రవాణా సేవలు @ వన్‌ క్లిక్‌

1 Feb, 2020 09:11 IST|Sakshi

ఇక లెర్నింగ్‌ లైసెన్స్, డ్రైవింగ్‌ లైసెన్సుల పొడిగింపు, రెన్యువల్స్‌

డూప్లికేట్‌ సర్టిఫికెట్‌లు, లైసెన్సులు, ఆర్సీలు ఏవైనా...

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొంటే నేరుగా ఇంటికే పౌరసేవలు

వచ్చే వార్షిక ఏడాది నుంచి సేవలు మొదలు..

సాక్షి, సిటీబ్యూరో: డ్రైవింగ్‌లైసెన్స్‌ పోయిందా...ఆరు నెలల క్రితం తీసుకున్న లెర్నింగ్‌ లైసెన్స్‌ గడువు దాటిందా..నో ప్రాబ్లమ్‌. ఒక్కసారి ఆన్‌లైన్‌లో క్లిక్‌ చేయండి చాలు. నేరుగా ఇంటికే వచ్చేస్తాయి. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాయాల్సిన పనిలేదు. ఫొటోలు, డిజిటల్‌ సంతకాలం కోసం క్యూలైన్‌లో బారులు తీరాల్సిన అవసరం లేదు. క్షణాల్లో  కావలసిన సర్వీసులను పొందవచ్చు. వివిధ రకాల పౌరసేవలను మరింత పారదర్శకం చేసేందుకు  రవాణాశాఖ కసరత్తు చేపట్టింది. వాహనాల ప్రత్యేక నెంబర్‌లకు ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ సదుపాయం అందుబాటులోకి తెచ్చిన పద్ధతిలోనే మానవ ప్రమేయం లేని సర్వీసులను ఆన్‌లైన్‌ ద్వారా వినియోగదారులకు అందజేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నాటికి ఈ తరహా ఆన్‌లైన్‌ సదుపాయం అందుబాటులోకి రానుంది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లో దళారులు, మధ్యవర్తుల ప్రమేయం మరింత తగ్గుతుందని, వినియోగదారులకు  రవాణా శాఖ అందజేసే సర్వీసులు నేరుగా అందుతాయని అధికారులు భావిస్తున్నారు. 

పారదర్శకంగా పౌరసేవలు....
డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ పత్రాలు (ఆర్సీలు), చిరునామా మార్పు, యాజమాన్య బదిలీ, హైపతికేషన్‌ రద్దు, డూప్లికేట్‌ సర్టిఫికెట్లు వంటి 56 రకాల పౌరసేవల నమోదు కోసం  ఆన్‌లైన్‌లో స్లాట్‌ పద్ధతిని నాలుగేళ్ల క్రితమే ప్రవేశపెట్టారు. అలాగే ఫీజుల చెల్లింపును సైతం ఆన్‌లైన్, నెట్‌బ్యాంకింగ్, ఈ సేవా పరిధిలోకి తెచ్చారు. ఆన్‌లైన్‌లో స్లాట్‌ (సమయం, తేదీ) నమోదు చేసుకొని నిర్ణీత ఫీజులు చెల్లించినప్పటికీ  ప్రస్తుతం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లవలసిన ఉంటుంది. ఫొటో గుర్తింపు, డిజిటల్‌ సంతకాల నమోదు, ధృవపత్రాల నిర్ధారణ కోసం ప్రస్తుతం  వినియోగదారులు అధికారులను సంప్రదిస్తున్నారు. నిజానికి వీటిలో చాలా వరకు  వినియోగదారులు నేరుగా ఆర్టీఏకు వెళ్లవలసిన అవసరం లేకుండానే సర్వీసులను పొందవచ్చు. ఉదాహరణకు లెర్నింగ్‌ లైసెన్స్‌ సర్టికెట్‌ 6 నెలల వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆ లోపు అభ్యర్ధులు శాశ్వత డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోలేని వారు మరోసారి గడువు పొడిగించుకోవచ్చు.  అలాగే డ్రైవింగ్‌ లైసెన్సుల రెన్యూవల్స్, డూప్లికేట్‌ ఆర్సీలు, చిరునామా మార్పు వంటి సేవల్లోనూ వినియోగదారులు నేరుగా వెళ్లవలసిన అవసరం లేకుండా ఇంటికే పౌరసేవలను అందజేసేవిధంగా ఇప్పుడు ఉన్న ఆన్‌లైన్‌ వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తున్నారు. పర్మిట్‌లు, హైపతికేషన్‌ రద్దు, యాజమాన్య బదిలీలు వంటి అంశాల్లోనూ వీలైనంత వరకు వినియోగదారులు ప్రత్యక్షంగా కార్యాలయాలకు వెళ్లవలసిన అవసరం లేకుండా మార్పులు చేస్తున్నట్లు ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘మొదటి సారి లెర్నింగ్‌ లైసెన్స్, పర్మినెంట్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ల కోసం నేరుగా పరీక్షలకు హాజరు కావాలి. వాహనాల ఫిట్‌నెస్‌ పరీక్షలకు తప్పకుండా రావలసిందే. ఇలా వినియోగదారులు తప్పనిసరిగా రావలసిన సేవలను మినహాయించి ఇతర సేవలను ఆన్‌లైన్‌ ద్వారానే  అందజేస్తాం.వాటి కోసం ఆర్టీఏ ఆఫీసులకు రావలసిన అవసరం లేదు.’ అని పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లోనే ఫొటోలు, సంతకాల సేకరణ...
ఈ మేరకు వాహనదారులు ఆర్టీఏ వెబ్‌సైట్‌లో తమ దరఖాస్తులను, ధృవపత్రాలను అప్‌లోడ్‌ చేస్తారు. సెల్ఫీఫొటోతో పాటు, సంతకాలను కూడా ఆన్‌లైన్‌ దరఖాస్తుతో పాటు అప్‌లోడ్‌ చేసి, ఫీజులు చెల్లిస్తారు. అలా తమకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన తరువాత సంబంధిత అధికారులు సంతృప్తి చెందితే వినియోగదారుల మొబైల్‌ ఫోన్‌కు ఎస్సెమ్మెస్‌ అందుతుంది. డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీలు వంటివి పోస్టు ద్వారా ఇంటికి చేరుతాయి. లెర్నింగ్‌ లైసెన్స్‌ పొడిగింపు వాటిని మెయిల్‌ ద్వారా పొందవచ్చు. ‘ఆన్‌లైన్‌ పౌరసేవలను సులభంగా పొందేందుకు వీలైన పద్ధతులను అన్వేషిస్తున్నాం. ఒకటి, రెండు నెలల్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తాయి.’ అని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు