‘ఆమె’ స్థానం అంతంతే !

17 Dec, 2018 08:45 IST|Sakshi

ఉమ్మడి జిల్లా నుంచి శాసనసభకు ఇప్పటివరకు

నలుగురు మహిళలే.. కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు

సీపీఐ నుంచి ఒకరు విజయం

ఇందులో  ముగ్గురు గిరిజనులే

సాక్షి, కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మహిళా శాసనసభ్యుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటివరకు ముగ్గురు మహిళలకు మాత్రమే అసెంబ్లీలో తమ వాణి వినిపించే అవకాశం దక్కింది. తాజాగా నాలుగో మహిళగా ఇల్లెందు నుంచి ఎన్నికైన బాణోత్‌ హరిప్రియ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుత శాసనసభలో ఉమ్మడి జిల్లా నుంచి ఆమె ఒక్కరే మహిళా ఎమ్మెల్యే కావడం గమనార్హం. 1972లో మధిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరుపున దుగ్గినేని వెంకట్రావమ్మ ఎమ్మెల్యేగా ఎన్నికై శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం కాలంలో వివిధ పార్టీల నుంచి చాలా స్వల్ప సంఖ్యలో మహిళా అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ ఎన్నిక కాలేదు.

సుదీర్ఘ కాలం తర్వాత 2009లో ఒకేసారి ఇద్దరు మహిళలు శాసనసభకు ఎన్నికయ్యారు. వైరా నియోజకవర్గంగా ఆవిర్భవించిన తొలిసారే సీపీఐ తరఫున బాణోత్‌ చంద్రావతి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే ఎన్నికల్లో  భద్రాచలం నుంచి కాంగ్రెస్‌ పార్టీ పక్షాన సత్యవతి గెలుపొందారు. సీపీఎంకు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చరిష్మాతో కుంజా సత్యవతి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మహిళలెవరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాలేదు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి బరిలో నిలిచిన మహిళా అభ్యర్థుల సంఖ్య కొంత పెరిగినప్పటికీ.. ఇల్లెందు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున బాణోత్‌ హరిప్రియ ఒక్కరే విజయం సాధించారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు నలుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా, అందులో ముగ్గురు గిరిజనులే కావడం విశేషం. వీరిలో సత్యవతి ఆదివాసీ వర్గానికి చెందిన మహిళ కాగా, చంద్రావతి, హరిప్రియ బంజారా తెగకు చెందిన వారు.
   
ఎనిమిది మందిలో ఒకరికే చాన్స్‌..  
ప్రస్తుత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ప్రధాన పార్టీల తరఫున ఎనిమిదిమంది మహిళలు బరి లో నిలిచారు. వీరిలో ఇల్లెందు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున బరిలో నిలిచిన ఒక్క హరి ప్రియ మాత్రమే గెలుపొందారు. పాలేరు నియోజకవర్గంలో సీపీఎం నుంచి బత్తుల హైమావతి, వైరా నియోజకవర్గం నుంచి ప్రజాకూటమి(సీపీఐ) అభ్యర్థిగా బాణోత్‌ విజయాబాయి, బీజేపీ అభ్యర్థిగా రేష్మారాథోడ్, ఇల్లెందు నుంచి బీజేపీ అభ్యర్థిగా మోకాళ్ల నాగస్రవంతి, భద్రాచలం బీజేపీ అభ్యర్థిగా కుంజా సత్యవతి, ఖమ్మం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉప్పల శారద, సత్తుపల్లి నుంచి బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థిగా మాచర్ల భారతి పోటీ పడినప్పటికీ.. వారు విజయం సాధించలేకపోయారు. ఈ ఎనిమిది మందిలో నలుగురు బీజేపీకి చెందిన వారే కావడం గమనార్హం.

టీఆర్‌ఎస్‌ నుంచి మహిళలే లేరు..  
అధికార టీఆర్‌ఎస్‌ నాలుగు నియోజకవర్గాల నుంచి సిట్టింగ్‌లకు టికెట్లు కేటాయించడంతో పాటు భద్రాచలం స్థానాన్ని సైతం తెల్లం వెంకట్రావుకు కేటాయించింది. దీంతో ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. పినపాక నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు సతీమణి పాయం ప్రమీల పేరు వినిపించినప్పటికీ, చివరకు వెంకటేశ్వర్లునే టికెట్‌ వరించింది.
 
గతంలో ఇలా..  

గతంలో జరిగిన వివిధ ఎన్నికల్లో పాలేరు నుంచి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, కొత్తగూడెం నుంచి అయాచితం నాగవాణి, భద్రాచలం నుంచి కొమురం ఫణీశ్వరమ్మ టీడీపీ తరఫున పోటీచేసినప్పటికీ ఓటమి చెందారు. అలాగే ఇల్లెందు నుంచి టీడీపీ తరఫున కల్పనాబాయి ఓటమి పాలయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసిన బాణోత్‌ హరిప్రియ సైతం గెలుపు ముంగిట వరకు వచ్చి ఓటమి చెందారు. ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆమె విజయం సాధించారు. భద్రాచలం నుంచి 2009లో సత్యవతి గెలుపొందగా,   ఆ ఎన్నికల్లో ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం నుంచి పోటీ చేసిన మరో నలుగురు మహిళా అభ్యర్థులు ఓటమి చెందారు.

మరిన్ని వార్తలు