ఆన్‌లైన్‌లో సర్వే సమాచారం

20 Aug, 2014 00:37 IST|Sakshi
ఆన్‌లైన్‌లో సర్వే సమాచారం

- అర్హులకే సంక్షేమ ఫలాలు
- ప్రతిపక్షాల తీరు దారుణం
- మంత్రి హరీష్‌రావు
 సిద్దిపేట టౌన్: తెలంగాణవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే సమాచారాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తామని నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్లడించారు. సిద్దిపేటలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎంపీడీఓ, తహశీల్దార్, అన్ని ప్రభుత్వ శాఖల ఆఫీసులు, మీసేవ కేంద్రాలు, ఇంజనీరింగ్ కళాశాలలను సర్వే సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి వినియోగిస్తామన్నారు. ఎంత వేగంగా ఈ పని పూర్తిచేస్తే అంతే వేగంగా అర్హులకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. దళారీ వ్యవస్థను రూపుమాపి నిజమైన పేదలకు ఇంటి స్థలం, ఇళ్లు, పింఛన్ తది తర పథకాలను అందించడం సర్వే లక్ష్యమన్నారు.



దీనిని ప్రతిపక్షాలు స్వాగతించాల్సింది పోయి కోర్టులకు వెళ్లి, దుష్ర్పచారం చేసి అడ్డుకోవడానికి విఫలయత్నం చేశాయని ఆరోపించారు. ప్రతిపక్షాల తీరు సరైనది కాదన్నారు. సంక్షేమ ఫలాలను అడ్డుకునే పార్టీల అడ్రస్‌లను ప్రజలు గల్లంతు చేస్తారని హెచ్చరించారు. సర్కార్ సంక్షేమ పథకాలతో తమకు నూకలు చెల్లుతాయనే భయంతో కొన్ని పార్టీలు దుశ్చర్యలకు పాల్పడుతున్నాయని దుయ్యబట్టారు. సర్వేలో బ్యాంక్ ఖాతా నంబర్లు అడిగితే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సిగ్గుచేటన్నారు. నేరుగా సంక్షేమ ఫలాలు లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరాలన్నదే తమ ఉద్దేశమన్నారు. 19 లక్షల మంది రైతులకు 465కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా వారి ఖాతాల్లోకి చేరడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్షాలు ఇష్టారీతిగా మాట్లాడడం సరైంది కాదన్నారు.

దేశంలోని వివిధ రాష్ట్రాలు ఈ సర్వేను అమలు చేయడానికి ఆలోచిస్తున్నాయన్నారు. తాటాకు చప్పుళ్లకు తాము భయపడమని, మాటలకు పరిమితం కామని చేతలతోనే తమ పనులను చూపిస్తామని స్పష్టం చేశారు. సర్వేకు ప్రజలు స్వచ్ఛందంగా స్వాగతం పలకడం, పండుగలా మార్చడం తమ ప్రభుత్వంపై వారికున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. టీఏ, డీఏలు తీసుకోకుండా ఉద్యోగులు సర్వే చేయడం అభినందనీయమన్నారు.

దళితులకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తుంటే ఆనందబాష్పాలు రాల్చడం తమ పాలన పట్ల ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఇక్కడి సంక్షేమ పథకాలు బాగుంటే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో మంచి పథకాలను అమలు చేస్తే తాము కూడా వాటిని అధ్యయనం చేసి అమలు చేస్తామన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు