ఆపరేషన్ కష్టాలు

23 Dec, 2014 00:37 IST|Sakshi
ఆపరేషన్ కష్టాలు

చేవెళ్ల ఆస్పత్రిలో పడకల సంఖ్య 20
కు.ని. శస్త్రచికిత్సలు చేసింది 96 మందికి
బెడ్లు సరిపోక ఇబ్బందులకు గురైన మహిళలు
వసతుల కల్పనలో విఫలమైన యంత్రాంగం

చేవెళ్ల రూరల్:  కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకోవాలని ఒకవైపు భారీగా ప్రచారం చేస్తున్నా.. అందుకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించటంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. తరచూ ఇబ్బందుల మధ్యే ఆపరేషన్లు జరుగుతున్న విషయం జిల్లా వైద్యాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదనడానికి చేవెళ్లలో ఆపరేషన్లు చేయించుకున్న మహిళల అవస్థలే నిదర్శనం. ఆస్పత్రిలో ఉన్నవి 20 పడకలే అయినా 96 మంది మహిళలకు శస్త్రచికిత్సలు చేశారు.

అందరికీ బెడ్లు సరిపోక కొందరిని వరండాలోని నేలపై పడుకోబెట్టడంతో మహిళలు ఇబ్బందులకు గురయ్యారు. సోమవారం డివిజన్‌లోని నాలుగు మండలాల పరిధిలోని పీహెచ్‌సీల నుంచి  96 మంది మహిళలు కు.ని. ఆపరేషన్ల కోసం ఉదయాన్నే పస్తులతో వచ్చారు. కానీ ఆపరేషన్లను మధ్యాహ్నం మొదలుపెట్టి సాయంత్రం వరకు చేశారు. దీంతో మహిళలు చాలా నీరసించిపోయారు. దీనికి తోడు ఆస్పత్రి వద్ద ఎలాంటి సౌకర్యాలు లేకపోవటంతో ఇబ్బందులకు గురయ్యారు. ఆస్పత్రిలో ఉన్న 20 మంచాలపై ఇద్దరు చొప్పున 40 మందిని పడుకోబెట్టారు. మిగిలినవారిని వరండాలోని నేలపైనే విశ్రాంతి తీసుకున్నారు.

మహిళల వెంట వచ్చిన కుటుంబ సభ్యులకు ఆరుబయట వేసిన చిన్న టెంటు సరిపోకపోవటంతో చెట్ల కిందనే నిరీక్షించారు. తాగునీరు, బాత్‌రూంలు లేక అవస్థల పాలయ్యారు. ఒకేసారి  ఇంత పెద్దమొత్తంలో వచ్చేవారికి ఆస్పత్రిలోని బెడ్లు సరిపోవని వైద్యాధికారులు తెలిపారు. మొదట ఆపరేషన్ పూర్తయినవారిని పంపిస్తూ.. ఆ తర్వాత చేసేవారికి బెడ్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. సాధ్యమైనంత వరకు అన్ని సౌకర్యాలూ కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కు.ని. ఆపరేషన్లలో వైద్యులు జయమాలిని,  క్యాంపు ఇన్‌చార్జి కరీమున్నీషా, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు