కాసింత ఘాటు!

26 Oct, 2018 09:39 IST|Sakshi

స్వల్పంగా పెరిగిన ఉల్లి ధరలు  

మహారాష్ట్ర నుంచి తగ్గిన దిగుమతులు  

గతవారం కిలోకు రూ.12 నుంచి రూ.18 పలికిన ఉల్లి

ప్రస్తుతం రూ.15 నుంచి రూ.23కు చేరిన వైనం

ధరలు మరింత పెరిగే అవకాశంలేదు: మార్కెట్‌ వర్గాలు

సాక్షి, సిటీబ్యూరో: ఉల్లి ధరలు చాలావరకు తగ్గాయని నగరవాసులు ఆనందపడుతున్న తరుణంలో ఇటీవల అవి స్వల్పంగా పెరిగిన పరిస్థితి నెలకొంది. గతవారం దసరా పండగ, సెలవుల దృష్ట్యా మహారాష్ట్ర నుంచి నగరానికి నిత్యం రావాల్సిన ఉల్లి దిగుమతులు తగ్గడంతో ధరలు స్వల్ప ంగా పెరిగాయి. మహారాష్ట్ర నుంచి మార్కెట్‌కు ఉల్లి సరఫరా తగ్గడంతో గోదాముల్లో నిల్వ ఉన్న సరుకును హోల్‌సేల్‌ వ్యాపారులు కాస్త ధరలు పెంచి విక్రయించారు. గతవారం ఉల్లి కిలో రూ.12 నుంచి రూ. 18 వరకు ఉండగా.. ప్రస్తు తం రూ.15 నుంచి రూ. 23 వరకు పలుకుతోంది. నగరంలోని బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్, మలక్‌పేట్‌ మార్కెట్లకు కర్నూలు, కర్ణాటకతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి లోకల్‌ ఉల్లి దిగుమతులు పెరిగాయి. దీంతో ధరలు నియంత్రణలోకి వచ్చే అవకాశముంది. ఒకవేళ గత వారం మాదిరిగా మార్కెట్లకు ఉల్లి దిగుమతి తగ్గితే ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉండేదని, ప్రస్తుతం డిమాండ్‌కు సరిపడా ఉల్లి దిగుమతి అవుతోందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.  

దిగుమతులు తగ్గడం వల్లే..
సాధారణంగా నగర ఉల్లి అవసరాలకు దాదాపు 60 శాతం మహారాష్ట్ర నుంచే దిగుమతి అవుతాయి. పుణె, నాసిక్‌తో పాటు షోలాపూర్‌ తదితర జిల్లాల నుంచి నగర మార్కెట్‌కు రోజు దాదాపు 60 లారీల ఉల్లి దిగుమతి అవుతోంది. మిగతా 40 శాతం కర్ణాటక, కర్నూలుతో తెలంగాణ జిల్లాల నుంచి వస్తుంది. మహారాష్ట్ర రోజు దిగుమతి అయ్యే ఉల్లి అక్కడ సకాలంలో వర్షాలు కురవకపోవడం, రైతులు ఎక్కువశాతం ఏడాది ఉల్లి సాగు వేయకపోవడంతో ముంబైకి ఉల్లిని ఎగుమతి చేయడంతో నగరానికి దిగుమతులు తగ్గాయి. ఒక్క మలక్‌పేట్‌ ఉల్లి మార్కెట్‌కు రోజూ దాదాపు 20 వేల క్వింటాళ్ల దిగుమతి అవుతుంది. గతవారం కేవలం 5 వేల నుంచి 8 వేల క్వింటాళ్ల ఉల్లి దిగుమతులు జరిగాయి. దీంతో ధరలు హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ. 8 నుంచి రూ.10 ఉండగా.. గురువారం కిలో రూ.15 నుంచి రూ. 20కి పెరిగాయి.

ధరలు విపరీతంగా పెరుగుతాయని..
గతవారం ఉల్లి దిగుమతులు తగ్గడంతో కొంతమంది హోల్‌సేల్‌ వ్యాపారులు, రిటైల్‌ వ్యాపారులు ఉల్లి కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రయత్నించారు. కానీ మార్కెట్‌ అధికారులు మహారాష్ట్ర నుంచి దిగుమతులు తగ్గాయని గ్రహించి కర్ణాటక, కర్నూలు నుంచి ఉల్లి దిగుమతులు చేయాలని వ్యాపారులను సూచనలు జారీ చేశారు. దీంతో మంగళవారం నుంచి మలక్‌పేట్‌ మార్కెట్‌కు వంద లారీల ఉల్లి దిగుమతి అయ్యింది. గతేడాది కంటే ఈ ఏడాది ఉల్లి ఎక్కువగా దిగుమతి అవుతుంది. ఇక గురువారం అయితే రికార్డు స్థాయిలో 138 లారీల ఉల్లి దిగుమతులు జరిగాయి.  

నవంబర్‌ వరకూ నిలకడగానే..  
ఉల్లి దిగుమతులు అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ధరలు పెరుగుతాయని మార్కెట్‌లో వదంతులు  వినిపిస్తున్నాయి. ఉల్లి ధరలు అమాంతంగా పెరుగుతాయని  వ్యాపారులు చెబుతున్న విషయం అవాస్తవం. గతవారం ఉల్లి దిగుమతులు తగ్గడంతో ధరలు కిలోకు రూ.3 నుంచి రూ. 5 పెరిగాయి. నవంబర్‌ చివరి వరకు ఉల్లి ధరలు నిలకడగానే ఉంటాయి.  
– అనంతయ్య , స్పెషల్‌ గ్రేడ్‌ సెక్రటరీ మలక్‌పేట్‌ మార్కెట్‌

మరిన్ని వార్తలు