అవి సెప్టెంబర్‌ నుంచి పెరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో గరిష్టంగా రూ.4,500, అక్టోబర్‌లో రూ.4,070కు చేరింది. ప్రస్తుతం క్వింటాల్‌ను రూ.4,650 వరకూ విక్రయిస్తున్నారు.

నియంత్రణ ఉందా? 
ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. విదేశాలకు ఉల్లి ఎగుమతులను తక్షణమే నిషేధించడంతోపాటు దేశంలోని వ్యాపారుల వద్ద ఉండే ఉల్లి నిల్వలపై పరిమితులను విధించింది. రిటైలర్లు 100 క్వింటాళ్లు, హోల్‌సేల్‌ వ్యాపారులు 500 క్వింటాళ్లకు మించి ఉల్లిని నిల్వ చేసుకోరాదని స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో ఈ పరిమితులపై నిఘా ఉన్నట్లు కనిపించడం లేదు. ఎక్కడా నిల్వలపై విజిలెన్స్‌ దాడులు జరిగిన దాఖలాలు లేవు.

మరిన్ని వార్తలు