‘స్మార్ట్’గా లబ్ధి

27 Feb, 2015 05:22 IST|Sakshi
‘స్మార్ట్’గా లబ్ధి

ఇక అన్ని పథకాలూ ఆన్‌లైన్‌లోనే
రేషన్‌కు రూపే కార్డు ద్వారా చెల్లింపులు
ఆధార్’తో సంక్షేమ పథకాల అనుసంధానం
పారదర్శకతే లక్ష్యంగా వినూత్న కార్యక్రమం

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. పారదర్శకతతోపాటు అర్హులకు మరింత వేగంగా లబ్ధి చేకూర్చేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ క్రమంలో అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ వివరాలను జతచేయనున్నారు. ఆసరా పథకం ద్వారా అందించే పింఛన్లు మొదలు.. గ్యాస్ సిలిండర్ రాయితీ, విద్యార్థుల ఉపకారవేతనాలు, ఉపాధి హామీ కూలీ డబ్బులు, రేషన్ సరుకులు తదితర అన్ని పథకాలకు ఈ పద్ధతినే అనుసరించాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రయోగాత్మకంగా రేషన్ పంపిణీలో దీన్ని అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు మొదలుపెట్టింది.
 
వివరాలన్నీ క్రోడీకరిస్తూ..
పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ప్రస్తుతం మ్యాన్యువల్ పద్ధతిలో ఫలాలు అందిస్తున్నా రు. కొత్త విధానంతో మ్యాన్యువల్ పద్ధతికి చెల్లుచీటీ ఇవ్వడంతోపాటు అన్నింటా ఆన్‌లైన్ పద్ధతిని అనుసరించనున్నారు. ఇందుకు లబ్ధిదారుల ఆధార్ సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేయనున్నారు. ఈ క్రమంలో బోగస్‌ను అరికట్టడంతోపాటు లబ్ధిదారుడికి త్వరితంగా ఫలా ల్ని అందించవచ్చ. ఈ నేపథ్యం లో జిల్లాలో సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిపొందుతున్నవారి ఆధార్ వివరాలను వేరువేరుగా సేకరిస్తున్నారు. జిల్లాలో ఈ ప్రక్రియ దాదాపు పూర్తి చేసినప్పటికీ.. పొరపాట్లకు తావులేకుండా మరోమారు పరిశీలించి ఖరారు చేస్తున్నారు.
 
‘రూపే’ రేషన్
ఆహార భద్రత పథకానికి సంబంధించి ప్రస్తుతం ఎఫ్‌ఎస్ (ఫుడ్ సెక్యూరిటీ) కార్డుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారు. లబ్ధిదారులు రేషన్ డీలరుకు డబ్బులు చెల్లించి సరుకులు తీసుకుంటున్నారు. ఈ పద్ధతిలో అక్రమాలు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితిని అధిగమించి అర్హులకు మాత్రమే రేషన్ సరుకులు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ఆన్‌లైన్ పద్ధతిలో సరుకులు తీసుకునే విధానాన్ని ప్రవేశపెట్టబోతోంది. లబ్ధిదారులు న గదును నేరుగా డీలరుకు చెల్లించకుండా బయోమెట్రిక్ పద్ధతిలో చెల్లింపులు చేసిన తర్వాతే సరుకులు అందించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ‘జన్‌ధన్‌యోజన’ ద్వారా మెజారిటీ ప్రజలు బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఈ క్రమంలో బ్యాంకులో నగదును సదరు డెబిట్ కార్డు(రూపే) ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో డీలరుకు చెల్లించి సరుకులు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రూపే కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరించడం, నగదును జమచేసేందుకు ప్రత్యేకంగా ఒక వ్యాపార ప్రతినిధిని ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తారు. ఈ పద్ధతి దేశంలోనే తొలిసారిగా జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు