ఒకే ఒక్కడు!

2 Jul, 2018 09:57 IST|Sakshi
జైపాల్‌రెడ్డి  

వైద్యశాఖలో అన్ని విభాగాలకు ఆయనే దిక్కు

రెండేళ్లుగా ఇన్‌చార్జితో నెట్టుకొస్తున్న వైనం 

జగిత్యాల : జిల్లాలో వైద్యశాఖలో ఒకే అధికారి పలు శాఖలు నిర్వహించడం  ఇబ్బందికరంగా మారింది. జగిత్యాల జిల్లా కేంద్రంగా అవతరించి రెండేళ్లు అయింది. అయినా వైద్య శాఖలో పూర్తిస్థాయి అధికారుల నియామకం జరుగడంలేదు. దీంతో ఉన్న అధికారులకే పలు శాఖల అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నారు. దీంతో పలు శాఖల్లో పూర్తిస్థాయిలో అధికారులు కేటాయించలేదు. వైద్యశాఖలో డెప్యూటీ డీఎంహెచ్‌వోగా జైపాల్‌రెడ్డి నియమితులయ్యారు. డీఎంహెచ్‌వో సుగంధిని ఇటీవల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో జైపాల్‌రెడ్డికి అదనంగా ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా బాధ్యతలు అప్పగించారు.

డెప్యూటీ డీఎంహెచ్‌వోతోపాటు, ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో, రాష్ట్ర బాలస్వస్తీయ కార్యక్రమం(ఆర్‌బీఎస్‌కే) జిల్లా కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైంది. జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కూళ్లకు వెళ్లి చికిత్స అందిస్తుంటారు. 10 వాహనాలు, 10 మంది ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారు. ఈ శాఖకు సైతం ఆయన జిల్లా కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే కేసీఆర్‌ కిట్‌ పథకానికి జిల్లాలో ఎలా అమలు జరుగుతుందనే విషయం తెలుసుకునేందుకు అధికారులను నియమించారు. కేసీఆర్‌ కిట్‌కు సైతం జిల్లా ఇన్‌చార్జిగా జైపాల్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైద్యశాఖలో నాలుగు ప్రధానమైన ఈ శాఖలను జైపాల్‌రెడ్డి ఇన్‌చార్జి. నాలుగు శాఖలకు ఒకరే ఇన్‌చార్జి కావడంతో ఆయన ఒత్తిడికి లోనవుతున్నారు. 

మరిన్ని వార్తలు