ఆపరేషన్‌ అనంతగిరి..!

30 Aug, 2019 10:09 IST|Sakshi

ఊరు ఖాళీ చేయాలి 

మధ్యమా‘నీరు’తొలుత అనంతగిరికే.. 

రూ.2,700 కోట్లతో కాళేశ్వరం ప్యాకేజీ–10 పనులు  

నిర్వాసితుల పునరావాసం వేగం 

పట్టాలు సిద్ధం.. ప్యాకేజీ ఖరారు 

సీఎం చేతుల మీదుగా నీటి విడుదలకు ఏర్పాట్లు

సిరిసిల్ల: కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ–10లో భాగంగా రూ.2700 కోట్లతో చేపట్టిన పనులు తుది దశకు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు నుంచి మరో దశకు నీటి మళ్లింపునకు రంగం సిద్ధమైంది. సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం అనంతగిరి (అన్నపూర్ణ) ప్రాజెక్టులోకి మధ్యమానేరు (శ్రీరాజరాజేశ్వర) నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే గోదావరి జలాలు లక్ష్మీపూర్‌ పంపుహౌస్‌ ద్వారా సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు జలాశయానికి 12 రోజులుగా చేరుతున్నాయి. మధ్యమానేరులో 13 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. అనంతగిరి జలాశయానికి గోదావరి జలాలను తరలించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకోసం అనంతగిరి ఊరును ఖాళీ చేయించేందుకు నోటీసులు జారీ చేశారు. నిర్వాసితులకు పునరావాసం కలి్పంచేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  

సర్జిపూల్‌ సిద్ధం 
మధ్యమానేరు బ్యాక్‌ వాటర్‌ను గ్రావిటీ ద్వారా ఒబులాపూర్‌ నుంచి తిప్పాపూర్‌ మహాబావి (సర్జిపూల్‌)కి మళ్లించే పనులు సాగుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద బావిని సిద్ధం చేశారు. 92 మీటర్లు లోతు, 56 మీటర్ల వెడల్పుతో సర్జిపూల్‌ను నిర్మించారు. మధ్యమానేరు నుంచి గోదావరి జలాలు 3.5 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా వచ్చి ఒబులాపూర్‌ సొరంగం ద్వారా తిప్పాపూర్‌లోని మహాబావికి చేరుతాయి. అక్కడ ఏర్పాటు చేసిన 106 మెగావాట్ల నాలుగు మోటార్లతో నీటిని అనంతగిరి రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తారు. ఇందు కోసం తిప్పాపూర్‌లో 440 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అనంతగిరి రిజర్వాయర్‌లో 3.5 టీఎంసీ నీటిని నిల్వ చేస్తారు. ఇప్పటికే నీటిపారుదలశాఖ అధికారులు తిప్పాపూర్‌లోని మోటార్లను వెట్‌రన్‌కు సిద్ధం చేశారు. అనంతగిరి రిజర్వాయర్‌ ద్వారా ఇల్లంతకుంట మండలంలోని 30 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది.  

పునరావాస ప్యాకేజీ సిద్ధం 
ఇల్లంతకుంట మండలం అనంతగిరి నిర్వాసితుల కోసం పునరావాస ప్యాకేజీని సిద్ధం చేశారు. ఆ ఊరిలో 837 కుటుంబాలు ఉండగా.. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులను కుటుంబా లుగా గుర్తించడంతో నిర్వాసితుల జాబితా 1,135 చేరింది. తంగళ్లపల్లి మండల కేంద్రం శివారులో 62 ఎకరాలు, అనంతగిరి పోచమ్మ ఆలయం సమీపంలో మరో 70 ఎకరాలను పునరావాసం కోసం ప్రభుత్వం సేకరించింది. ఇప్పటికే 737 కుటుంబాలకు రూ.7.50 లక్షల చొప్పున పునరావాస ప్యాకేజీని చెల్లించారు. 250 గజాల స్థలంతో కూడిన ప్లాట్లను ఇచ్చేందుకు లే అవుట్‌తో కూడిన పునరావాసం సిద్ధమైంది. 922 పట్టాలను పంపిణీకి సిద్ధం చేశారు. మరో 213 కుటుంబాలతో రెవెన్యూ అధికారులు సంప్రదింపులు సాగిస్తున్నారు. అనంతగిరి ఊరును ఖాళీ చేయిస్తేనే.. మధ్యమానేరు నీరు అన్నపూర్ణ ప్రాజెక్టులోకి మళ్లించే అవకాశం ఉంది. ఇందు కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ కృష్ణభాస్కర్, జేసీ యాస్మిన్‌బాషా, డీఆర్వో ఖీమ్యానాయక్, ఆర్డీవో శ్రీనివాస్‌రావులు తొలి ప్రాధాన్యతగా అనంతగిరి నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనుల్లో నిమగ్నమయ్యారు.

అనంతగిరి నుంచి రంగనాయక సాగర్‌కు..
అనంతగిరిలో నిల్వ చేసిన నీటిని సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌కు ఎత్తిపోస్తారు. ఇప్పటికే ఎత్తిపోతలకు సంబంధించిన పనులు తుది దశకు చేరాయి. రంగనాయకసాగర్‌ నుంచి కొండ పోచమ్మ, అక్కడి నుంచి మల్లన్నసాగర్‌కు గోదావరి జలాలను తరలించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. మధ్యమానేరులో 13 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. ముందుగా కరీంనగర్‌ వద్ద ఉన్న లోయర్‌ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ)కి నీటిని విడుదల చేశారు. కానీ అనంతగిరి ప్రాజెక్టును ముందుగా నీటితో నింపాలనే లక్ష్యంతో ఎల్‌ఎండీకి నీటి విడుదలను నిలిపి వేశారు. సిద్దిపేట జిల్లాకు గోదావరి జలాలను ముందుగా తరలించాలని ప్రభుత్వం భావిస్తుంది.

నీటి విడుదలకు సీఎం కేసీఆర్‌ 
మధ్యమానేరు నీటిని అనంతగిరి రిజర్వాయర్‌కు విడుదల చేసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే మధ్యమానేరు వద్ద హెలీప్యాడ్‌ సిద్ధం చేశారు. అనంతగిరి నిర్వాసితుల పునరావాసం పూర్తి అయితే.. మధ్యమానేరులోకి 16 టీఎంసీల నీరు చేరగానే అనంతగిరికి నీటి విడుదల ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మరో అద్భుతమైన జలదృశ్యం ఆవిష్కరణకు సిద్ధమైంది. 

పునరావాసానికి ఏర్పాట్లు
అనంతగిరి నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రెండు చోట్ల పునరావాస కాలనీలు ఏర్పాటు చేశాం. నిర్వాసితుల అభీష్టం మేరకు ప్లాట్లు కేటాయిస్తాం. ముందుగా అనంతగిరి వాసులు ఇళ్లు ఖాళీ చేయాల్సి ఉంటుంది. పునరావాస ప్యాకేజీకి మెజార్టీ నిర్వాసితులు అంగీకరించారు. సంతకాలు చేయని వారి విషయంలో చట్టం ప్రకారం ముందుకు వెళ్తాం.    
టి.శ్రీనివాస్‌రావు, ఆర్డీవో, సిరిసిల్ల

మరిన్ని వార్తలు