రుణాలే రైతుకు వెన్నెముక

20 Aug, 2018 03:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రైతుకు రుణాలే ఆధారంగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో దాదాపు 79.5 శాతం కుటుంబాలు అప్పులు తీసుకుంటున్నాయని నాబార్డు నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా సగటున వ్యవసాయ కుటుంబాలు తీసుకుంటున్న రుణం రూ.1.04లక్షలు కాగా, వ్యవసాయేతర కుటుంబాలు తీసుకునేది రూ.76,731గా ఉంది. ఈ లెక్కన వ్యవసాయ కుటుంబాల్లో 52.5శాతం మంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణం తీసుకుంటున్నారు. వ్యవసాయ కుటుంబాలు సాగు ద్వారా కంటే కూలీ పనులకు వెళ్లి అధికంగా ఆదాయాన్ని పొందుతున్నాయని సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 2015 జూలై 1నుంచి 2016 జూన్‌ 30వరకు జాతీయ గ్రామీణ ఆర్థిక సర్వే (ఆలిండియా రూరల్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌) సర్వే నిర్వహించింది.

మొత్తం 29 రాష్ట్రాలలోని 245 జిల్లాలో 2,016 గ్రామాలలోని 40,327 కుటుంబాలను సర్వే చేశారు. వ్యవసాయ కుటుంబంలో సాగు ద్వారా నెలకు రూ.3,140 ఆదాయం వస్తే, వేతన కూలీకి రూ.3,025, ఉపాధి కూలీ రూ.1,444 వస్తోంది. అంటే మొత్తం రూ.4,469గా ఉంది. ఖర్చుల్లో అధికంగా ఆహార అవసరాలకు 51 శాతం, ఇతర అవసరాలకు 49 శాతం వినియోగిస్తున్నారు. అలాగే వ్యవసాయ కుటుంబాలు పెద్ద యంత్రాలను అధికంగా కలిగిలేరని పేర్కొంది. కేవలం 5 శాతం మంది రైతులు మాత్రమే దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు కలిగి ఉన్నారని, పవర్‌ టిల్లర్స్‌ను అధికంగా వినియోగిస్తున్నారని తెలిపింది. రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం 1.1 హెక్టార్లు కాగా, కౌలు తీసుకున్న రైతులు 10 శాతం ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. కరువు కాటకాల్లో పాడి పశువుల పోషణ వ్యవసాయ కుటుంబాలను ఆదుకుంటోందని సర్వేలో వెల్లడైంది.
  79.5శాతం రైతు కుటుంబాలకు రుణాలే ఆధారం
  నాబార్డ్‌ అధ్యయనంలో వెల్లడి

మరిన్ని వార్తలు