మంత్రివర్గంలో మహిళలకు చోటేదీ!

18 Dec, 2014 00:24 IST|Sakshi
మంత్రివర్గంలో మహిళలకు చోటేదీ!

* ప్రభుత్వానికి వారి సంక్షేమం పట్టదా!
* డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి
నర్సాపూర్ రూరల్: మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం  కించపరుస్తోందని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆరోపించారు. బుధవారం నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్క మహిళా ఎమ్మెల్యేకు మంత్రిపదవి ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు.  మంగళవారం నాటి విస్తరణలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తారని ఆశించామన్నారు.

మహిళా శిశుసంక్షేమశాఖను మహిళలకు కేటాయించకుండా మగవారికి ఇవ్వడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన అభయహస్తం, బంగారుతల్లి, జీరోవడ్డీ రుణాలు తదితర పథకాలను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చారని ఆమె దుయ్యబట్టారు.
 
నిరాశ మిగిల్చిన ఆసరా
గతంలో పెన్షన్లు తీసుకున్న అనేకమంది ప్రస్తుతం పెన్షన్లు కోల్పోయారని సునీతారెడ్డి పేర్కొన్నారు. 50 శాతం వైకల్యం పేరుతో వికలాంగులకు, మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ పేరుతో  మెలికపెట్టి వితంతువుల పెన్షన్లు తొలగించారన్నారు. అలాగే వైఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభయహస్తం పెన్షన్లు నిలిపివేశారన్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2లక్షల 70 వేల అభయహస్తం పెన్షన్లు నిలిపివేసిందన్నారు.
 
గతంలోనే ప్రతిపాదనలు చేశాం
గతంలోనే ఘణపురం  ఆయకట్టు ఎత్తుపెంచేందుకు ప్రతిపాదనలు తయారు చేశామని సునీతారెడ్డి పేర్కొన్నారు. కేవలం 0.5 పెంచితే సరిపోతుందని అప్పట్లో నిపుణులు చెప్పారన్నారు. ప్రస్తుతం 1.5 పెంచబోతున్నట్లు ప్రకటించడం విచారకరమన్నారు. అప్పుడు సీఈఓ గా ఉన్న మురళీధర్ ఇప్పుడు కూడా ఉన్నారన్నారు. 1.5 పెంచితే అనేక గ్రామాలకు ముప్పు ఉంటుందన్నారు. సమావేశంలో ఎంపీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, ఎంపీపీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌గుప్తా, స్థానిక సర్పంచ్ వెంకటరమణరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యంగౌడ్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా