ఆపరేషన్ ‘సెర్చ్’

18 Jul, 2014 03:17 IST|Sakshi
ఆపరేషన్ ‘సెర్చ్’
  •      నేరగాళ్ల కోసం సైబరాబాద్ పోలీసుల సెర్చ్ ఆపరేషన్
  •      అర్ధరాత్రి సూరారంలో ప్రయోగాత్మకంగా ప్రారంభం
  •      పాల్గొన్న 250 మంది పోలీసులు
  •      ఐదు గంటల్లో 500 ఇళ్లు సోదా
  •      అదుపులో 21 మంది అనుమానితులు, 30 వాహనాల స్వాధీనం
  • దాదాపు 200 మంది పోలీసులు ఉన్నట్టుండి ఓ బస్తీని రౌండప్ చేశారు. అక్కడి నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా, లోపలకు రాకుండా కట్టుదిట్టం చేశారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారి 5 గంటల వరకు ఏకబిగిన సోదాలు.. ప్రతి ఇల్లు.. ప్రతి అంగుళం తనిఖీలు..అనుమానితుల విచారణ... నేరాలను నిరోధించే లక్ష్యంతో సైబరాబాద్ పోలీసులు బుధవారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ ఇది. ప్రయోగాత్మకంగా సూరారం గ్రామంలో దీన్ని అమలు చేశారు.
     
    సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇక అసాంఘిక శక్తులు మకాం వేయలేవు. ఒక వేళ దొంగలు, దోపిడీ గ్యాంగ్‌లు, హంతక ముఠాలు ధైర్యం చేసి మకాం వేసినా రాత్రికి రాత్రే పోలీసు దండు వారుండే బస్తీపై విరుచుకుపడుతుంది. దుండగులు ఏ మూల నక్కినా ఇట్టే పట్టేస్తుంది. ప్రపంచంలోనే హైదరాబాద్‌ను ఉత్తమ నగరంతో పాటు నేరరహితంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇచ్చిన పిలుపుకు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పందించారు.  

    ఇందులో భాగంగా క్రైమ్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన నేరగాళ్ల ఆగడాలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు సరికొత్త పంథాలు అనుసరించాలని నిర్ణయించారు. పాత, కొత్తనేరస్తులు నివాసముండే బస్తీలు, కాలనీలపై డేగ కన్ను పెట్టాలని సూచించారు. దీంతో పాటు ఆయా బస్తీలపై ఆకస్మిక దాడులు చేసి, విస్తృతంగా సోదాలు నిర్వహించి నేరరహిత ప్రాంతంగా మార్చాలని ఆదేశించారు. నేరం జరిగాక నేరస్తుల కోసం గాలించడం కంటే... ముందుగానే గాలింపు చేపడితే నేరం జరగకుండా నిరోధించేందుకు అవకాశం ఉంటుందని కమిషనర్ అధికారులకు సూచించారు.
     
    సెర్చ్ ఆపరేషన్...
     
    కమిషనర్ ఆదేశాల మేరకు ప్రయోగాత్మకంగా మొదటిసారి దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోని సూరారం గ్రామాన్ని సెర్చ్ ఆపరేషన్‌కు ఎంచుకున్నారు.  ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, బెంగాల్, జార్ఖండ్‌లకు చెందిన వారు ఎక్కువగా నివాసం ఉంటుంటారు.  బైక్ దొంగలు, ఇళ్లు దోచుకునేవారు, దృష్టిని మరల్చి నేరం చేసేవారు, కేడీలు, అక్రమ ఆయుధాలు కల్గినవారు, స్నాచర్లు, నేర చరిత్ర ఉన్నవారు ఎక్కువగా ఇక్కడే ఉన్నారు.  దీంతో సూరారం భౌగోళిక స్థితిని మరియు రహదారులను గుర్తించిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు.
     
    ఇలా జల్లెడ పట్టారు...
     
    బుధవారం అర్ధరాత్రి దాటాక క్రైమ్ అదనపు డీసీపీ జి.జానకీషర్మిల ఆధ్వర్యంలో ముగ్గురు ఏసీపీలు శ్రీనివాసరావు, నంద్యాల నర్సింహారెడ్డి, ఎం.రజనితో పాటు 20 మంది ఇన్‌స్పెక్టర్లు, 50 మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు, 150 మంది కానిస్టేబుళ్లు సూరారం బస్తీపై విరుచుకుపడ్డారు. సోదాలు చేస్తున్నంత సేపు బస్తీలోకి, బయటకు ఎవ్వరినీ అనుమతించలేదు.  బస్తీలోని ప్రతీ ఇల్లు.. ముఖ్యంగా నేరగాళ్ల నివాసాల్లో సోదాలు చేశారు. గురువారం ఉదయం 5 గంటల వరకు జరిగిన ఈ సోదాల్లో మొత్తం 500 ఇళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10 మంది పాతనేరస్తులు, 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతో పాటు 20 బైక్‌లు, 10 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. తాము ఎలాంటి ఫిర్యాదు ఇవ్వకపోయినా నేరగాళ్ల కోసం పోలీసులు ఇలా ఆకస్మిక తనిఖీలు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
     
     నేరస్తులపై డేగకన్ను

     ఇలాంటి ఆపరేషన్లు ఇక నుంచి రోజూ కొనసాగుతాయి. ఇప్పటికే నేరస్తులపై డేగకన్ను పెట్టాం. అనుమానం ఉన్న ప్రతీ బస్తీ, కాలనీని ఏ క్షణంలోనైనా రౌండప్ చేసి సోదాలు చేస్తాం. సోదాల సమయంలో సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడడమే పోలీసుల విధి. ఇందుకోసం బస్తీ పెద్దల సహకారం కూడా తీసుకుంటున్నాం. నేరస్తులు సైబరాబాద్‌లో అడుగుపెట్టాలంటేనే దడ పుట్టేలా చేస్తాం. అంతర్రాష్ట్ర ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టాం. వారి కదలికలపై వాసన వస్తే చాలు ఇట్టే పట్టేస్తాం. ఇందు కోసం యాంటీ క్రైమ్ బృందాలను సైతం పటిష్టం చేశాం.      
     -సీవీ ఆనంద్. సైబరాబాద్ పోలీసు కమిషనర్ ( ఫైల్)
     

మరిన్ని వార్తలు