‘క్యాష్‌లెస్‌’ సేవలు

16 Jul, 2019 11:11 IST|Sakshi

రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇక చెల్లింపులన్నీ ఆన్‌లైన్‌లోనే...

25 నుంచి అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో అమలు

టీ యాప్‌ ద్వారా రూ.2 వేల వరకు వెసులుబాటు

సాక్షి, సిటీబ్యూరో: స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ సంస్కరణల్లో భాగంగా అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పూర్తి స్థాయి నగదు రహిత లావాదేవీ చేపట్టాలని నిర్ణయించారు. ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికే స్థిరాస్తి రిజిస్ట్రేషన్లతో పాటు భూములకు సంబంధించిన ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌ (ఈసీ), సర్టిఫైడ్‌ కాపీ (సీసీ)ల జారీకి సైతం నగదు రహిత లావాదేవీలను ప్రారంభించిన రిజిస్ట్రేషన్‌ శాఖ తాజాగా రూ.1000 లోపు విలువైన సేవలు సైతం నగదు రహితంగా జరిపేందుకునిర్ణయం తీసుకుంది. దీంతో రిజిస్ట్రేషన్‌ శాఖలో నగదు రహిత లావాదేవీల ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక టీ యాప్‌ను రూపొందించి అనుసంధానం చేశారు. మొబైల్‌ ద్వారా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకొని  ఆన్‌లైన్‌ ద్వారా రూ.2 వేల వరకు విలువైన లావాదేవీలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దీంతో ఇప్పటివరకు చిన్నపాటి లావాదేవీలను నగదు తీసుకుని పూర్తి చేసే విధానానికి కూడా బ్రేక్‌ పడనుంది. ఇక, రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన ఏ పని అయినా పూర్తిగా ఆన్‌లైన్‌ ద్వారానే జరగనుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో  ప్రయోగాత్మకంగా నగదు రహిత సేవలు అందిస్తున్నారు.

25 నుంచి పూర్తి స్థాయి అమలు
రాష్ట్ర వ్యాప్తంగా గల సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఈ నెల 25 నుంచి పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీల ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారం భం కానుంది. హిందు మ్యారేజ్, సొసైటీ రిజిస్ట్రేషన్, అప్‌డేట్, ఈసీ, సీసీ తదితర చిన్నచిన్న సేవలు సైతం నగదు రహిత విధానంలో అందనున్నాయి. రిజిస్ట్రేషన్‌ శాఖకు సంబంధించిన టీయాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని వాటి ద్వారా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియలకు చెల్లింపులు జరుపవచ్చు. మొబైల్‌ యాప్‌ ద్వారా చెల్లింపులు జరిపిన నగదు రహిత సంబంధించిన సేవలను 30 రోజుల లోపు వినియోగించుకోవచ్చు. గడువు దాటితే నగదు రహిత చెల్లింపులు మురిగిపోయినట్లేని సంబంధిత శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

మరిన్ని వార్తలు