ఏకైక లెదర్‌ ఇనిస్టిట్యూట్‌..100 శాతం జాబ్‌ గ్యారెంటీ

22 Feb, 2020 10:04 IST|Sakshi

రాష్ట్రంలో ఏకైక లెదర్‌ ఇనిస్టిట్యూట్‌

100 శాతం జాబ్‌ గ్యారెంటీ కొత్త కోర్సులు సున్నా

ఇదీ రాయదుర్గం జీఐఎల్‌టీ దుస్థితి

రాయదుర్గం: అది రాష్ట్రంలో ఉన్న ఏకైక లెదర్‌ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్‌  (పాలిటెక్నిక్‌). ఇక్కడ చదువుకున్న వారికి 100 శాతం ఉద్యోగాలు గ్యారెంటీ. గత నాలుగు దశాబ్దాలుగా  ఇక్కడ చదివిన వారు చెన్నయ్, నోయిడా, లక్నో తదితర నగరాల్లోనే కాకుండా సౌత్‌ఆఫ్రికా, ఇంగ్లాండ్, యూఏఈ, సూడాన్‌ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరు మినీ లెదర్‌ ఇండస్ట్రీలను ఏర్పాటు చేసి ఎందరో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. అయితే మారుతున్న పరిస్థితులు, టెక్నాలజీకి అనుగుణంగా కొత్త కోర్సులు లేక నాలుగు దశాబ్దాలుగుగా రెండే కోర్సులతో నడుస్తోంది. రాయదుర్గంలోని గవర్నమెంట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లెదర్‌ టెక్నాలజీ(జీఐఎల్‌టీ). 1980లో ఏర్పాటైన ఈ ఇనిస్టిట్యూట్‌లో 10 తరగతి పాసై పాలిసెట్‌ అర్హత సాధించిన వారికి కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లు కేటాయిస్తారు.

1980 నుంచి రెండే కోర్సులు...
రాయదుర్గంలోని లిడ్‌క్యాప్‌ ప్రాంగంలో అప్పటి ప్రభుత్వం ఐదెకరాల స్థలాన్ని కేటాయించడంతో 1980లో రెండు కోర్సులతో జీఐఎల్‌టీని  ఏర్పాటు చేశారు. అందులో ఒకటి డిప్లొమో ఇన్‌ లెదర్‌ టెక్నాలజీ కాగా, మరొకటి డిప్లొమో ఇన్‌ ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, ఒక్కో కోర్సులో 60 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. అయితే మొదట్లో ఆయా కోర్సుల్లో సగం సీట్లు కూడా భర్తీ అయ్యేవి కావు. అయితే ఇటీవలి కాలంలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో ఆయా కోర్సుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

కొత్త కోర్సులు ప్రవేశపెడితేనే...
రాష్ట్రంలోని ఏకైక లెదర్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ గా కొనసాగుతున్న జీఐఎల్‌టీలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఫుట్‌వేర్‌ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో అర్హులైన టెక్నికల్‌ విద్యార్థుల అవసరం ఎంతో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత కోర్సులే కాకుండా డిప్లోమో ఇన్‌ ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్, ఫ్యాషన్‌ డిజైన్, లెదర్‌గూడ్స్‌ అండ్‌ యాక్సెసరీస్‌ డిజైన్, రిటైల్‌ అండ్‌ ఫ్యాషన్‌ మెర్సన్‌డైజ్‌ తదితర కోర్సులను కూడా ప్రవేశపెడితే నేటి తరం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

మౌలిక వసతుల కల్పనకు కృషి
ప్రస్తుతం జిఎల్‌ఐటీలో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాం. కంప్యూటర్‌ ల్యాబ్‌ను ఆధునీకరిస్తున్నాం. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వసతి గృహాన్ని త్వరలో ప్రారంభిస్తాం. అనంతరం ప్రస్తుత పరిస్థితులు,  సాంకేతిక మార్పులకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రారంభించాలనే ఆలోచిస్తున్నాం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో స్వల్పకాలిక కోర్సులను ప్రవేశపెట్టి శిక్షణ ఇస్తాం. గతంలో కంటే ఆదర్శ, ఉపాధి కల్పించే శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం.– ఎక్బాల్‌ హుస్సేన్,ప్రిన్సిపల్‌ జీఎల్‌ఐటీ రాయదుర్గం

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా