చిన్నారుల మోములో చిరునవ్వు

18 Apr, 2018 11:27 IST|Sakshi

ఆపరేషన్‌ ‘స్మైల్‌’, ‘ముస్కాన్‌’ పేరిట విస్తృత తనిఖీలు

బాలకార్మికులకు విముక్తి జి    ఫలితాన్నిస్తున్న అధికారుల కృషి

రెండు కార్యక్రమాల ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 212 మందికి విముక్తి

పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని వ్యాపారులకు హెచ్చరికలు

బాలల చట్టాలపై ప్రచార రథం ద్వారా అవగాహన

నారాయణఖేడ్‌: బాలలు పనిలో కాదు బడిలో ఉండాలంటూ బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లా బాలల సంరక్షణ శాఖ చేస్తున్న కృషి ఫలిస్తోంది. గతంలో మాదిరిగా ప్రచారానికే పరిమితం కాకుండా ఆపరేషన్‌ ముస్కాన్, ఆపరేషన్‌ స్మైల్‌ పేరిట తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాలకార్మికులకు విముక్తి కల్పించడంతోపాటు  పనుల్లో పెట్టుకున్న వ్యాపారులపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. దీంతో వ్యాపార వర్గాల్లో వణుకు ప్రారంభమైంది. అదే క్రమంలో సదరు పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు.

ప్రచార రథాల ద్వారా పల్లెపల్లెన బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలలను పనిలో పెట్టుకుంటే తీసుకునే చర్యలపై అవగాహన  కల్పిస్తున్నారు. ఆపరేషన్‌ ముస్కాన్‌ఆపరేషన్‌ స్మైల్‌ జిల్లాలో విజయవంతమైందని అధికారులు చెబుతున్నారు. జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా 107 మంది బాలకార్మికులకు, జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా 105మందికి విముక్తి కల్పించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పిల్లలను పనుల్లో పెట్టుకోమని లిఖితపూర్వకంగా రాయించుకొని అప్పగించారు. అదే క్రమంలో చిన్నారులను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని వ్యాపారులకు హెచ్చరికలు జారీచేశారు. వారితో లిఖితపూర్వకంగా ధ్రువీకరణ తీసుకున్నారు. అధికారుల చర్యలు వ్యాపారులను హడలెత్తిస్తుండగా తల్లిదండ్రులు తమ పిల్లలను పనుల్లో పెట్టేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

జిల్లాలో నాలుగు సంరక్షణ కేంద్రాలు..
బాలకార్మికులకు విముక్తి కల్పిస్తున్న అధికారులు వారికోసం సంబంధీకులు రాని పక్షంలో వారి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో దివ్యదిశ హోం, ఖేడ్‌ మండలం నిజాంపేట్‌లో ఆర్నాల్డ్‌ హోం, ఇస్నాపూర్‌లో విజనరీ వెంచర్స్‌లో బాలురను ఉంచుతున్నారు. అమీన్‌పూర్‌లోని మహిమ మినిస్ట్రీస్‌ హోంలో బాలికలు, బాలురను ఉంచుతున్నారు. బాలకార్మికులకు విముక్తి కల్పించిన తర్వాత మొదటగా జిల్లా కేంద్రంలోని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఎదుట హాజరు పరుస్తారు. ఇందులో చైర్‌ పర్సన్‌గా శివకుమారి, సభ్యులుగా న్యాయవాది అశోక్, మహారాజ్, కైలాష్, ఆత్మారాం ఉన్నారు. వీరు పిల్లలతో మాట్లాడి కౌన్సెలింగ్‌ ఇస్తారు. అవసరమైతే పాఠశాలకు పంపడం, హోంలకు రెఫర్‌ చేయడం చేస్తారు.

బాలల చట్టాలపై అవగాహన..
బాలల చట్టాలపై అధికారులు అవగాహనా కార్యక్రమాలు  నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చిలో 100 గ్రామాలు, నవంబర్‌లో 100 గ్రామా ల్లో ప్రచారం నిర్వహించారు. ఈ ఏడాది మార్చిలో వంద పల్లెల్లో ప్రచారం చేశారు. ప్రత్యేకంగా ప్రచార రథాన్ని ఏర్పాటు చేసి బాలల హక్కులు, బాలకార్మిక చట్టాల, అక్రమ రవాణా నిరోధం, లైంగిక వేధింపులు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు.  త్వరలో మరో వంద గ్రామాల్లో ప్రచారం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

బాలల హక్కులు..
14ఏళ్లలోపు బాలలతో పనిచేయించడం బాలకార్మిక (నిషేధ, నియంత్రణ) చట్టం 1986 ప్రకారం నేరం. పనిచేయించిన యజమానులకు సెక్షన్‌ 14 ప్రకారం ఏడాది జైలు, రూ.20వేల జరిమానా విధిస్తారు. రెండోసారి ఇదే నేరం చేస్తే రెండేళ్ల జైలు శిక్ష.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు జిల్లా కార్మికశాఖ అధికారులు, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, చైల్డ్‌టోల్‌ఫ్రీ నం: 1098, 100కు ఫిర్యాదు చేయొచ్చు.
బాలల న్యాయచట్టం (సంరక్షణ) బాలలను రెండు వర్గాలుగా పరిగణిస్తోంది. సెక్షన్‌ 2(1) ప్రకారం 18ఏళ్లు నిండకుండా నేరం చేసిన బాలలను న్యాయమండలి పర్యవేక్షిస్తుంది. సెక్షన్‌ 2(డి) ప్రకారం వీధి బాలలు, భిక్షాటన చేస్తున్న బాలలు, జీవనాధారం లేని బాలలు, అనాథ బాలలు, బాలకార్మికులు, పారిపోయిన బాలలు, దీర్ఘకాలిక జబ్బులకు గురైన బాలలు, బాల్య వివాహ బాధిత బాలలు, వేధింపులకు గురైన బాలలకు బాలల సంక్షేమ సమితి పునరావాసం కల్పిస్తుంది.
చట్టవిరుద్ధంగా పిల్లలను పెంచుకోవడం, అమ్ముకోవడం నేరం. పిల్లలను ఇచ్చినా, తీసుకున్నా మూడేళ్ల కారాగార శిక్ష తప్పదు. ప్రభుత్వమే కోర్టు ద్వారా చట్టబద్ధంగా దత్తత ఇస్తుంది.
బాలలకు భారత రాజ్యాంగం ద్వారా 54 (అధికరణలు) హక్కులు వర్తిస్తాయి. వీటిలో ప్రధానంగా జీవించే హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్యపు హక్కు ఉన్నాయి.
బాలలను రక్షించడం, హక్కులను కాపాడేందుకు కొన్ని చట్టాలను తెచ్చారు. 18ఏళ్లలోపు ఆడపిల్ల, 21 ఏళ్లలోపు మగ పిల్లలకు వివాహాలు చేయడం 2006 బాల్యవివాహ నిషేధ చట్టం ప్రకారం నేరం. ఇలాంటి వివాహాలు చెల్లవు. బాల్య వివాహాలు నిర్వహించినా, ప్రొత్సహించినా, సహకరించినా రెండేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు.
బాలికలను రవాణా చేయడం అక్రమ రవాణా నిరోధక చట్టం 1956 ప్రకారం నేరం. అక్రమ రవాణా నిరోధానికి ఐసీడీఎస్‌ అధికారులు, తహసీల్దార్, 1098, 100లకు ఫిర్యాదు చేయొచ్చు.

చర్యలు తప్పవు
బాలలను పనుల్లో పెట్టుకుంటే సంబంధిత యజమానులపై కేసులు నమోదు చేస్తాం. పిల్లలను రక్షించి పునరావాసం కల్పిస్తాం. బాల కార్మిక చట్టాలపై ఇప్పటికే గ్రామాల్లో ప్రచార రథం ద్వారా ప్రచారం నిర్వహించాం. మరోసారి అవగాహన కల్పిస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లలను పనికి కాకుండా బడికి పంపించాలి.– రత్నం, జిల్లా బాలలసంరక్షణ అధికారి (డీసీపీఓ)

మరిన్ని వార్తలు