ఉల్లి..ఫుల్లు

29 Jan, 2019 10:38 IST|Sakshi

నగర మార్కెట్లకు పోటెత్తిన దిగుమతులు

మహారాష్ట్ర, ఏపీ నుంచి క్యూ కట్టిన వాహనాలు

భారీగా పడిపొయిన హోల్‌సేల్‌ ధరలు  

కిలో రూ. 5 నుంచి రూ.8 వరకు...

డిమాండ్‌కు మించి ఉత్పత్తులు రావటమే కారణం  

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ప్రతిఏటా చలికాలంలో ఉల్లిగడ్డ ధరలు పెరుగుతాయి. కానీ ఈ ఏడాది కొత్త ఉల్లిపంట మార్కెట్లకు పోటెత్తడంతో హోల్‌సేల్‌ ధరలు భారీగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉల్లి ధరలు హోల్‌సేల్‌లో రూ.10 దాటడం లేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ఉల్లి దిగుమతి అవుతోంది. దీంతో ఇక్కడ డిమాండ్‌కు మించి సరుకు చేరింది. ఈ నేపథ్యంలోనే ధరలు భారీగా పడిపోయాయి. గత ఏడాది ఈ సీజన్‌లో ఉల్లి హోల్‌సేల్‌ ధరలు కిలో రూ.30 వరకు ఉండగా, ఈ ఏడాది రూ.10 లోపే ఉన్నట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. గత ఏడాది రిటైల్‌ మార్కెట్‌లోకిలో ఉల్లి ధర రూ.40 నుంచి రూ.50 వరకు ఉండగా, ఈ ఏడాది రూ.10 నుంచి 15 రూపాయల లోపే ఉన్నాయి. గత ఏడాది ఇదే సీజన్‌లో మలక్‌పేట్‌ మార్కెట్‌కు రోజుకు 34 లారీల ఉల్లి రాగా, ఈ ఏడాది 120 లారీల ఉల్లి వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఉల్లి పంట ఎక్కువ పండించడంతో అక్కడ ధరలు పడిపోయాయి. దీంతో నగరానికి దిగుమతులు పెరిగాయి.

స్థానిక దిగుమతులూ ఎక్కువే...
నగర ప్రజల ఉల్లి అవసరాలు దాదాపు 80 శాతం మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే ఉల్లితోనే పూర్తి అవుతాయి. తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్, మెదక్‌తో పాటు ఇతర జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు, కర్ణాటక నుంచి ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతోంది. దీంతో ధరలు పెరగడంలేదు. మున్ముందు ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి ఎక్కువగా మార్కెట్‌కు దిగుమతి అయితే దాన్ని నిలువ చేసుకోవడానికి స్టోరేజీ సౌకర్యం లేకపోవడం ఇబ్బందికరంగా మారింది.

మరిన్ని వార్తలు