' ఉల్లి 'ఉపశమనం

7 Feb, 2020 08:20 IST|Sakshi

తగ్గుముఖం పడుతున్న ధరలు  

కిలో రూ.24 నుంచి రూ.30

ముంచెత్తుతున్న కొత్త దిగుబడులు

సిటీకి భారీస్థాయిలో దిగుమతులు

వినియోగదారుల హర్షాతిరేకాలు

రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం

సాక్షి, సిటీబ్యూరో: మొన్నటిదాకా కన్నీరు పెట్టించింది. ధరతో దడ పుట్టించింది. వంటింట్లో వణికించింది. వినియోగదారులను బెంబేలెత్తించింది. మరి ఇప్పుడో.. ఉపశమనం కలిగిస్తోంది. నేలకు దిగిన ధరతో సామాన్యులకు చేరువగా మారింది. అదేమిటని ఆలోచిస్తున్నారా? అదేనండి.. ఉల్లి. మార్కెట్‌కు ఆశించినస్థాయి కంటే ఎక్కువ మొత్తంలో ఉల్లి దిగుమతులు పెరగడంతో ధరలు నేలకు దిగి వస్తున్నాయి. గురువారం మలక్‌పేట్‌ ఉల్లి హోల్‌సేల్‌ మార్కెట్‌లో క్వింటాల్‌ ధర రూ.2,900 నుంచి రూ.2,500 పలికింది. కొన్నాళ్ల క్రితం క్వింటాలుకు 16వేల నుంచి 18వేల రూపాయల వరకు పలికిన ఉల్లి.. అన్ని వర్గాల ప్రజలపై ప్రభావం చూపింది. సామాన్య ప్రజలు ఉల్లిని కొనాలంటేనే వణికిపోయారు. ప్రత్యేకించి హోటళ్లు, మెస్‌లలో వినియోగ దారులకు ఉల్లి లేని వంటకాలే వడ్డించాయి. సామాన్య ప్రజలు చాలా మంది ఉల్లికి ప్రత్యామ్నాయంగా క్యాబేజీని వాడారు. ఇలా ఉల్లిపేరు వింటేనే ఉలిక్కిపడిన వారంతా ప్రస్తుతం ధరలు తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. 

రూ.100కు 4 కిలోలు..
మలక్‌పేట్‌ ఉల్లి హోల్‌సేల్‌ మార్కెట్‌లకు మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు, ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచి దిగుమతులు భారీగా వస్తున్నాయి. హోల్‌సేల్‌ మార్కెట్‌లో మొదటి రకం ఉల్లి కిలో రూ.29 ఉండగా, రెండో రకం రూ.25 నుంచి 24 వరకు పలుకుతున్నట్లు ఉల్లి వ్యాపారులు చెబుతున్నారు. కొందరు వ్యాపారులు ఏకంగా వంద రూపాయలకు మూడు కిలోలు అమ్ముతున్నారు. మరికొందరు వ్యాపారులు వందకు నాలుగు కిలోలు కూడా అమ్ముతున్నారు. కొత్త పంట రావడంతో మార్కెట్‌కు ఉల్లి ముంచెత్తుతోంది. రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. 

నాఫెడ్‌ వద్ద మిగిలిన ఈజిప్టు ఉల్లి
మార్కెట్‌కు ఉల్లి దిగుమతులు తగ్గడంతో నెల రోజుల క్రితం కిలో ఉల్లి రూ.100 నుంచి రూ.120 వరకు పెరిగాయి. దీంతో మార్కెటింగ్‌ శాఖ నేషనల్‌ అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ద్వారా వంద మెట్రిక్‌ టన్నుల ఉల్లిని రూ.65కు కొని సబ్సిడీపై నగరంలోని రైతు బజార్లలో కిలో రూ.40కి విక్రయించారు. దీంతో మార్కెటింగ్‌ శాఖ తీసుకున్న ఉల్లి మొత్తం విక్రయించారు. నేషనల్‌ అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఈజిప్లు ఉల్లి ముంబై నుంచి నగరానికి వచ్చింది. ఉల్లి ధరలు తగ్గడంతో ఈజిప్టు నుంచి కొన్న ఉల్లి.. ప్రస్తుతం ధరలు తగ్గడంతో సనత్‌నగర్‌లోని గోదాంలో మిగిలిపోయింది. దీంతో నేషనల్‌ అగ్రికల్చర్‌ కో ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ అధికారులు ఉల్లి విక్రయించడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు  అధికారులు చెప్పారు. మార్కెటింగ్‌ శాఖ కొనుగోలు చేసిన ఉల్లి నెలరోజుల కిత్రమే మొత్తం అమ్ముడుపోయిందన్నారు.   

కొత్త పంటవస్తుండటంతోనే..
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లోకల్‌ కొత్త ఉల్లి పంట మార్కెట్‌కు ఎక్కువగానే దిగుమతయ్యే అవకాశం ఉంది. గత ఏడాది మహారాష్ట్ర ఉల్లిపై ఆధారపడి ఉండాల్సి వచ్చింది. ఈ ఏడాది ప్రారంభ నుంచే మెదక్, మహబూబ్‌నగర్, కర్నూల్‌ నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పెద్ద ఉల్లిగడ్డ కిలో రూ.29 వరకు ధర పలుకుతోంది. చిన్న గడ్డకు రూ.14 వరకు ఉంది. ఈ ఏడాది ఉల్లి ధరలు ఎక్కువగా పెరగవు. కొత్త పంట రావడంతో ధరలు అదుపులోకి వచ్చాయి.– వెంకటేశం, స్పెషల్‌ గ్రేడ్‌ సెక్రెటరీ, మలక్‌పేట్‌ మార్కెట్‌

మరిన్ని వార్తలు