ఇక రిజిస్ట్రేషన్లకు ఆన్‌లైన్‌ స్లాట్‌! 

1 Nov, 2018 01:48 IST|Sakshi

     నేటి నుంచి అందుబాటులోకి.. 

     రిజిస్ట్రేషన్‌ రోజే డాక్యుమెంట్లు 

సాక్షి, హైదరాబాద్‌: ఇకపై స్థిరాస్తి రిజిస్ట్రేషన్ల కోసం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద గంటల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు. వెబ్‌పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో స్లాట్‌ (పలానా రోజు,సమయం)ను బుక్‌ చేసుకునే సదుపాయం అందుబా టులోకి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో నేటి నుంచి ఆన్‌లైన్‌ స్లాట్‌ విధానం అమలుకు స్టాంపులు అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ సిద్ధమైంది. స్థిరాస్తి రిజిస్ట్రేషన్లలో స్లాట్‌ విధానానికి తొలి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాతే స్లాట్‌ బుక్‌ చేసుకోని వారి దస్తావేజులను పరిశీలించి నమోదు చేయనున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారి దస్తావేజుల నమోదు రోజూ ఉదయం 10.30  నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పూర్తిచేస్తారు. రిజిస్ట్రేషన్‌ తర్వాత స్కాన్‌ అయిన డాక్యుమెంట్లను ఆ రోజే సంబంధిత దస్తావేజుదారుకు అందజేస్తారు. ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రతిరోజు 18 మందికి మాత్రమే స్లాట్‌ బుక్‌ చేసుకొని స్థిరాస్తిని రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.  

స్లాట్‌ బుకింగ్‌ ఇలా..:స్థిరాస్తి రిజిస్ట్రేషన్‌ కోసం ముందుగా రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. ఆన్‌లైన్‌ ప్రీ–రిజి స్ట్రేషన్‌ డాటా ఎంట్రీకి అవకాశం ఇవ్వడంతో దస్తావేజుదారులు ఇంటి వద్దే ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్‌ను తయారుచేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్‌ చలానా నమూనాలతో పాటు ఫీజు రుసుం వివరాలు రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌లో ఉంటాయి. పబ్లిక్‌ డాటా ఎంట్రీ పూర్తిచేసి ఎలక్ట్రానిక్‌ చలానా జత పర్చాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్‌ ఎంట్రీ పూర్తి కాగానే పది అంకెల నంబర్‌ వస్తుంది. స్లాట్‌ సమయానికి సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు వెళ్లి ఈ పది అంకెల నంబర్‌ను సబ్‌ రిజిస్ట్రార్‌కు ఇస్తే వెంటనే దానిని ఆన్‌లైన్‌లో పరిశీలించి తప్పులుంటే సరిచేస్తారు. అనంతరం రిజిస్ట్రేషన్‌ నమోదు ప్రక్రియను పూర్తి చేసి సాయంత్రంలోగా స్కాన్‌ చేసిన దస్తావేజులను ఇస్తారు. 

రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో డాటా ఎంట్రీకి స్వస్తి... 
స్లాట్‌ బుకింగ్‌ ఆన్‌లైన్‌ విధానం వల్ల సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో డాటా ఎంట్రీకు స్వస్తి పలకనున్నారు. ఆన్‌లైన్‌లోనే పూర్తి ప్రక్రియ కొనసాగనుంది. ఇప్పటివరకు స్థిరాస్తి కొనుగోలుదారులు డాక్యుమెంట్‌ రైటర్‌ వద్ద దస్తావేజులు తయారు చేసుకొని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులో ఆఫ్‌లైన్‌లో సమర్పించేవారు. ఆ తర్వాత సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అధికారులు డాటా ఎంట్రీ చేసి రిజిస్ట్రేషన్‌ నమోదు పూర్తి చేసేవారు. ఇక మీదట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డాటా ఎంట్రీ ఉండదు.

మరిన్ని వార్తలు