ఆన్‌లైన్‌లో క్రిమినల్‌ జాబితా 

16 Sep, 2019 07:56 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: జ్యుడీషియరీలో ఈ–కోర్టు ఆన్‌లైన్‌ ద్వారా ఇప్పటికే రోజువారి కేసుల పట్టిక, కేసుల వివరాలు, తీర్పులు అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి పోలీసులు నమోదు చేసే కేసుల పూర్తి జాబితా కోర్టులకు అందుబాటులోకి తెస్తూ ఈ–పైలట్‌ ప్రాజెక్టును తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లాంఛనంగా ప్రారంభించనున్నారు. పోలీస్‌స్టేషన్‌లో వారు నమోదు చేసే క్రిమినల్‌ కేసులకు సంబంధించి మొదట ఎఫ్‌ఐఆర్, ఇతర పత్రాలు, చార్జిషీట్‌ను ఐసీజేఎస్‌ (ఇంటర్‌ ఆపరేబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టం) ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తారు. ఇలా ఎంటర్‌ చేసిన డాటా ఈ కోర్ట్సుకు రాగా సీఐఎస్‌( కేసు ఇన్ఫర్మేషన్‌ సిస్టం) నుంచి కోర్టువారు వారికి సంబంధించిన పోలీస్‌స్టేషన్‌ల వారీగా డౌన్‌లోడ్‌ చేసుకుంటారు.

ప్రస్తుతం ఈ పద్ధతిలో పోలీసు వారు ఎఫ్‌ఐఆర్, చార్జీషీట్‌ వివరాలు మాత్రమే పొందుపరిచే వీలు ఉంది. కాగా వాటి ధ్రువపత్రాలను కోర్టులో పాత పద్ధతిలో దాఖలు చేయాల్సి ఉంటుంది. అలా కోర్టులో దాఖలు చేసిన పలు కేసు పత్రాలను ఆన్‌లైన్‌లో పంపిన వివరాలతో పోల్చి చూసుకుని సరిగ్గా ఉంటే మొదట ఎఫ్‌ఆర్‌ఐ నెంబర్‌ అనంతరం సీసీ నెంబర్‌ వస్తుంది. దీంతో సమయం వృథా కాకుండా ఎప్పటికపుడు తెలుస్తుంది. దేశంలోనే మొదటిసారిగా ఐసీజేఎస్‌ ప్రాజెక్టు అమలుకు తెలంగాణను ఎంచుకోగా అందులో మొదటగా వరంగల్‌ జిల్లాను ఎంపిక చేసి 2018 డిసెంబర్‌లో ప్రారంభించారు. మొదట ఒక పోలీస్‌స్టేషన్‌ను ఎంచుకొని ప్రారంభించగా 9వ నెలలో 42 పోలీస్‌స్టేషన్లకు విస్తరించారు.

అక్కడ క్రిమినల్‌ కేసులకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ చార్జిషీట్‌లను మాత్రమే పొందుపర్చడం కోర్టులు వాటిని తీసుకోవడం మాత్రమే జరుగుతోంది. దేశంలో రెండో పైలట్‌ ప్రాజెక్టుగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను ఎంచుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఎఫ్‌ఐఆర్‌ చార్జిషీట్‌తోపాటు సమన్లు, వారంట్‌ నమోదు నుంచి అమలు విధానంను ఎన్‌ఎస్‌టీఈపీ (నేషనల్‌ సర్వీస్‌ అండ్‌ ట్రాకింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ ప్రాసెస్‌) ద్వారా ప్రవేశపెట్టనున్నారు. దీంతో సమన్లు, వారంట్లు జారీ నుంచి అమలు వరకు ఎప్పటికపుడు ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ ద్వారా సమాచారం తెలుసుకునే వీలు ఉంటుంది.

ఈ క్రిమినల్‌ కేసుల వివరాలు ఆన్‌లైన్‌ విధానం ప్రస్తుతం పోలీసులకు కోర్టులకు మాత్రమే పరిమితం కాకుండా త్వరలో వీటికి అనుసంధానమైన జైళ్లు, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్, ఫింగర్‌ ప్రింట్, వుమెన్‌అండ్‌ చైల్డ్‌ శాఖలకు విస్తరించనున్నారు. ఆన్‌లైన్‌లో కేసుల వివరాలు మాత్రమే పొందుపర్చనుండగా త్వరలో వాటికి సంబంధించిన పత్రాలను పొదుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని పోలీసు లు, కోర్టు వారు మాత్రమే ప్రస్తుతం చేసుకునే వీలు ఉండ గా కొద్దిరోజుల్లో అందరికీ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.  

నేడు ప్రాజెక్టు ప్రారంభం.. 
సోమవారం ఉదయం 9.45 గంటలకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ వీడియో కాన్షరెన్స్‌ ద్వారా ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. జిల్లా కోర్టులో జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి, ఐసీజేఎస్‌ మాస్టర్‌ ట్రైనర్‌ హుజూరాబాద్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రాధిక, సీపీ కమలాసన్‌రెడ్డి ఎంపిక చేసిన కరీంనగర్‌ త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో అందుబాటులో ఉండనున్నారు. ఐసీజేఎస్‌ గురించి మొదట మాస్టర్‌ ట్రైనర్‌ రాధిక వివరించనుండగా, చార్జిషీట్‌ను సీపీ కమలాసన్‌రెడ్డి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన తర్వాత దానిని చీఫ్‌ జస్టిస్‌ స్వీకరించి ప్రారంభించనున్నారు.  

మరిన్ని వార్తలు