టెండర్లకు మిగిలింది ఒక్క రోజే..  

16 Oct, 2019 11:12 IST|Sakshi

సాక్షి, మెదక్ : మద్యం షాపుల దరఖాస్తు గడువు బుధవారంతో ముగియనుంది. జిల్లాలో ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా.. సోమవారం వరకు నత్తనడకన సాగింది. అయితే.. మంగళవారం ఒక్కరోజే 79 దరఖాస్తులు వచ్చాయి. చివరి రోజు బుధవారం ఆశావహులు పోటెత్తే అవకాశం ఉండటంతో మెదక్‌లోని ఎక్సైజ్ అండ్‌ ప్రొహిబిషన్‌ కార్యాలయంలో దీనికనుగుణంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 2017- 19లో జిల్లా పరిధిలోని మద్యం దుకాణాలు రూ.40 లక్షలు, రూ.45 లక్షల శ్లాబ్‌ పరిధిలోకి వచ్చేవి.

ప్రస్తుతం రూ.50 లక్షలు, రూ.55 లక్షల పరిధిలో ఉన్నాయి. గత పర్యాయంలో జిల్లాలో 37 మద్యం షాపులకు 301 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దానికి దరఖాస్తు ఫీజు రూ.లక్ష కాగా.. సర్కారుకు సుమారు రూ.3 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఆదాయం రాబట్టుకునేందుకు ప్రభుత్వం ఈ సారి దరఖాస్తు ఫీజును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచింది. అదేవిధంగా చిన్నశంకరంపేటలో ఒక మద్యం షాపును అదనంగా కేటాయింది. ఈ లెక్కన జిల్లాలో 38 మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టారు. మంగళవారం వరకు మొత్తం 156 దరఖాస్తులు వచ్చాయి. దీన్ని బట్టి ఇప్పటివరకు సుమారు రూ.3.12 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు తెలుస్తోంది. దీంతో దరఖాస్తు గడువు ముగిసే ఒక్క రోజుకు ముందే గత ఏడాది టార్గెట్‌ను చేరినట్లయింది.  

పునరావృతం 
మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి గత, ప్రస్తుత పర్యాయాలు గడువు ఏడు రోజులుగా నిర్ధారించారు. 2017 – 19లో తొలి ఐదు రోజుల్లో కేవలం 17 వచ్చాయి. ఆరో రోజు 59, చివరి రోజు భారీగా 225 మంది దరఖాస్తు చేశారు. 2019 – 21కి సంబంధించి సైతం ఇదే పునరావృతమవుతోంది. ఐదో రోజు వరకు 77 దరఖాస్తులు రాగా.. ఆరో రోజు మంగళవారం అయినప్పటికీ నిర్దేశిత సమయం ముగిసే వరకు 79 వచ్చాయి. ఈ లెక్కన చివరి రోజున 240కి మించి దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.  

18న లాటరీ 
దరఖాస్తుల స్వీకరణ అనంతరం ఈ నెల 18న కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయించనున్నారు. ఒక్కో షాపునకు రెండు, అంతకంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ తప్పనిసరి. ఒకటే వచ్చిన పక్షంలో సదరు దరఖాస్తుదారుడికి షాపును కేటాయించనున్నారు.  

మరిన్ని వార్తలు