విదేశీ విద్య.. ఆన్‌లైన్‌ బాట!

19 Jun, 2020 10:55 IST|Sakshi

కోవిడ్‌ సీజన్‌లో నయా ట్రెండ్‌

గ్రేటర్‌లోని పలు విదేశీ వర్సిటీల విద్యార్థులకు ఈ–పాఠాలే..

విమానాల రాకపోకలు పూర్తిస్థాయిలో లేకపోవడమే కారణం

గ్రేటర్‌లో సుమారు 50 వేల మంది ఈ–క్లాసులకు హాజరు

వర్చువల్‌ తరగతులకు శ్రీకారం చుట్టిన పలు విదేశీ వర్సిటీలు

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని పలు విదేశీ వర్సిటీల విద్యార్థులు ఇప్పుడు ఈ–క్లాస్‌ బాట పట్టారు. కోవిడ్‌ కలకలం నేపథ్యంలో నగరానికి చేరుకున్న వేలాదిమంది విద్యార్థులు తిరిగి ఆయా దేశాలకు వెళ్లేందుకు పూర్తిస్థాయిలో విమాన రాకపోకలకు అనుమతించకపోవడంతో ఆన్‌లైన్‌లో సెమిస్టర్‌ పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి విద్యార్థులకు ఆస్ట్రేలియా, అమెరికా, యూకె దేశాల వర్సిటీలు కూడా ఈ–క్లాస్‌లు బోధించేందుకు అనుమతించడం విశేషం. ఈ వర్చువల్‌ క్లాసుల్లో విద్యార్థులతో ఆయా దేశాల వర్సిటీల అధ్యాపకులు ఫేస్‌–టు–ఫేస్‌ సంభాషించడం వంటి ఏర్పాట్లున్నాయి. డిగ్రీ, పీజీస్థాయి విద్యార్థులు తమ సెమిస్టర్‌ పాఠ్యాంశాలు మిస్‌కాకుండా ఈ బోధన ఏర్పాట్లు చేసినట్లు ఆయా వర్సిటీలు ప్రకటించాయి. గ్రేటర్‌ పరిధిలో సుమారు 50 వేలమంది వరకు ఇదే తరహాలో పాఠాలు వింటున్నట్లు సమాచారం. ఆయా దేశాల్లోని సుమారు 25కు పైగా వర్సిటీలు ఈ విధానంలో విద్యార్థులకు బోధన ఏర్పాట్లు చేయడం విశేషం.

భారత కాలమానం ప్రకారమే క్లాసులు..
భారత కాలమానం ప్రకారం పగటి వేళల్లోనే ఈ–క్లాసుల నిర్వహణకు ఆయా వర్సిటీలు శ్రీకారం చుట్టడం విశేషం. విద్యార్థులకు అనుకూలమైన సమయాల్లోనే వారికి పాఠాలు బోధిస్తేనే సౌకర్యవంతంగా ఉండటంతోపాటు విద్యార్థులు పాఠాలను ఆకలింపు చేసుకోవడం.. ఈ–లెర్నింగ్‌లో చురుగ్గా పాల్గొనడం చేస్తున్నట్లు ఆయా దేశాల వర్సిటీలు భావిస్తున్నాయట. ఈ తరగతుల బోధన ద్వారా విద్యార్థుల్లోనూ తాము నగరంలో చిక్కుకొని సెమిస్టర్‌ మిస్‌ అవుతున్నామనే భావన తొలగిందని.. ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్‌ స్టర్ట్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విద్య అభ్యసిస్తున్న విక్రమ్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఇక లండన్‌కు చెందిన రాయల్‌ హోలోవే యూనివర్సిటీ కూడా వర్చువల్‌ క్లాసుల ద్వారా పీజీ విద్యార్థులకు పాఠాలు బోధిస్తోంది. తద్వారా విద్యార్థులు తమ విద్యాసంవత్సరం కోల్పోకుండా చూడటంతోపాటు.. విద్యార్థులు తాము పాఠాలు వినలేకపోతున్నామనే ఒత్తిడి ఉండదని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆయా దేశాల్లోని ప్రైవేటు వర్సిటీలకు మన నగరానికి చెందిన విద్యార్థులు విద్యా రుణాలు తీసుకొని మరీ ఏటా కోట్ల రూపాయల మేర ఫీజులు చెల్లిస్తున్న విషయం విధితమే. ఇటు ఫీజులు కోల్పోకుండా.. అటు పాఠాలు మిస్‌కాకుండా చూసేందుకు ఈ ఏర్పాట్లు ఉపకరిస్తున్నాయంటున్నారు. అయితే మార్చి నెలలో నగరానికి చేరుకున్న పలువురు విద్యార్థులు తమ వీసా గడువు తీరిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

ఈ–క్లాసులతో ఉపయోగాలివే..  
ఈ–క్లాసులతోపాటు ఆన్‌లైన్‌లోనే వర్క్‌షాప్‌లు, జూమ్‌ మీటింగ్‌లతో తమ కెరీర్‌కు సంబంధించిన పలు అంశాలను విద్యార్థులు చర్చించుకుంటున్నారు.
ఆగస్టు నెలాఖరు వరకు ఫేస్‌–టు–ఫేస్‌ వర్చువల్‌ క్లాసులు కొనసాగించాలని అమెరికా, ఆస్ట్రేలియా, యూకె దేశాలకు చెందిన వర్సిటీలు నిర్ణయించడం విశేషం.
విద్యార్థులకు సెమిస్టర్‌ పాఠాలు మిస్‌ అవుతామనే ఆందోళన దూరమైంది.
ఈ–లెర్నింగ్‌ విధానం ద్వారా విద్యార్థులకు నోట్స్, స్టడీ మెటీరియల్‌ కూడాఅందజేస్తుండటం విశేషం.
విద్యార్థులు తాము చెల్లిస్తున్న ఫీజులకు అనుగుణంగా విద్యాబోధన జరుగుతుండటంతో తల్లిదండ్రుల్లోనూ ఆందోళన తొలిగింది.

మరిన్ని వార్తలు