బాలకార్మికులకు బంధవిముక్తి

1 Jul, 2019 12:42 IST|Sakshi

నేటి నుంచి ‘ఆపరేషన్‌ ముస్కాన్‌’

సాక్షి, (కరీంనగర్‌) : బాలకార్మికులను వ్యవస్థను నిర్మూలించేందుకు బడి బయట వెట్టిచాకిరీలో మగ్గుతున్న బాలబాలికలను గుర్తించి తిరిగి పాఠశాలలకు పంపించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం ఆపరేషన్‌ ముస్కాన్‌. ఐదేళ్లుగా ప్రభుత్వం ఏటా జూలైలో ఈ కార్యక్రమం చేపట్టి బాలకార్మికులను బంధ విముక్తులను చేస్తోంది. చిన్నారుల మోములో చిరునవ్వు పూయిస్తోంది. సోమవారం నుంచి జూలై 30 వరకు నిర్వహించే ఆపరేషన్‌ ముస్కాన్‌  పోలీస్‌శాఖ, ఐసీడీసీఎస్‌ శాఖ ప్రణాళిక రూపొందించింది. రెండు శాఖలు సంయుక్తంగా వివిధ ప్రాంతాల్లో పనులు చేస్తున్న లేదా బడికి వెళ్లని బాల కార్మికులను,  ఇతర ప్రాంతాల నుంచి తప్పిపోయి వచ్చి కార్మికులుగా మారిన బాలలను, భిక్షాటన చేసే వారిని, అనాథలుగా ఉన్న వారిని గుర్తించి వారిని  వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పిస్తారు. తిరిగి బడిబాట పట్టెలా చర్యలు తీసుకుంటారు.

ఆపరేషన్‌ స్మైల్, ముస్కాన్‌..
బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా లేకుండా చేసేందుకు 2015 నుంచి ఆపరేషన్‌ స్మైల్, ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. బాలకార్మికులను, బిక్షాటన, వెట్టిచాకిరీ చేస్తున్న వారిని గుర్తించి వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం, అనాథలను ఆనాథశ్రయాలకు పంపించడం, వారికి మెరుగైన విద్య అందించేందదుకు చర్యలు తీసుకునేందుకు ఈ రెండు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఏటా జనవరి 1 నుంచి 30 రోజులు పాటు ఆపరేషన్‌ స్మైల్‌ నిర్వహిస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో మళ్లీ జులై 1 నుంచి 30 రోజులు ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరిట బాల కార్మికుల వ్యవస్థ లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 2015 నుంచి స్మైల్‌ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఐదుసార్లు నిర్వహించగా, ముస్కాన్‌ ఇప్పటి వరకు నాలుగుసార్లు నిర్వహించారు. ఐదో విడత సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. ఐదుసార్లు నిర్వహించిన స్మైల్, నాలుగుసార్లు నిర్వహించిన ముస్కాన్‌ కార్యక్రమాల్లో ఇప్పటి వరకు 2,700 మంది బాలబాలికలను గుర్తించారు. వారిని బాల సంరక్షణ కమిటీ ఎదుట హాజరుపరిచి ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉంటే వారి తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించారు.

పలు శాఖల సమన్వయం..
ఆపరేషన్‌ స్మైల్, ముస్కాన్‌ కార్యక్రమాల్లో పలు శాఖలను భాగస్వాములు చేస్తున్నారు. పోలీస్, స్త్రీ,శిశు సంక్షేమశాఖ, స్వచ్ఛంద సంస్థలు, కార్మికశాఖ, విద్య, వైద్యశాఖలు, రెవెన్యూ, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు చెందిన సిబ్బందితోపాటు పలువురు సామాజిక కార్యకర్తలను కూడా భాగస్వాముల చేస్తూ బాల కార్మికుల వ్యవస్థను రూపుమాపేందుకు కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 

బడి బయటే బాల్యం
బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనే ధ్యేయంగా ఆపరేషన్‌ స్మైల్, ముస్కాన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇది మున్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. పలు కుటుం బాలు ఆర్థిక స్థోమత, ఇళ్లలో ఉం టున్న ఇబ్బందులు మూలంగా పిల్లలను తిరిగి పనికి పంపుతున్నారు. వారిని పట్టుకుని ఇంటికి పంపిస్తున్నా వారు మళ్లీ్ల పనికి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. దీనితో బాలకార్మికులు అలాగే ఉండిపోతున్నారు. బాలలు కార్మికులుగా మారడానికి కారణాలు తెలుసుకుని వాటిని నిర్మూలించినప్పుడే బాలకార్మికులు మళ్లీ కార్మికులు మారకుండా బడికి వెళ్లడానికి సిద్ధపడతారు.

కొందరు అనాథగా ఉన్న వారు సంరక్షణ కేంద్రాల్లో కొంతకాలం ఉంటున్నారు. వివిధ పరిస్థితుల ప్రభావంతో మళ్లీ అక్కడి నుంచి బయటపడి కార్మికులుగా మారుతున్నారు. మంచి లక్ష్యంతో ముందుకు సాగుతున్నా అయా శాఖల సమన్వయంతోనూ ఇబ్బందులు వస్తున్నాయి. పలు శాఖల భాగస్వామ్యం ఉన్నా కూడా పోలీస్, ఐసీడీసీఎస్‌ శాఖలు మాత్రమే బాధ్యతాయుతంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికైనా అన్ని శాఖల అధికారులు స్పందించి 30 రోజులు నిర్వహించే ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగస్వాములై బాల కార్మికులు లేకుండా చేసేందుకు ముందుకు సాగాలని ప్రజలు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు